Politics

కమీషన్లకు కక్కుర్తిపడి థర్మల్‌ పవర్‌ స్టేషన్లను భ్రష్టు పట్టించారు: దేవినేని ఉమా- TNI రాజకీయ వార్తలు 05/02/2022

కమీషన్లకు కక్కుర్తిపడి థర్మల్‌ పవర్‌ స్టేషన్లను భ్రష్టు పట్టించారు: దేవినేని ఉమా-  TNI   రాజకీయ వార్తలు 05/02/2022

కమీషన్లకు కక్కుర్తిపడి థర్మల్‌ పవర్‌ స్టేషన్లను భ్రష్టు పట్టించారు: దేవినేని ఉమా- TNI రాజకీయ వార్తలు 05/02/2022
* ఏపీలో విద్యుత్‌రంగం సంక్షోభంలో పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి థర్మల్‌ పవర్‌ స్టేషన్లను భ్రష్టు పట్టించారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్‌ బిల్లులు పెంచి ఎంత డబ్బు వసూలు చేశారో.. వ్యవసాయరంగానికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

*ఉపాధి కల్పనపైనే కాంగ్రెస్ దృష్టి : ప్రియాంక గాంధీ వాద్రా
వ్యక్తుల దురహంకారాన్ని నిర్మూలించడం గురించి కాంగ్రెస్ మాట్లాడబోదని, ప్రజలకు ఉపాధి అవకాశాలను సృష్టించడంపై దృష్టి పెడుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను ఆమె పరోక్షంగా తిప్పికొట్టారు.

*చైనా ఏం చెప్పినా రాహుల్ గాంధీ నమ్ముతారు : రాజ్‌నాథ్ సింగ్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా చెప్పినవాటిని చదివి, నమ్మేస్తారని, వాస్తవాలను పరిశీలించరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం బల్‌దేవ్‌లో జరిగిన బీజేపీ ప్రచార సభలో మాట్లాడుతూ, పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావించారు. గాల్వన్‌ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కేవలం ఇద్దరు, ముగ్గురు చైనా సైనికులు మాత్రమే మరణించినట్లు రాహుల్ గాంధీ చెప్పారని రాజ్‌నాథ్ అన్నారు. ఆయన ఏం చదివితే దానినే నమ్ముతారన్నారు. ఈ ఘర్షణలో 38 నుంచి 50 మంది వరకు చైనా జవాన్లు మరణించారని ఇటీవల ఓ ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించిందన్నారు. భారత దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయన్నారు.

* రాహుల్ గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తా : నవజోత్ సింగ్ సిద్ధూ
పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎవరిని ప్రకటించినా తాను స్వాగతిస్తానని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శనివారం సిద్ధూ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రాహుల్ గాంధీ నిర్ణయమే అంతిమమని తెలిపారు.

* గులాంన‌బీ, మ‌నీశ్ తివారీకి అధిష్ఠానం ఝ‌ల‌క్‌..
కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు అధిష్ఠానం ఝ‌ల‌క్ ఇచ్చింది. పంజాబ్ ఎన్నిక‌ల స్టార్ క్యాంపెయిన‌ర్ జాబితా నుంచి సీనియర్ నేత‌, ఎంపీ మ‌నీశ్ తివారీ, సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్ పేరును తొల‌గించింది. మొద‌ట్లో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్, సోనియా, రాహుల్‌తో పాటు ఆజాద్‌, మ‌నీశ్ తివారీ పేర్ల‌ను అధిష్ఠానం ప్ర‌క‌టించింది. తాజాగా గులాంన‌బీ, మ‌నీశ్ తివారీ పేర్ల‌ను తొల‌గిస్తూ అధిష్ఠానం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ మ‌నీశ్ తివారీ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ‘ఈ నిర్ణ‌యం వేరే విధంగా ఉంటే ఆశ్చ‌ర్య‌పోయేవాడ్ని. దీని వెనుక ఉన్న ర‌హ‌స్య‌మేమిటో మీ అంద‌రికీ విదిత‌మే’ అంటూ మ‌నీశ్ ట్వీట్ చేశారు. ఇక మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ కూడా కాంగ్రెస్ నిర్ణ‌యంపై మండిప‌డ్డారు. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం త‌ప్ప‌ని, సంకుచిత నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్ గెల‌వ‌లేద‌ని అభిజిత్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

