Politics

TNI నేటి రాజకీయం – 03/02/2022

TNI నేటి రాజకీయం – 03/02/2022

* టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై దాడి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి దిగారు కొంతమంది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారుపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు ఎన్ఎస్ యూఐ సభ్యులు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు ఎన్ఎస్ యూఐ సభ్యులు. ఆయన కారుపై కోడిగుడ్లు కొట్టారు. ఎన్ఎస్ యూఐ సభ్యులు చర్యతో ఆగ్రహించిన మంచిరెడ్డి అనుచరులు..గన్ వెమన్ వెంటనే కారు దిగి మరీ వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని పట్టుకుని చితక్కొట్టినట్లుగా తెలుస్తోంది. మా నాయకుడి వాహనాన్నే అడ్డుకుంటారా? దాడులు చేస్తారా? అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో సాగర్ హైవేపై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. రోజుల క్రితం ఎన్ఎస్ యూఐ నేతలు ఎమ్మెల్యే కాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అప్పుడు కూడా ఉద్రిక్తత ఏర్పడింది. అప్పుడు కూడా కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. వెంబడించి మరీ కొట్టారు.

* ఫిబ్రవరి నెలాఖరుకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలి: సీఎం జగన్‌
కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని), వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌పోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు.

* కేంద్రం వైఖరితో తెలంగాణకి తీవ్ర అన్యాయం: మంత్రి కేటీఆర్‌
కేంద్రం వైఖరితో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణంలో ఆయన మాట్లాడారు. నేతన్నలను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరితే స్పందన లేదన్నారు. దున్నపోతు మీద వాన పడ్డట్లుగా కేంద్రం తీరు ఉందన్నారు. ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా తెలంగాణకు ఏమీ ఇవ్వలేదన్నారు. కేంద్రం జీఎస్టీ వేసి వస్త్ర పరిశ్రమను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.

* జయంత్‌ను అఖిలేశ్ ముంచేస్తాడు : అమిత్ షా
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం కూటమి కట్టిన సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌లను విడదీయడానికి కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరిని మచ్చిక చేసుకునేందుకు మరోసారి ప్రయత్నించారు. అఖిలేశ్ యాదవ్ గత చరిత్రను గుర్తు చేస్తూ జయంత్‌ను హెచ్చరించారు.

* కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే: కేజ్రీవాల్
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, కాంగ్రెస్ నేతలను గెలిపించిన అనంతరమే వారు భారతీయ జనతా పార్టీలో చేరిపోతారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పనాజీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీని రాష్ట్రం నుంచి తరిమేయాలంటే ఆప్‌కు ఓటేయాలని గోవా ఓటర్లకు పిలుపునిచ్చారు.‘‘గోవా ప్రజలకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఆప్‌కు ఓటేయడం, రెండు బీజేపీకి ఓటేయడం. అవినీతిలేని పాలన, నిజాయితీగల ప్రభుత్వం కావాలనుకుంటే ఆప్‌కు ఓటేయండి. ఇక రెండో అవకాశం బీజేపీ. బీజేపీకి రెండు రకాలుగా ఓటేయొచ్చు. నేరుగా, పరోక్షంగా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటేసినట్టే. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు గెలిచిన అనంతరమే బీజేపీలో చేరతారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.

* రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అంబేద్కరే చెప్పారు: ఎంపీ వెంకటేష్ నేత
పాలించే పాలకులు సరిగా లేనపుడు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అంబేద్కరే చెప్పారని టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. తాము కొత్త రాజ్యంగం కావాలన్నామన్నారు. కొత్త బట్టలు కావాలి అంటే పాతవి పడేయమని కాదని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయన్నారు. కొంత మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా దీక్షలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పకుండా దీక్షలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బీజేపీ రాజ్యాంగంగా మారిందని ఆయన ఆరోపించారు.

* తిన్నది అరగక పాదయాత్రలు: ఎంపీ కవిత
తిన్నది అరగకనే ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 95 నుంచి 105 సీట్లు వస్తాయని కేసీఆర్‌ అనడంతో బీజేపీ, కాంగ్రెస్‌లో వణుకు పుడుతోందన్నారు. ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగం ఉండాలని కేసీఆర్ చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఆదానీ, అంబానీలకు మేలు చేసే విధంగానే బడ్జెట్ ఉందని ఆమె ఆరోపించారు.

* కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది: లంకా దినకర్‌
రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని బీజేపీ నేత లంకా దినకర్‌ అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన మూలధన వ్యయంతో కూడిన పథకాలకు. రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే లక్ష్యం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లుగా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడంతో చాలా అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు కదలని పరిస్థితి ఉందన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ విధులను నిబంధనల మేరకు నిర్వర్తించడంలో బాధ్యతగా ఉంటే గరిష్టంగా మేలు చేకూరుతుందని ఆయన తెలిపారు.

* కేసీఆర్‌ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌లవి అనవసర ఆరోపణలు: జగదీష్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌లవి అనవసర ఆరోపణలని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌లు అనేకసార్లు రాజ్యాంగ సవరణలు చేశాయన్నారు. ప్రతిపక్షాలు ఎందుకు ఇంతలా ఉలిక్కి పడుతున్నాయని ప్రశ్నించారు. దేశంలో మార్పు కోసం సీఎం కేసీఆర్ చేయబోయే ప్రయత్నానికి.. అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని పిలుపు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి రాజకీయ వ్యూహకర్త అవసరం లేదన్నారు. కేసీఆరే మాకు పెద్ద దిక్కని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

* రైతులకు రుణమాఫీ చేసింది బీజేపీనే: అమిత్ షా
రైతులకు రుణమాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని ఏర్పాలు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు బీజేపీ ఎంతగానో చేసిందని, గత ప్రభుత్వ హయాంలో రైతులను దోచుకోవడం తప్పితే చేసిందేమీ లేదని విమర్శించారు.

* సీఎం కేసీఆర్ మాటలు దేశంపై దాడిగా చూడాలి: భట్టి విక్రమార్క
రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు దేశంపై దాడిగా చూడాలని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే చట్టబద్ధతను రాజ్యాంగం‌ కల్పించిందన్నారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమే అని రాజ్యాంగం చెప్పిందని, ఇప్పుడు సీఎం ప్రకటనతో కేసీఆర్ మేకవన్నె పులి అని తెలిపోయిందన్నారు. అందరం ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపిచ్చారు

* రాయలసీమను 14 జిల్లాలుగా చేయాలి: బైరెడ్డి
రాయలసీమను 14 జిల్లాలుగా చేయాలని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ప్రజల దగ్గరకు పాలన అందిస్తే, జగన్ ప్రజలకు దూరంగా పరిపాలన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నందికొట్కూరును కర్నూలు జిల్లాలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాల విభజన అవకతవకలుగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

*కేసీఆర్ మనసు మార్చాలని మొక్కుకున్న: షర్మిల
మేడారంలో సమ్మక్క సారలమ్మలను వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మనసు మార్చాలని అమ్మలను మొక్కుకున్నానన్నారు. అడవి బిడ్డల మీద ప్రేమ చూపేలా సీఎం కేసీఆర్ మనస్సు మార్చాలని ఆ సమ్మక్క సారాలమ్మ తల్లులను వేడుకున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇచ్చేలా చూడాలని కోరుకున్నానన్నారు. ఆదివాసీల పొడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న సాగుదారులకు హక్కులు కల్పించాలని, రైతుబందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆత్మహత్యలు ఆపేలా చూడాలని, కేసీఆర్ కళ్ళు తెరిపించాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.

* ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసనలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్యోగుల ఆందోళనలపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. కొత్త పీఆర్సీ జీవోలను వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై అహంకారంతో కాకుండా.. ఆలోచనతో స్పందించాలని చంద్రబాబు సూచించారు.

* తెలంగాణలో ప్రధాన మంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు: సీఎస్
ప్రధాన మంత్రతి నరేంద్రద మోదీ ఈ నెల 5 తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన ముచ్చింతల్, ఇక్రిసాట్ లలో జరిగే కార్యక్రకమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పీఎం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. పర్యటన ఏర్పాట్లకు సంబంధించి గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం బీఆర్కే భవన్ లో నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతోపాటు,ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్త్ ను బ్లూ బుక్‌ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు.

* ఉద్యోగులు పర్మినెంట్.. మనం ఉండేది ఐదేళ్లే..: రఘురామ
పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైందని, ఉద్యోగుల మహాప్రభంజనం కనిపిస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని జగన్‌ అన్నారు.. మరి ఇప్పుడు పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులు పర్మినెంట్ అని, మనం ఉండేది ఐదేళ్లేనన్నారు. శ్రీశ్రీ స్పూర్తితోనే ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారన్నారు. అభినవ రోమ్ చక్రవర్తిలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. కొంతమంది అమరావతి రాజధాని కాదని అంటున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చింతామణి నాటక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి క్యారెక్టర్‌ను తీసేద్దామని ఎంపీ రఘురామ సూచించారు.

