Editorials

నిర్మలమైన నిరాడంబరతే ఆమె నేపథ్యం

A glimpse into the life history of Indian finance minister Nirmala Seetharaman

నిరాడంబరతే నిర్మల ఆభరణం.నిజాయితీ, ముక్కుసూటితనమే భూషణాలు.సూటిగా… స్పష్టంగా ఉంటారామె.బాధ్యతలతోనే ఆమె బంధుత్వం.నిన్న రక్షణ శాఖ.. నేడు ఆర్థిక శాఖ. ఉగ్రదాడుల నుంచి దేశాన్ని రక్షించారు.ఇప్పుడు దేశపద్దులను లోటుపాట్ల నుంచిరక్షించే బాధ్యత చేపట్టారు.
నిర్మలా సీతారామన్‌.. మన దేశ కొత్త ఆర్థిక మంత్రి. ఇందిరా గాంధీ తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించిన మహిళ. అప్పట్లో ఇందిరాగాంధీకి ఆర్థికశాఖ అదనపు బాధ్యతగా ఉండేది. పూర్తిస్థాయిలో ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న తొలి మహిళ నిర్మలాసీతారామన్‌. గత ప్రభుత్వంలో నిర్మల రక్షణ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అది కూడా రికార్డే. రక్షణ శాఖను నిర్వహించిన తొలి మహిళ ఇందిర కాగా రెండవ మహిళ నిర్మల. అంత పెద్ద బాధ్యతలను ఒక మహిళ సమర్థంగా నిర్వహించడం అంటే.. దేశానికే కాదు, మన తెలుగు వాళ్లకు కూడా గర్వించదగిన విషయం.. విజయం.
**ఢిల్లీ స్టూడెంట్‌
నిర్మలా సీతారామన్‌కు ఆవకాయ అంటే ఎంతిష్టమో, అత్తగారన్నా అంతే ఇష్టం. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఆమె అత్తగారిల్లు. అత్త కాళికాంబ మాజీ ఎమ్మెల్యే. మామ శేషావతారం మాజీ మంత్రి. అత్తగారి పర్యవేక్షణలో నిర్మల ఆవకాయ కలుపుతున్న ఫొటో ఒకటి అప్పట్లో వాట్సాప్‌లో ప్రాచుర్యం పొందింది. ఆమె రక్షణమంత్రి అయిన తర్వాత నిర్మల నిరాడంబరతకు చిహ్నంగా, ఆ ఫొటోను ఎంతో ఇష్టంగా షేర్‌ చేసుకున్నారు తెలుగు వాళ్లు.అత్యంత సాధారణ గృహిణి లాగ ఆమె భర్తతో పాటు మోటార్‌సైకిల్‌ మీద నర్సాపురంలో మార్కెట్‌కెళ్లి కూరగాయలు తెచ్చుకునేవారని స్థానికులు చెబుతారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పుట్టిన నిర్మల స్కూల్‌ ఎడ్యుకేషన్‌ చెన్నైలో సాగింది. బిఏ పట్టా అందుకున్న తర్వాత ఆమె ఎకనమిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ… నిర్మల చేతిలో పీజీ పట్టాతోపాటు ప్రభాకర్‌ చేతిని కూడా పెట్టింది. పరకాల ప్రభాకర్‌ కూడా జెఎన్‌యూలోనే పీజీ, ఎంఫిల్‌ చేశారు. వాళ్ల పెళ్లి 1986లో జరిగింది.
**లండన్‌ లైఫ్‌
నిర్మలాసీతారామన్, పరకాల దంపతులు పెళ్లి తర్వాత లండన్‌ వెళ్లారు. అక్కడి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ప్రభాకర్‌ పీహెచ్‌డీ చేశారు. నిర్మల యూకేలోని అగ్రికల్చరల్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌లో అసిస్టెంట్‌ ఎకనమిస్ట్‌గా, ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ అనే రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌లో సీనియర్‌ మేనేజర్‌గా ఉద్యోగాలు చేశారు. లండన్‌ వెళ్లడానికి ముందు ఆమె ఇండో– యూరోపియన్‌ టెక్స్‌టైల్‌ ట్రేడ్‌ అంశంలో పీహెచ్‌డీ కూడా మొదలుపెట్టారు. వాళ్లకో అమ్మాయి, పేరు వాజ్ఞ్మయి.
