ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్తదారి చూపించాలి. పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలి. వాతావరణ మార్పులు తట్టుకునే వంగడాలు సృష్టించాలి అని ప్ ధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల వేడుకల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు.ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వసంత పంచమి రోజు స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. 50 ఏండ్లుగా మీరు చేస్తున్న పరిశోధనలకు అభినందనలు. వచ్చే 50 ఏండ్లు మరిన్ని పరిశోధనలు జరగాలి. ఐదు దశాబ్దాల కాలంలో భారత్ ఆహార సమృద్ధి సాధించింది. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పంటల దిగుబడి గణనీయంగా ఉంది. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్తదారి చూపించాలి. పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలి. వాతావరణ మార్పులు తట్టుకునే వంగడాలు సృష్టించాలి. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదపడుతాయి.భారత్‌లో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారు. దేశంలో చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారు. చిన్న రైతుల సాగు వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దేశ వ్యవసాయ రంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలి. భారత్‌లో 6 రుతువులు, 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. భారత్‌లో 50 వరకు ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయి. దేశంలోని 170 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ బడ్జెట్ సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుతున్నాం. డిజిటల్ అగ్రికల్చర్ పెంచాలనే లక్ష్యంతో ఉన్నాం. సాగులో డ్రోన్ల వినియోగం పెంచేందుకు నిధులు కేటాయించాం. సాగు భూముల వివరాలను డిజిటలైజ్ చేశాం అని మోదీ పేర్కొన్నారు.
**ఇక్రిశాట్ 50 వసంతాల లోగో, పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని మోదీని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యుస్ సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ప్రధాని మోదీ ఇక్రిశాట్ 50 వసంతాల లోగోతో పాటు పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు ఇక్రిశాట్‌లో సాగు సంబంధిత ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. మెట్ట పంటల పరిశోధనలను మోదీకి శాస్త్రవేత్తలు వివరించారు. మోదీ ఆసక్తిగా విన్నారు. స్వర్ణోత్సవాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.