Business

తొలిసారి పతనమైన ఫేస్ బుక్ వినియోగదారుల సంఖ్య

తొలిసారి పతనమైన ఫేస్  బుక్ వినియోగదారుల సంఖ్య

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఆ సంస్థ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారి రోజువారీ వినియోగదారుల సంఖ్య తగ్గింది. డిసెంబర్ తో ముగిసే త్రైమాసికానికి ఈ సంఖ్య 1.929 బిలియన్లకు పడిపోయింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 1.930 బిలియన్లుగా ఉంది. దీంతోపాటు ప్రత్యర్థి సంస్థలైన టిక్ టాక్, యూట్యూబ్ నుంచి పోటీ పెరిగిపోవడంతో ఆదాయాలు తగ్గుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. ఫలితంగా ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా షేర్లు ట్రేడింగ్ ఆఫ్టర్ హవరులో 20 శాతం మేరకు కుంగాయి. దీంతో ఫేస్ బుక్ మార్కెట్ విలువలో ఏకంగా 200 బిలియన్ డాలర్ల పతనం చోటు చేసుకొంది. మరోపక్క ట్విటర్, పిన్ ట్రస్ట్, స్నాప్ షేర్లు కూడా పతనం అయ్యాయి.

వినియోగదారుల సంఖ్యలో తగ్గుదలపై మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ .. ముఖ్యంగా యువ వినియోగదారులు ఫేస్ బుక్ ను వీడి ప్రత్యర్ధి ప్లాట్ ఫాంలకు వెళ్లిపోతుండటంతో సంస్థ వ్యాపారం తగ్గుతోందని వెల్లడించారు. ఇప్పటికే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్లో మార్పులతో ఫేస్ బుక్కు సమస్యలు మొదలయ్యాయి. ఈ మార్పుల కారణంగా ఫేస్ బుక్కులో ఆయా వాణిజ్య సంస్థలు తమ ప్రకటనలు .. వినియోగదారులను ఎంత మేరకు ప్రభావితం చేశాయో కనుక్కోవడం కష్టంగా మారింది. ప్రపంచంలోనే గూగుల్ తర్వాత అతిపెద్ద డిజిటల్ వాణిజ్య ప్రకటనల ప్లాట్ఫామ్ మెటాకు పేరుంది.