**బీజేపీలో చేరిక
హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నిర్మల ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించే సేవికా సమితి కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఆమె తొలి నుంచి సొంత అభిప్రాయాల మీదే ఉండేవారు. ఆమె పుట్టిల్లు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. తండ్రి రైల్వే ఉద్యోగి. అలాంటి పరిస్థితుల్లో మహిళను అత్తగారిల్లు ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువ. అయితే కాంగ్రెస్‌ నేపధ్యం కలిగిన అత్తగారింటి వారితో కలిసిపోతూనే తన అభిప్రాయాలను నిలబెట్టుకున్నారామె. తన పేరులో తండ్రి పేరును కూడా కొనసాగించారు. తన ఉనికి తానే అయ్యారు తప్ప అత్తగారింటి కోడలిగా మిగిలిపోలేదు. వాళ్లమ్మాయి వాజ్ఞ్మయి ‘లా’ కోర్సు కోసం నిర్మల కూడా ఢిల్లీ వెళ్లారు.ఆ సమయంలో నిర్మల టీవీ చర్చావేదికల్లో చురుగ్గా పాల్గొనడం బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ దృష్టిని ఆకర్షించింది. బీజేపీ లో చేరిన తర్వాత కొద్దికాలానికే నిర్మల అధికార ప్రతినిధి అయ్యారు. అంత కీలకమైన బాధ్యతలు చేపట్టగలగడానికి కారణం కేవలం ఆమె ప్రతిభ మాత్రమే. ఆమెలోని ప్రతిభతోపాటు ముక్కుసూటితనం, కచ్చితత్వమే బీజేపీ నిర్మలను అక్కున చేర్చుకోవడానికి గీటురాళ్లయ్యాయి. ఆ పార్టీ అభ్యర్థిగా 2010లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు నిర్మల. ఆ సభ్యత్వకాలం ముగిసిన తర్వాత 2016లో కర్నాటక నుంచి మళ్లీ ఎన్నికయ్యారామె.ప్రస్తుతం అదే హోదాలో కొనసాగుతూ కేంద్ర ఆర్థికమంత్రిగా కీలకమైన బాధ్యతలను చేపట్టారు. అంతకంటే ముందు వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్‌ ఉమెన్‌ కమిషన్‌ మెంబరుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో మోదీ తొలి ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తర్వాత మూడేళ్లకే రక్షణ మంత్రిగా మరింత కీలకమైన బాధ్యతలను స్వీకరించారామె. విధి నిర్వహణలో మొహమాటం లేకపోవడం, ఎవరి ఒత్తిడికీ తలొగ్గకపోవడం, బంధుప్రీతి చూపించకపోవడం ఆమెకు పెట్టని ఆభరణాలయ్యాయి. పాలన కార్యకలాపాల్లో బంధువులెవరినీ ప్రోత్సహించలేదామె. వాణిజ్యం నుంచి రక్షణ రంగానికి, ఆ తర్వాత ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టడానికి అవన్నీ సోపానాలే అయ్యాయి.
**అబద్ధాలను సహించరు
నిర్మల కచ్చితంగా ఉంటారని ఆమె వాణిజ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పేరు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయం. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుడు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి వచ్చారామె. ఒంగోలులో జరిగిన రైతుల బహిరంగ సభలో స్థానిక ప్రతినిధులు ప్రసంగిస్తున్నారు. రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురావడంతోపాటు ప్రభుత్వం నుంచి అందబోయే ప్రోత్సాహకాలను రైతులకు వివరిస్తున్నారు వాళ్లు.అలవి గాని హామీలతో సాగుతున్న ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకుంటూ నిర్మలాసీతారామన్‌ మైక్‌ తీసుకుని ‘‘మీరు ఇప్పుడు చెప్తున్న ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తోందని మీకెవరు చెప్పారు? అవాస్తవాలతో మభ్యపెట్టకండి. రైతుల కోసం ప్రభుత్వం ఏమేం చేయగలుగుతుందో నేనే వివరిస్తాను’’ అంటూ ఆమె ప్రసంగించారు. అలాగే మంత్రి వస్తున్నారని హడావిడి చేయడాన్ని కూడా ఆమె ఇష్టపడేవారు కాదు.
ప్రొటోకాల్‌ పట్టింపులు కూడా ఉండవు. పర్యటనకు వచ్చినప్పుడు అధికారిక వాహనం ఉన్నప్పటికీ అభిమానులతో కలిసి వారి కారులో ప్రయాణించిన సందర్భాలున్నాయి. ‘ఆమెలో ముక్కు మీద కోపాన్నే చూస్తారు కానీ, ఆమె ఏ విషయంలోనైనా సూటిగా వ్యవహరిస్తారు కాబట్టి అనవసరమైన లౌక్యాలను, సాగదీతలను ఇష్టపడరు. మొదట వ్యతిరేకించిన విషయాన్నయినా సరే పూర్తిగా వివరించి, అవసరాన్ని తెలియచేసిన తర్వాత అంగీకరిస్తారు. తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి మొహమాటపడరు కూడా’’ అని ఆమెను దగ్గరగా చూసిన వాళ్లు చెబుతుంటారు. ఆమెకు ఇష్టమైన హాబీలు కొత్త ప్రదేశాలకు వెళ్లడం, సాహసోపేతంగా ట్రెకింగ్‌ చేయడం. రుచిగా వండడం, మంచి సంగీతం వినడం. అరవయ్యవ ఏట కూడా చురుగ్గా ఉండవచ్చనడానికి ప్రతీక నిర్మల.