* ప్రభుత్వం చర్చిలు కట్టడమే లౌకికవాదమా?: సాధినేని యామిని
జిన్నా టవర్ వద్ద వైసీపీ నేతలు అవివేకాన్ని మరోసారి చాటుకున్నారని బీజేపీ నాయకురాలు సాధినేని యామిని పేర్కొన్నారు. మత సామరస్యం గురించి హోంమంత్రి సుచరిత తమకు చెప్పాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వం చర్చిలు కట్టడమే లౌకికవాదమా? అని యామిని ప్రశ్నించారు. లక్షలాది మరణాలకు కారణమైన జిన్నా దేశ భక్తుడా? అని నిలదీశారు. జిన్నా టవర్ పేరు మార్పు జాతీయ వాదానికి సంబంధించిన అంశమని.. ప్రజల వద్దకే వెళ్తామని… చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని యామిని సూచించారు.

* ఆగ్రా కోటాలో పాగా వేసేదెవరో..!
ఉత్తరప్రదేశ్‌లో పెద్ద జిల్లాల్లో ఒకటైన ఆగ్రాలో ఆధిపత్యం సాధించేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. జాటవ్, బ్రాహ్మణ, ఠాకూర్, జాట్, ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలోని 9 నియోజకవర్గాలను మరోమారు క్లీన్‌స్వీప్‌ చేసేందుకు అధికార బీజేపీ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుండగా, 30 ఏళ్ల తమ పార్టీ చరిత్రలో ఒకేఒక్కసారి ఒకేఒక్క సీటును గెలుచుకున్న ఎస్పీ ఈ మారు చరిత్ర తిరిగిరాసే యత్నాల్లో మునిగింది.యాభై లక్షలకు పైగా జనాభా ఉన్న ఆగ్రాలో ఆగ్రా కాంట్, ఆగ్రా నార్త్, ఆగ్రా రూరల్, ఆగ్రా సౌత్, బాహ్,ఎత్మాద్‌పూర్,ఫతేహాబాద్, ఫతేపూర్‌సిక్రీ, ఖేరాఘర్‌ నియోజకవర్గాలున్నాయి. బాహ్‌ పరిధిలో బ్రాహ్మణ ఓటర్లు అధికంగా ఉండగా, రెండో స్థానంలో ఠాకూర్‌లు ఉన్నారు. ఫతేపూర్‌సిక్రీ, ఖేరాఘర్, ఎత్మాద్‌పూర్‌లో బ్రాహ్మణ, ఠాకూర్‌ల ఆధిపత్యం ఉన్నప్పటికీ మల్లాలు,కుష్వాహా, జాటవ్, వాల్మీకిలు గణనీయ సంఖ్యలో ఉన్నారు.

* ఉద్యోగుల పట్ల సీఎం జగనే ప్రథమ ముద్దాయి: నారాయణ
ఉద్యోగుల పట్ల సీఎం జగనే ప్రథమ ముద్దాయి అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆడే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. పెరిగిన జీతాలు వద్దని‌‌.. పాత జీతాలే కావాలని ఉద్యోమం చేయటం ఇదే మెదటసారి అన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి సీపీఐ నారాయణ సంపూర్ణ మద్దతు తెలిపారు.

* కేంద్ర పెద్దలకు దమ్ముంటే ఆ అంశంపై చర్చకు రావాలి: గువ్వల బాలరాజు
కేంద్ర బడ్జెట్‌లో దళితులు, పేదలకు అన్యాయం జరిగిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. కేంద్ర పెద్దలకు దమ్ముంటే సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజ్యాంగ హక్కుల కోసం పోరాడితే ఈడీ ప్రయోగిస్తున్నారని వాపోయారు. ఈడీ దాడులకు బెదిరేది లేదని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.

* సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: మల్లు రవి
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎందుకు రాజ్యాంగం మార్చాలో సీఎం వివరంగా చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోదీ రాజ్యాంగాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పొరాటం చేస్తుందని మల్లు రవి స్పష్టం చేశారు.

