DailyDose

TNI నేటి నేర వార్తలు – 09/02/2022

TNI నేటి నేర వార్తలు – 09/02/2022

* అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సమీపంలో కల్తీ కొకైన్ తీసుకుని 12 మంది మృతి చెందారు. మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.అప్రమత్తమైన పోలీసులు.. మరింత ప్రాణనష్టం జరగకుండా పలు ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ ముఠాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే మాదకద్రవ్యాలను కల్తీ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

* పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ రక్తసిక్తమైంది. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్‌, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్‌ బాంబర్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల మంది పాక్‌సైనికలు మరణించినట్లు సమాచారం. కాగా, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చైనా పర్యటనకు ముందు ఈ దాడులు జరగడం పాక్‌ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

* రామనాథపురం జిల్లాలో ఏడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న విగ్రహాల అక్రమ రవాణా నిరోధక అధికారులు.. ఇద్దరు పోలీసుల సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పురాతన దేవతా విగ్రహాలను ఓ ముఠా విక్రయుస్తున్నట్లు మదురై విభాగ పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో ఏడీజీపీ జేమ్స్‌మురళి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం రామనాథపురం జిల్లాకు చెందిన అలెగ్జాండర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతను బీజేపీ మైనార్టీ విభాగ జిల్లా కార్యదర్శి అని తేలింది. విచారణలోఅరుప్పుకోటకు చెందిన కానిస్టేబుల్‌ ఇళంకుమరన్‌ విరుదునగర్‌కు చెందిన కురుప్పుస్వామి దిండుగల్‌ సాయుధ దళ విభాగానికి చెందిన నాగేంద్రన్‌కు ఈ వ్యవహారంలో సంబంధాలున్నట్లు తెలిసింది. కొంతకాలం క్రితం సేలం జిల్లా ఎడప్పాడి సమీపం లోని ఒక కొండ ప్రాంతంలో ప్రాచీన విగ్రహాలున్నట్లు అందిన సమాచారంతో ఇళంకుమారన్‌ నాగేంద్రన్‌ సహా మరొకరు అక్కడికి వెళ్లి విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం పోలీసులమని నమ్మించి విగ్రహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఆ విగ్రహాలను అలెగ్జాండర్‌ ద్వారా రూ. కోట్లకు విదేశాలకు విక్రయించేలా బేరం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

* తిరుపతి నగరంలోని కరకంభాడి రోడ్డులో డీమార్టు దగ్గర రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. డీమార్టులో విధులను ముగించుకుని వెళ్తన్న లోకేష్ స్పాట్‌లోనే మృతి చెందగా…. తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవీణ్, విష్ణు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరు కడప జిల్లా చిట్వేల్ వాసులుగా గుర్తించారు. కాగా తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి విష్ణును మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

*దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం రాత్రి రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో బుధవారం అర్దరాత్రి రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.పరస్పర శత్రుత్వం కారణంగా రెండుగ్రూపుల మధ్య కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు. కాల్పుల అనంతరం దుండగులు పరార్ అయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.ఢిల్లీ పోలీసులు కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*కేరళలోని కోజికోడ్‌లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం బుధవారం కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని పట్టుకోవడం విశేషమని కస్టమ్స్ విభాగం అధికారి ఒకరు తెలిపారు.డెసర్ట్ స్టార్మ్ పేరుతో నిర్వహించిన ఆపరేషన్‌లో కిలోల బంగారాన్ని 23 మంది విమాన ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) , కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌ల బృందం తెలిపింది.గల్ఫ్ దేశాల నుంచి కోజికోడ్ చేరుకున్న విమాన ప్రయాణికుల వద్ద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు. గతంలో కూడా కేరళలోని పలు విమానాశ్రయాల్లో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

*డ్రగ్స్ తీసుకుంటున్న వారికి షాకింగ్ వార్త తాజాగా వెలుగుచూసింది. అర్జెంటీనా దేశంలో విషపూరితమైన కొకైన్‌ తిని మంది మరణించిన ఘటన సంచలనం రేపింది. కల్తీ కొకైన్ తీసుకున్న కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని అర్జెంటీనా ప్రభుత్వం తెలిపింది.బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్సులో విషపూరితమైన కొకైన్ తిన్న వారిలో మరణించగా మరో 2 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని ప్రావిన్షియల్ భద్రతా మంత్రి సెర్గియో బెర్నీ ప్రతినిధి చెప్పారు.

*కట్నం వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె మరణానికి భర్త కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో జిల్లా కోర్టు నిందితుడి జైలు శిక్ష విధించింది. కానీ నిందితుడు కోర్టు తీర్పు సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ కేసులో 23 ఏళ్ల తరువాత హైకోర్టు నిందితుడిని నిర్ధోషిగా తీర్పు చెప్పింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది.

*రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడికి కాకినాడ జీజీహెచ్లో చికిత్సను అందిస్తున్నారు.

*దర్శి మండలం పోతవరంలో దారుణం చోటు చేసుకుంది. భార్య పావనిపై భర్త సాయి కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో పావనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పావని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సాయి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పరిధిలోని కన్నెవీడు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి బాణావతి ఆకాష్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రావులపాలెం సమీపంలోని కన్యకా పరమేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఆకాష్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల సమీపంలోని కాల్వలో మృతదేహాన్ని గుర్తించిన యాజమాన్యం… తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఆకాష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.