* మరో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి యోచిస్తోందని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లభిస్తే పలుచోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రిజర్వాయర్‌లో మే నెలలోగా 15 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పూర్తి చేయాలన్నారు.
* ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై కోడిగుడ్లతో దాడి జరిగింది. దీంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడికి నిరసనగా ఎన్ఎస్యూఐ కోడిగుడ్ల దాడికి పాల్పడింది. కార్యకర్తలు కిషన్ రెడ్డి కారుకు ఎదురుగా వెళ్లి నిరసన తెలిపారు.
* ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) శుభవార్త చెప్పింది. పాకిస్థాన్‌కు 6 బిలియన్ డాలర్ల మేరకు రుణం మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వెంటనే 1 బిలియన్ డాలర్లను ఆ దేశం అందుకునేందుకు మార్గం సుగమం ఆయింది.
* దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్టమైనచర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేకార్యక్రమం చేపట్టింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 167.87 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 55లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 95.14 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,72,433 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,33,921 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 12.98 శాతంగా పేర్కొన్నారు.
* ఉద్యోగ సంఘాలుగా చర్చలకు వెళ్లకుంటే పరిపక్వత లేదంటారా..? అని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల వెనుక ఎవరో ఉన్నారని… వాళ్లే ఉద్యమం చేస్తున్నారని ఆరోపిస్తున్నారన్నారు. మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారని స్పష్టం చేశారు. అర్థరాత్రి 12 గంటల వరకు సెక్రటేరీయేట్టులో వెయిట్ చేయించి అవమానం చేశారన్నారు. పోలీసుల వెనుక కూడా తామే ఉన్నామన్నారు. పీఆర్సీ ఈ విధంగా ప్రకటించడం చరిత్ర అని.. ఈ ఉద్యమం కూడా చరిత్రే అని చెప్పుకొచ్చారు. ఈ నెల ఐదు నుంచి సహయ నిరాకరణ చేపడతామని.. ఏడు నుంచి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమ్మె వల్ల ప్రజలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి వస్తున్నారన్నారు. ఉద్యోగుల ఉద్యమం అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసి రావాలని బొప్పరాజు పేర్కొన్నారు.
* కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించినట్లు బీజేపీ ఎంపీ నిసికాంత్ దుబే ఆరోపించారు. గాంధీ బుధవారం లోక్‌సభలో ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం రాష్ట్రాల యూనియన్ను ఓ రాజ్యంగా చేసుకుని పరిపాలిస్తూ భారత దేశ భావనను నాశనం చేస్తోందన్నారని తెలిపారు. గాంధీపై ఆయన గురువారం సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇచ్చారు.
విజయవాడ నగరంలోని కుమ్మరిపాలెం సెంటర్ అపార్ట్మెంట్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్న దీక్షిత అనే బాలిక తల్లిదండ్రులను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం దీక్షిత ఆత్మహత్య చేసుకోవడం మనసు అంగీకరించడం లేదన్నారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పడుతున్న వేదన కలిచివేసిందని అన్నారు. సూసైడ్ నోట్లో అంశాలను అధికారులు స్టడీ చేస్తున్నారని తెలిపారు. నిందితులను శిక్షించడం కంటే ఇంకా అతీతమైన విధంగా చేయాలని కోరుకుంటున్నానన్నారు. అర్థగంటకు పైగా బాలిక తల్లిదండ్రులను రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఓదార్చారు.
*బెంగళూరు విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా ఏబీవీపీ, దళిత సంఘాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో యూనివర్సిటీ క్యాంప్‌సలో అన్ని రకాల ధర్నాలపై నిషేధం విధించారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొట్రేష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండటంతో ఘర్షణ వాతావరణం నెలకొని ఉందని, ఈ కారణంగానే క్యాంప్‌సలో ఇకపై ఎలాంటి ధర్నాలకు అనుమతి ఇవ్వరాదని తీర్మానించామన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు కూడా సమాచారం అందించామన్నారు. క్యాంపస్‌లో ఎలాంటి ధర్నాలను అనుమతించవద్దని, ఒక వేళ ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని యూనివర్సిటీ ప్రకటన పేర్కొంది.
*ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 9, 10 తేదీల్లో జిల్లా పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9న సాయంత్రం 3.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.రోడ్డు మార్గాన బయలుదేరి తిరుమలకు చేరుకుని పద్మావతి అతిఽథి గృహంలో విడిది చేస్తారు. 10న ఉదయం 5.15గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుంటారు.10.30 గంటలకు పుష్పగిరి మఠానికి చేరుకుని స్థానికంగా జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుగుపయనమవుతారు.
*హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో భారీ మంచు కురుస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, స్పితి, కులూ, సిమ్లా వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది. రాబోయే 48 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తుందని ఐఎండీ ప్రాంతీయ కార్యాలయం అధిపతి సురేందర్ పాల్ చెప్పారు. ఫిబ్రవరిలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుందని, పంజాబ్, హర్యానాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తన వెదర్ రిపోర్టులో తెలిపింది.ద్వీపకల్ప భారతదేశంలోని తూర్పు, నైరుతి తీర ప్రాంతాల్లో మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.వచ్చే 48 గంటల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.
*పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం ప్రభుత్వం చేపట్టిన సహాయక, పునరావాస చర్యలపై మూడు వారాల వ్యవధిలో నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర జలశక్తి కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్ బుధవారం నోటీసులు జారీచేసింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ప్రభుత్వం చూపుతున్న అలసత్వ వైఖరిపై సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేశారు.
* పదో తరగతి పరీక్ష ఫీజు అపరాధ రుసుం లేకుండా ఈ నెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఫీజు చెల్లించేలా ప్రభుత్వం గడువు పెంచింది.
*పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేసేందుకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ బహిరంగ నోటిఫికేషన్ జారీ చేసింది. వడ్డీ సహా దాదాపు రూ. 10 కోట్ల రికవరీ కోసం ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఆంధ్రాబ్యాంకు సైతం రూ.1.50 కోట్లు రికవరీ కోసం మరో నోటిఫికేషన్ జారీ చేసింది.
*విదేశాల్లో చదువుకోవాలనుకునే బ్రాహ్మణ విద్యార్థులు వివేకానంద విదేశీ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు ఉందని తెలిపారు.