Politics

ఒవైసీకి జడ్ కమాండోల భద్రత – TNI నేటి నేర వార్తలు 04/02/2022

ఒవైసీకి జడ్ కమాండోల భద్రత – TNI నేటి నేర వార్తలు 04/02/2022

*ఒవైసీకి జడ్ కేటగిరి భద్రత
ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.నిన్నటి కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతపై సమీక్ష చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సీఆర్పిఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారు. ఆరుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమెండోలు, పోలీసులతో సహా 22మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఎస్కార్టు కారుతోపాటు ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ, సీఆర్పిఎఫ్ సిబ్బంది రక్షణగా ఉంటారు.తాను ఎప్పుడూ భద్రతను కోరుకోలేదని, ఎందుకంటే తన ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఒవైసీ నొక్కి చెప్పారు.

* పెదపారుపూడి మండలంలో ఉద్రిక్తత కృష్ణాజిల్లాలోని పెదపారుపూడి మండలం ఈదుల మద్దాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతు శ్రీనివాసరావు మృతదేహంతో ఆందోళన కొనసాగుతోంది. రెవిన్యూ అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. శ్రీనివాస్ రావు మృతితో అతని నలుగురు కుమార్తెలు అనాథలయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. తక్షణమే నిందితులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. క్యాసినో మంత్రి పీఏ పాత్రపై కూడా పోలీసులు నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేశారు.

* లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విఆర్ఓ. భారతి అనే మహిళా రైతు దగ్గర 1 బి కోసం రూ. 3 వేలు డిమాండ్ చేసిన వీఆర్వో నౌజియా . ఏసిబిని ఆశ్రయించిన బాధితురాలు. చిత్తూరు ఎం ఆర్వో ఆఫిస్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి డియస్పి.
* ఇండస్ విసా కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇండస్ విసాకు చెందిన రూ.66.30 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇండస్ విసా రూ.1500 కోట్ల స్కాంకు పాల్పడ్డట్లు అభియోగాలు నమోదయ్యాయి. అంజర్‌తో పాటు పలువురిపై మనీ లాండరింగ్ కింద కేసు నమోదయింది. సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

* విజయనగరం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నప్ కలకలం రేపుతోంది. తెర్లాం మండలం కూనయివలస గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్‌ అయిన వ్యక్తి కోసం గాలింపు చర్యటు చేపట్టారు. చివరకు ఎస్. కోట దగ్గర కిడ్నాపర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* దొనకొండ, కురిచేడు పరిసర ప్రాంతాల్లో రైతులు వారి వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లో ఏర్పాటు చేసుకున్న విలువైన సోలార్‌ ప్లేట్లు దొంగలించిన పలవురు దొంగలను ఎస్సై కొత్తపల్లి అంకమ్మ తన సిబ్బందితో గట్టి నిఘా పెట్టి పట్టుకున్నారు.

* వజ్రపుకొత్తూరు మండలంలోని పెద్దపల్లివూరుకు చెందిన రచ్చ బాలకృష్ణ (28) సముద్రస్నానానికి వెళ్లి మృతిచెందాడు.

* విశాఖపట్నం నగరంలో విద్యుత్ షాక్‌తో హోంగార్డ్ ఈశ్వరరావు మృతి చెందడం కలకలం రేపుతోంది. సీలేరు ఏపీజెన్‌కో గృహంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం హోంగార్డ్ ఈశ్వర రావు వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈశ్వరరావు పోలీసుశాఖలో హోంగార్డ్‌గా ఉంటూ ఏపీజెన్‌కోకు డిప్యూటేషన్‌పై వచ్చారు. ఈ క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే జెన్‌కో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

*ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు చిన్న వంతెన వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తలారి కాంతారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా… సీతయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానికుల సాయంతో 108 వాహనంలో జంగారెడ్డి గూడెం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*మహారాష్ట్రలోని పుణెలో (Pune) నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. పుణెలోని ఎరవాడ శాస్త్రీనగర్‌లో ఓ షాపింగ్‌ మాల్‌ కడుతున్నారు. ఇందులో భాగంగా శ్లాబ్‌ వేయడంకోసం సెంట్రింగ్‌ పనిచేస్తున్నారు. అయితే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కింద పనిచేస్తున్న పదిమంది కూలీలపై (Labourers) అది పడిపోయింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు కూలీలను తీవ్రంగా గాయపడ్డారు.

*దొనకొండ, కురిచేడు పరిసర ప్రాంతాల్లో రైతులు వారి వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లో ఏర్పాటు చేసుకున్న విలువైన సోలార్‌ ప్లేట్లు దొంగలించిన పలవురు దొంగలను ఎస్సై కొత్తపల్లి అంకమ్మ తన సిబ్బందితో గట్టి నిఘా పెట్టి పట్టుకున్నారు.