* సీఎం జగన్ తో ముగిసిన మంత్రుల కమిటి భేటీ..
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అయ్యారు మంత్రులు బొత్స, బుగ్గన, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ. హెచ్ఆర్ఏ, పెన్షన్ శ్లాబుల్లో మార్పులు, రికవరీ మినహాయింపుతో పడే ఆర్ధికభారంపై చర్చించారు.ఏడువేల 500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. స్టీరింగ్ కమిటీ సభ్యులు కమిటీ ముందు పెట్టిన ఇతర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు మంత్రుల కమిటీ. నిన్న రాత్రి వరకు ఉద్యోగులతో చర్చించాం. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.ఇప్పుడు మళ్లీ సమావేశమవుతున్నాం. అన్ని అంశాలు సీఎంకి వివరిస్తాం. మధ్యాహ్నం మళ్లీ ఉద్యోగులతో చర్చిస్తాం. హెచ్ ఆర్ ఏ గురించి ఈ రోజు చర్చిస్తాం. రికవరీ విషయంలో క్లారిటీ ఇచ్చాం. దీనివల్ల 6 వేల కోట్లు భారం ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇక మిగిలిన సమస్యలు అన్నీ చిన్న చిన్న విషయాలే అన్నారు మంత్రి బొత్స.స్టీరింగ్ కమిటీ సభ్యులు తమ ముందు పెట్టిన ఇతర డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మంత్రుల కమిటీ. సీఎం భేటీ అనంతరం సచివాలయానికి చేరుకుంది మంత్రుల కమిటీ. ఇవాళ కీలక ప్రకటనకు అవకాశం వుందని తెలుస్తోంది.

* 400 సీట్లు గెలుస్తాం: అఖిలేష్ యాదవ్
సమాజ్‌వాదీ-ఆర్ఎల్‌డీ కూటమి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. అధికార పార్టీపై ప్రజాగ్రహమే తమ పార్టీకి భారీగా సీట్లు తెచ్చిపెడతాయని, 400 సీట్లు తమ కూటమి గెలుచుకుంటే, తక్కిన వారికి వచ్చేవి 3 సీట్లేనని అలీగఢ్‌లో మాట్లాడుతూ ఆయన అన్నారు.

* హిజాబ్ ధరించే విద్యార్థినులకు రాహుల్ గాంధీ మద్దతు
బాలికా విద్యా పథంలోకి హిజాబ్‌ను తీసుకొచ్చి బాలికల భవిష్యత్తును దోచుకుంటున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని విద్యా సంస్థల్లోకి హిజాబ్ ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంపై మండిపడ్డారు. సరస్వతీ దేవి ఇటువంటి వివక్షను ప్రదర్శించదని, అందరికీ విజ్ఞానాన్ని ఇస్తుందని అన్నారు. హిజాబ్ ధరించి పాఠశాలలకు వెళ్ళే విద్యార్థినులకు మద్దతిచ్చారు.

* జంగారెడ్డి రాజకీయాల్లో మాకు స్పూర్తిప్రదాత: విద్యాసాగరరావు
రాజకీయాల్లో తమకు స్పూర్తి ప్రదాత చందుపట్ల జంగారెడ్డి అని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసగరరావు అన్నారు. పార్టీని గ్రామాల్లో బలోపేతం చేయడానికి, ప్రజలకు సేవ చేసేందుకు కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే… అందులో ముఖ్యపాత్ర జగ్గారెడ్డి పోషించారన్నారు. జంగారెడ్డికి దేశవ్యాప్తంగా పేరు రావడానికి కారణం 1984లో బీజేపీ తరపున ఇద్దరు ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు జంగారెడ్డి అని చెప్పుకొచ్చారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో జంగారెడ్డి పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణలో అందరూ ఆయనను ‘కరెంట్ జంగన్న’ అని ప్రేమగా పిలుచుకునే వారని సీహెచ్.విద్యాసాగరరావు తెలిపారు.

* తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నది జంగన్న కల: Indrasena reddy
బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి మృతిపట్ల ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కాలేజీ విద్యనభ్యసించే రోజుల్లోనే జంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ విద్యార్ధి సమస్యలపై పోరాడేవారని గుర్తుచేశారు. తనను నిరంతరం రాజకీయాల్లో ప్రోత్సహించిన నాయకుడు జంగారెడ్డి అని అన్నారు. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానం చేయాలంటూ కొట్లాడిన నాయకుడు జంగారెడ్డి అని కొనియాడారు. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లిన నాయకుడన్నారు. ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నది జంగన్న కల. అది చూడాలని నిరంతరం తపించేవారు’’ అని చెప్పుకొచ్చారు. జంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా అని ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

* కాంగ్రెస్‌పై ఆ పార్టీ ఎంపీ మనీశ్ తివారీ వ్యంగ్యాస్త్రాలు
పంజాబ్ శాసన సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతల మధ్య ఐకమత్యం కనిపించడం లేదు. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ప్రచారం కోసం ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించిన స్టార్ కాంపెయినర్ల జాబితాలో ఆ పార్టీ ఎంపీ మనీశ్ తివారీ పేరు లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆయన పంజాబ్‌ నుంచి ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ ఎంపీ. ఈ పరిస్థితి దయనీయంగా ఉందని పశ్చిమ బెంగాల్‌కు చెందిన మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ ఓ ట్వీట్ చేశారు. దీనికి మనీశ్ తివారీ వ్యంగ్యంగా స్పందించారు.