* ఉద్యోగుల పోరాటం సఫలీకృతం కావాలి: Sailajanath
అత్యధికమైన పీఆర్సీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ కోసం ఉద్యోగుల చేస్తున్న పోరాటం సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. బీజేపీ… జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాకు తెరతీసి అమరావతే రాజధాని అని నరేంద్రమోడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడే ధైర్యం లేని పిరికి వాళ్లు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్లు అని వ్యాఖ్యలు చేశారు. జగన్ పడుకున్నారో మేలుకున్నారో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. స్టిక్కర్లు వేసుకుని రోడ్లపై తిరగడం, ల్యాండ్ స్కాంలలో ఎమ్మెల్యేలు ఇన్‌వాల్వ్ అవుతూ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. భారతీ సిమెంట్స్ కోసం కాకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన హామీల అమలు కోసం నోరు తెరవాలని డిమాండ్ చేశారు. దేశంలో లౌకికవాదానికి ప్రమాదం వస్తోందన్నారు. దేశ ప్రజల ఆస్తులను ఒకరిద్దరికి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతలో రోడ్ల దుస్థితిపై ప్రత్యక్ష కార్యాచరణకు ఈ నెల 10న ప్రచార కార్యక్రమంతో పాటు కార్యాలయాల ముట్టడి చేయనున్నట్లు శైలజానాథ్ తెలిపారు.

* రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కేసీఆర్ వ్యాఖ్యలు: Etela
తెలంగాణ సాధించడంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఉపయోగపడిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ జై భీమ్ దీక్షలో ఈటెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత రాజ్యాంగాన్ని అవమాన పరిచేవిధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎంగా కేసీఆర్ వచ్చాక ధర్మం, న్యాయం లేకుండా పోయిందన్నారు. కొడుకు, మనవడు, ముని మనవడు రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకుంటున్నారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు.

* కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? కేసీఆర్‌కి బుద్ధుందా?: బండి సంజయ్
సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని… తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేసీఆర్ తీరును తెలియజేశామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంకా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలోని అన్ని కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పాలభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అహంకారంతో మాట్లాడుతున్నారు. కేసీఆర్‌కి ఎందుకు ఇంత అహంకారం? రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారా? పంచతీర్దాల పేరుతో అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాలు ఏర్పాటు చేశాం. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? సచివాలయం వద్దు గడీలు కట్టుకోవాలని అనుకుంటున్నారా..? కేసీఆర్‌కి బుద్ధి ఉందా? కుటుంబ పాలన గురించి ఎవరు ప్రశ్నించొద్దు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. దళిత సమాజాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్. రాజ్యాంగం పక్కన పెట్టి.. కల్వకుంట్ల రాజ్యాంగం ఉండాలి. తన విగ్రహాలు పెట్టాలని కేసీఆర్ అనుకుంటుండు. బ్రిటిష్, నిజాం పాలన చూశాము. అదే విధంగా మిమ్మల్నీ తరిమి కొడతాం’’ అని హెచ్చరించారు.

* ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నెం.2 స్థానంలో నిలిపాం : యోగి ఆదిత్యనాథ్
గడచిన ఐదేళ్ళలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వ పాలనా కాలంలో మతపరమైన హింసాత్మక సంఘటనలు, ఉగ్రవాద దాడులు జరగలేదన్నారు. పెట్టుబడిదారులకు ప్రధాన ఎంపికగా తమ రాష్ట్రాన్ని నిలిపామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తన నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను 14 నుంచి రెండో స్థానానికి తీసుకెళ్లిందన్నారు. అంతకుముందు పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారని చెప్పారు. అగ్ర స్థానంలో ఉన్న మూడు రాష్ట్రాలనే వారు ఎంపిక చేసుకుంటారన్నారు. టెక్నికల్, ఇతర రంగాలవారీగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందన్నారు. తన ప్రభుత్వ కృషి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంలో రెండో స్థానానికి చేరిందని తెలిపారు. కేవలం ఐదేళ్ళలోనే తాము దీనిని సాధించినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తలసరి ఆదాయం సంవత్సరానికి రూ.47,000 ఉండేదని, ఇప్పుడు దీనిని రూ.54,000కు తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లకు పెంచామన్నారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల వచ్చిన సంక్షోభాన్ని తన ప్రభుత్వం దీటుగా ఎదుర్కొందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి వయోజన వ్యక్తి కోవిడ్ టీకా మొదటి మోతాదును తీసుకున్నారని, సుమారు 70 శాతం మంది అర్హులు రెండు మోతాదులు తీసుకున్నారని తెలిపారు. ఈ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనడంలో తమ రాష్ట్రాన్ని దేశానికి ఓ ఉదాహరణగా నిలిపామని చెప్పారు. 403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌ శాసన సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.

*చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్దం‌: Suchrita
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనపై హోంమంత్రి సుచరిత స్పందించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని… చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్ధమని అన్నారు. ఉద్యోగులు సహకరించాలని సీఎం కూడా చెప్పారన్నారు. చర్చలకు కమిటీ కూడా వేశామని తెలిపారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఉద్యోహల హౌస్ అరెస్టులు ఏమీలేవన్నారు. అనుమతి లేని సభలకు వెళ్ళవద్దని చెప్పామని తెలిపారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు
*ద్దళితులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడు: Rajasingh
దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ శపించారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్‌ను కిందకు దించుతారని హెచ్చరించారు. బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారన్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రజలు రోడ్డు మీదకు ఈడ్చుతారని కేసీఆర్‌కు అర్థమైందని అన్నారు. తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే కేసీఆర్ చదువుతారని యెద్దేవా చేశారు. బడ్జెట్ గురించి కాకుండా బీజేపీని తిట్టడం‌ కోసమే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు.

*పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన ఈ నెల 6న?
పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్‌కు కాంగ్రెస్ త్వరలో తెర దించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూలలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6న ప్రకటిస్తారని సమాచారం. పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 20న జరుగుతాయి. ఆదివారంనాడు (ఈ నెల 6న) రాహుల్ గాంధీ పంజాబ్‌లో పర్యటిస్తారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తామని జనవరి 27న రాహుల్ పంజాబ్‌లో పర్యటించినపుడు చెప్పారు. పార్టీ కార్యకర్తలను సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తమలో ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ సహకరిస్తామని సిద్ధూ, చన్నీ హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం అభ్యర్థిని ప్రకటించాలని సిద్ధూ డిమాండ్ చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు. ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. శక్తి యాప్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆమె కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీనే సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఆయన షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఆయనకు సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నట్లు సమాచారం. చన్నీ ఈ ఎన్నికల్లో చమ్‌కౌర్, భడౌర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

*కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ స్పందించాలి: జవహర్
దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడటం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్తో పాటు దేశ ప్రజల్నీ అవమానించడమేనని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల్ని సీఎం జగన్రెడ్డి ఎందుకు ఖండించలేదని, తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

*వేల కోట్లు దోచుకుంటున్నారు: సోము
‘‘జగన్ ఎన్నో హామీలిచ్చారు. అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. ఆదాయం పెంచుకునే ప్రణాళికా లేదు. వేల కోట్ల విలువైన గనులన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఇసుక, ఎర్రచందనం నుంచి వస్తున్న వేల కోట్లను దోచుకుంటున్నారు’’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులను జగన్ సర్కారు నిర్బంధించడమంటే తనను తాను బంధించుకోవడమే అని వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో కేంద్రంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

*విదేశాంగ విధానంలో తప్పిదం వల్లే చైనా, పాక్ చేరువయ్యాయి: రాహుల్
కేంద్ర విదేశాంగ విధానంలోని పొరపాటు వల్లే పాకిస్థాన్, చైనా దగ్గరయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ బుధవారంనాడు లోక్సభలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ”మన విదేశాంగ విధానంలో ప్రాథమిక పొరపాట్ల వల్ల భారత్, చైనా దగ్గరయ్యాయి. భారత ప్రజల పట్ల మీరు చేసిన అతిపెద్ద పాపం ఇది. చైనాకు చాలా స్పష్టమైన ప్లాన్ ఉంది. దానిని డోక్లాం, లద్దాఖ్లలో వాళ్లు అమలు చేశారు. భారతదేశానికి ఇది చాలా తీవ్రమైన ముప్పులాంటింది. విదేశాంగ విధానంలో మనం చాలా పెద్ద పొరపాటు చేశాం” అని రాహుల్ అన్నారు.

* వీరుల త్యాగంతోనే స్వేచ్ఛ: హోంమంత్రి సుచరిత
దేశంలో ఎందరో వీరుల త్యాగంతోనే మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని హోంమంత్రి సుచరిత అన్నారు. పట్టణంలో జిన్నా టవర్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దేశ సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారన్నారు. టవర్‌‌పై వివాదం సృష్టించడం సిగ్గు చేటన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరమన్నారు. జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బీజేపీ కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అందరం ఐక్యతతో ఉండటం కారణంగానే ప్రశాంతంగా ఉంటున్నామన్నారు. టవర్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి మంచి ముగింపు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.