*తెలంగాణ నుంచి గుజరాత్‌కు తరలిస్తున్న 270 క్విటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్టు చిరగ్‌పల్లి ఎస్‌ఐ కాశీనాథ్‌ తెలిపారు. జహీరాబాద్‌ డీఎస్పీ శంకర్‌రాజు ఆదేశాల మేరకు చిరగ్‌పల్లి ఎస్‌ఐ పోలీస్‌ సిబ్బంది, సివిల్‌ సప్లయ్‌ అధికారులు సురే్‌షకుమార్‌, బస్వయ్య సత్వర్‌ గ్రామశివారులోని కోహినూర్‌ దాబా వద్ద ముంబై వెళ్తున్న కంటైనర్‌ను తనిఖీ చేశారు. 270 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. డ్రైవర్‌ అఖిలేష్‌ యాదవ్‌, కంటైనర్‌ ఓనర్‌పై కేసు నమోదు చేశారు.

*అనంతపురం పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో మట్కా, పేకాట కేంద్రాలపై దాడులు చేసి, 15 మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. వారి నుంచి రూ.7.21 లక్షల నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గురువారం పట్టణ పోలీసుస్టేషనలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్ల డించారు. పేకాటకేంద్రంపై దాడులు చేసి, టైలర్స్‌కాలనీ, సుంకులమ్మపాలెం, విజయనగర్‌కాలనీ, జయనగర్‌కాలనీ, తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి, పుట్లూరు మండలం శనగలగూడూరు ప్రాంతాలకు చెందిన వారిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.1.12 లక్షల నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నా రు. మరోదాడిలో మట్కా నిర్వహిస్తున్న 9మందిని అరెస్టు చేశామన్నారు. పట్టణంలోని కమ్యూనిస్టు కొట్టాల, బుజ్జి బాబు, నందలపాడు, పడమటిగేరి, శ్రీనివాసపురం ప్రాంతాలకు చెందిన వారిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.6.09 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడుల్లో పట్టణ సీఐ కృష్ణారెడ్డి, ఎస్‌ఐ ధరణీబాబు, సిబ్బంది పాల్గొన్నారని డీఎస్పీ వివరించారు.

*పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నా.. దా‘రుణ’ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ‘రిచ్‌ క్యాష్‌ లోన్‌’ అనే యాప్‌ వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో కౌరం విశృక్‌ రెడ్డి(20) బలవన్మరణానికి కారణమైంది. హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్న విశృక్‌ రెడ్డి.. కొవిడ్‌ కారణంగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో కొన్ని రోజులుగా ఇంటివద్దే ఉంటున్నారు. అవసరాల కోసం రిచ్‌ క్యాష్‌ లోన్‌ యాప్‌లో రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించాలంటూ ఫోన్‌ ద్వారా వేధింపులకు గురిచేసిన యాప్‌ నిర్వాహకులు.. రెఫరెన్స్‌గా ఇచ్చిన నంబర్లకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. గత నెల 19న దివిటిపల్లిలోనే ఉండే విశృక్‌ బంధుమిత్రులకు ఫోన్లు చేసి, అప్పు తీర్చడం లేదంటూ వేధించారు. దీంతో తనను దొంగగా చిత్రీకరిస్తున్నారనే అవమానంతో గత నెల 27న విశృక్‌రెడ్డి పురుగుల మందు తాగారు. వెంటనే విశృక్‌ తండ్రి వెంకట్‌రెడ్డి.. అతణ్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విశృక్‌రెడ్డి అక్కడ చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు.

*భార్యను అత్యంత దారుణంగా చంపిన భర్త పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయిన ఘటన ఢిల్లీలో గురువారం ఉదయం జరిగింది. తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతానికి చెందిన ఓ భర్త గురువారం ఉదయం ఢిల్లీలోని గోవింద్ పురి పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయాడు. తన భార్యను కత్తెరతో పొడిచి చంపానని చెప్పి భర్త పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను ఇంట్లో ఉన్న ప్రెజర్ కుక్కర్, సిలిండరు, కత్తెరతో భార్యను చంపానని నిందితుడైన భర్త పోలీసులకు చెప్పాడు.పోలీసులు భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కత్తెర, కుక్కర్, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భార్య దారుణ హత్య ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

*రామనాథపురం జిల్లాలో ఏడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న విగ్రహాల అక్రమ రవాణా నిరోధక అధికారులు.. ఇద్దరు పోలీసుల సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

*కేరళలోని కోజికోడ్‌లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం బుధవారం 23 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని పట్టుకోవడం విశేషమని కస్టమ్స్ విభాగం అధికారి ఒకరు తెలిపారు.