* ఈరోజు, రేపటిలోగా అన్ని సమస్యలు పరిష్కారం: మంత్రి Balineni
ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. ఈరోజు, రేపటిలోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రెండు రోజుల విద్యుత్ కోతలపై టీడీపీ నానా గోల చేస్తుందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలు తమకు అప్పజెప్పి వెళ్లారన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించామని, రెండు రోజుల్లో ఏ సమస్య లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేసిన సత్యసాయి జిల్లాపై బాలకృష్ణ రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆయన తండ్రి ఎన్టీఆర్ పేరిట కూడా ఓ జిల్లాను ప్రకటించామని.. టీడీపీ హయాంలో అది కూడా చేసుకోలేక పోయారని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు పధకాల పేర్లు మారటం సహజమన్నారు. ఇవాళ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటున్న చంద్రబాబు ఏ రోజైనా కేంద్రానికి ఓ లేఖ రాశారా అని ప్రశ్నించారు. మానసిక పరిస్దితి సరిగా లేని సుబ్బారావు గుప్తా విషయంలో స్పందించాలంటే సిగ్గుగా ఉందన్నారు. సుబ్బారావు గుప్తా వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో అన్నీ తెలుసని అన్నారు. తుని ఘటనలో అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేసిన సీఎం జగన్‌కు మంత్రి బాలినేని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

* ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం: Sajjala
ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎంత ఆర్ధిక భారం పడుతుందనే అంశం పై చర్చించాల్సి ఉందన్నారు. ఫిట్ మెంట్ 23 శాతంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. సీసీఏ చేయవద్దని ఉద్యోగులు అడిగారని తెలిపారు. హెచ్‌ఆర్ఏ శ్లాబుల్లో సవరణలతో ఏడు వేల కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు. హెచ్ఆర్ఏలో పాత శ్లాబులే కొనసాగించాలని ఉద్యోగులు అడిగారని, కనీస హెచ్ఆర్ఏ 12 శాతం ఉండాలని అడిగినట్లు సజ్జల పేర్కొన్నారు.

* ప్రజల దృష్టిని మళ్లించడానికే జిల్లాకు ఎన్టీఆర్ పేరు: బాలకృష్ణ
ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. అందుకోసం తాను దేనికైనా సిద్ధమేనన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సి ఉందన్నారు. జిల్లాకు ఏ పేరు అయినా పెట్టుకోవాలని.. తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. అధికార వైసీపీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి తమ కార్యాచరణ కూడా ఉంటుందని.. అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్ధమేనన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారన్నారు. జిల్లాల ప్రకటన తర్వాత ఎక్కడపడితే అక్కడ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. దానిపైన ఎలాంటి యాక్షన్ లేదన్నారు. ఎన్టీఆర్ అంటే అంత గౌరవం ఉంటే ఇలా చేస్తారా..? అని బాలయ్య ప్రశ్నించారు. దీనిని కేవలం పొలిటికల్ స్టంట్‌గా కొట్టిపారేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పెట్టడం.. ఏ ప్రేమతో పెట్టారు అందరికీ తెలిసిందేనన్నారు. నిజమైన ప్రేమ ఉంటే చంద్రబాబు ఎన్టీఆర్ పెట్టిన పథకాలను కంటిన్యూ చేయాలని బాలయ్య డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంపై ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. సినిమా టికెట్లపై సినిమా పెద్దలతో చర్చించానని.. అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టించారన్నారు.

*బోరిస్ జాన్సన్ సన్నిహితుల రాజీనామా
పార్టీగేట్ కుంభకోణం బ్రిటిన్ను కుదిపేస్తోంది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్కు సన్నిహితులైన నలుగురు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆరోపణల నుంచి బయటపడేందుకు బోరిస్ జాన్సన్ వారితో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి పాలసీ చీఫ్ మునిరా మీర్జా, చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ రోసెన్ఫీల్డ్, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రెటరీ మార్టిన్ రేనాల్డ్, కమ్యూనికేషన్ డైరెక్టర్ జాక్ డోయెల్ తాజాగా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్(యూకే) అంతటా కఠినమైన ఆంక్షలు అమలవుతున్న సమయంలో ప్రధానమంత్రి అధికార నివాసమైన డౌనింగ్ స్ట్రీట్లో విచ్చలవిడిగా విందులు చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

*కేసీఆర్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయన రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే రాజ్యాంగం అడ్డొచ్చిందా..? అని కేసీఆర్ను ప్రశ్నించారు. ‘‘సీఎం కేసీఆర్కు కేంద్రంతో వైరుధ్యం లేదు.. ఉన్నదల్లా భారత రాజ్యాంగం, డాక్టర్ అంబేడ్కర్తోనే. రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలు ఆయనకు నచ్చవు’’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు.

*ఏడాదికి 15 వేల మంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా చికిత్స : మంత్రి హరీశ్రావు
ప్రభుత్వ రంగంలో పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 100 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. నిమ్స్, ఎంఎన్జే ఆస్పత్రుల్లో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు. ఏడాదికి 15 వేల మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని అని హరీశ్రావు స్పష్టం చేశారు.