అతడో నర్సు.. తనను తాను గొప్పవాడిగా నిరూపించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన రోగుల ప్రాణాలతో చెలగాటమాడేవాడు. వారికి విషం ఇంజక్షన్లు ఇచ్చి గుండె పనితీరును దెబ్బ తీసేవాడు. తిరిగి తానే వైద్యం చేసి వారిని బ్రతికించి సహోద్యోగుల దృష్టిలో మార్కులు కొట్టేయాలన్న ఆరాటం ఆయనది. అయితే ఆ ప్రయత్నాలు బెడిసికొట్టేవి. ఫలితంగా 100 మంది రోగులు తమ ప్రాణాలు కోల్పోయారు. ముక్కున వేలేసుకునేలా చేసిన ఈ ఘటనలు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వరుస హత్యల నిందితుడిగా ఉన్న నెయిల్స్ హోయ్‌జల్ ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేసేవాడు. అతడికి అందరిలో గుర్తింపు సంపాదించాలనే తపన ఎక్కువ. తనకు తాను దైవాంశ సంభూతుడిగా నిరూపించుకునేందుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రోగులకు వైద్యం చేసేవాడు. వారు బతికితే సహోద్యోగుల దృష్టిలో హీరో అవ్వాలనే ఆకాంక్ష ఆయనది. ఈ క్రమంలోనే ఆస్పత్రికి వచ్చే రోగులకు విషం ఎక్కించి, వారి గుండె పని చేయకుండా చేసేవాడు. మళ్లీ తానే వైద్యం చేసి బతికించాలన్న ఆలోచన ఆయనది. కానీ, ఈ క్రమంలో 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ సంఖ్య 200కు పైగానే ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యక్తి గురించి స్థానిక వార్తాసంస్థ వివరాలు సేకరించింది. ఆయన స్నేహితులు, ఉపాధ్యాయులతో మాట్లాడింది. ఒక్కొక్కరి నుంచి ఒక్కో సమాధానం వచ్చింది. ఒకరు ఫ్రెండ్లీగా ఉంటాడు అంటే మరొకరు ఇతరులకు సాయం చేస్తాడని, ఇంకొకరు చాలా సరదా మనిషి అని సమాధానమిచ్చారు. అతడికి చదువు నేర్పిన ఉపాధ్యాయుడొకరు మాట్లాడుతూ హోయ్‌జల్ ఓ సాధారణ విద్యార్థేనని, ఫుట్‌బాల్ అంటే మక్కువ ఎక్కువని చెప్పారు. హోయ్‌జోల్ 1972, డిసెంబర్ 30న జన్మించాడు. తన 16 ఏళ్ల వయస్సులోనే స్థానిక ఆస్పత్రిలో నర్సుగా చేరాడు. వృత్తి రీత్యా చాలా సార్లు ఫెయిలనప్పటికీ, సహోద్యోగులు, డాక్టర్ల దృష్టిలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. మహిళా నర్సుల మెప్పు పొందేందుకు తాను వైద్యం చేస్తున్నప్పుడు వారిని చూడమని చెప్పేవాడని కొందరు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించి గురువారం అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించే అవకాశముంది.
ఓ జర్మన్ నర్సు ఘాతుకం
Related tags :