**సమయానికి తగిన శాఖ
ఆర్థిక శాఖను చేపట్టిన వెంటనే నిర్మల ముందు నిలిచిన తొలి సవాల్‌ బడ్జెట్‌. జూలై ఐదో తేదీ ఎంతో దూరం లేదు. ఈలోపు రూపాయి రాక, రూపాయి పోక లెక్కలన్నీ సిద్ధం చేయాలి. అసలే మోదీ తొలి ప్రభుత్వం డీ మానిటైజేషన్, జీఎస్‌టీ ప్రయోగాలతో ఆర్థిక వ్యవస్థ కొంత ఒడిదొడుకులను లోనయి ఉంది. వాటన్నింటినీ సమం చేయగలిగిన బడ్జెట్‌ తయారు చేయడం ఇప్పుడు నిర్మలాసీతారామన్‌ ముందున్న పరీక్ష. కచ్చితంగా ఉండే వాళ్ల లెక్క ఎప్పుడూ పక్కాగానే ఉంటుంది.
**సైనికుడి కుటుంబంతో…
గత ఏడాది జూన్‌ నెల. రంజాన్‌ మాసం కూడా. భారత సైన్యంలోని ఒక సిపాయి ఔరంగజేబు పండగకి ఇంటికి వెళ్లడానికి పై అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాడు. ‘సెలవు దొరికింది ఇంటికి వస్తున్నాన’ని ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చాడు. అన్నట్లుగానే తన ఊరికి బయలుదేరాడు, కానీ అతడు ఇల్లు చేరనేలేదు. దారి మధ్యలో అతడిని హిజబుల్‌ ముజాహిదీన్‌ తీవ్రవాదులు అపహరించుకుపోయారు. అతడి దేహం బుల్లెట్‌ గాయాలతో కశ్మీర్‌ రాష్ట్రం, పుల్వామా జిల్లాలో కలంపురాకు పదికిలోమీటర్ల దూరాన దొరికింది.ఇంటికి చేరింది ప్రాణం లేని దేహం మాత్రమే. ఔరంగజేబు పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌. అప్పుడు ఔరంగజేబు తండ్రి మహమ్మద్‌ హనీఫ్‌ అన్న మాటలు యావద్దేశాన్నీ కదిలించి వేశాయి. ‘‘నా కొడుకు దేశం కోసం ప్రాణాలు వదిలిన ధీరుడైన సైనికుడు. ఇప్పుడు నేను, నా రెండో కొడుకు కూడా దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఘటనకు పాల్పడిన వాళ్లకు బుద్ధి చెప్పాలి. కశ్మీర్‌ మాది.కశ్మీర్‌ మండిపోతుంటే చూస్తూ ఊరుకోం’’ అన్నారాయన ఆవేశంగా. ఔరంగజేబు మాత్రమే కాదు అతడి తండ్రి హనీఫ్‌ కూడా సైన్యంలో పనిచేశారు, అతడి సోదరుడు కూడా సైన్యంలో ఉన్నారు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్‌ ‘‘ఈ ఇంటి వాళ్లకు ధైర్యం చెప్పాలని వచ్చాను. కానీ వాళ్ల మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి. గొప్ప దేశభక్తి పరుల కుటుంబం’’ అన్నారామె ఉద్వేగంగా. అలాగే రఫెల్‌ వివాదం పార్లమెంట్‌ను కుదిపేసిన సందర్భంలో రక్షణ మంత్రి హోదాలో పాయింట్‌–టు–పాయింట్‌ వివరిస్తూ ఆమె చేసిన ప్రసంగం విమర్శకులను సైతం మెప్పించింది.
**ఉలవపాడు మామిడి
ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడి కాయలకు ప్రసిద్ధి. అక్కడ కాసిన మామిడి కాయలు రుచికి ప్రసిద్ధి. బీజేపీ అభిమానులు ఢిల్లీకి మామిడి కాయలు పంపించాలంటే నిర్మలా సీతారామన్‌కి పంపించేవారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన అభిమానం అంటూ ఆమె ఆ పండ్లను ఢిల్లీలోని పెద్ద నాయకులకు పంచేవారు. అలా ఉలవపాడు మామిడి పండ్లను రుచి చూసిన వాళ్లలో వాజ్‌పేయి, అద్వానీ, అరుణ్‌జైట్లీ కూడా ఉన్నారు. అలాగే పండ్లను తీసుకెళ్లిన యువకులను నాలుగైదు రోజులపాటు ఇంట్లో ఉంచి, ఢిల్లీ అంతా తిప్పి చూపించే ఏర్పాట్లు కూడా చేసేవారామె.