కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ లో జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జట్టు కట్టాయి. ఏఎన్టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, తెదేపా స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ బుధవారం పోర్టు బ్లెయర్లో సమావేశమై ఈ నిర్ణయం వెల్లడించారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజాస్వామ్యయుత పాలన కోసం కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు రంగలాల్ హల్దార్ తెలిపారు. ఈ మేరకు పోర్టు బ్లెయర్ మున్సిపాలిటీలో 2. 5. 16 వార్డుల్లో తెదేపా పోటీ చేయనుంది. మార్చి 6న పోలింగ్. 8న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.