ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన అంతర్జాతీయ సరిహద్దులను పూర్తి స్థాయిలో తెరవనుంది . కొవిడ్ ఆంక్షల సడలింపులో భాగంగా పర్యాటకులు , బిజినెస్ ప్రయాణికులతోసహా వ్యాక్సినేషన్ పూర్తయినవారందరిని ఫిబ్రవరి 21 నుంచి దేశంలోకి అనుమతించనుంది . ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది . వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆస్ట్రేలియా .. 2020 మార్చి నుంచి అత్యంత కఠినమైన ప్రయాణ ఆంక్షలను కొనసాగిస్తోన్న విశయం తెలిసిందే . స్థానికంగా వ్యాక్సినేషన్ శాతం పెరగడంతో .. గతేడాది నవంబర్ లో సరిహద్దు ఆంక్షలను కాస్త సడలించింది . అయితే , ఆ సమయంలో అంతర్జాతీయ విద్యార్థులు , నైపుణ్యం కలిగిన వలసదారులకు ప్రాధాన్యం ఇచ్చింది . తాజాగా .. ఫిబ్రవరి 21 నుంచి టీకాలు పూర్తయిన వీసా హోల్డర్లందరూ తమ దేశానికి రావొచ్చని ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ప్రకటించారు . సందర్శకులందరూ తప్పనిసరిగా టీకా ఆధారాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు . టీకాకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్లు ఆస్ట్రేలియా నుంచి పంపించివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు . అయితే , టీకా ఎందుకు వేయించుకోలేదో వైద్యపరమైన కారణాలు చూపగలిగే వారికి మినహాయింపు ఉంటుందని చెప్పారు . ఇదిలా ఉండగా .. మహమ్మారి పరిణామాలతో దాదాపు రెండేళ్లుగా తీవ్ర నష్టాల్లో ఉన్న పర్యాటక రంగానికి తాజా నిర్ణయంతో ఉపశమనం కలిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు .
FLASH: సందర్శకులకు ఆస్ట్రేలియా అనుమతి
