ఫ్యాషన్‌పై ప్యాషన్ లేదు. అసలు అటువైపు వెళ్లాలన్న ఆలోచనే రాలేదు. కానీ ఇప్పుడామె అంతర్జాతీయ బ్రాండ్లెన్నిటికో అంబాసిడర్.
ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలో పుట్టి… ప్రకృతి ఒడిలో పెరిగి… డిగ్రీ చదువుకొంటున్న ఒక సాధారణ అమ్మాయి జీవితంలో ఊహించని ‘ప్రయాణం’… అసోం టు అమెరికా! బడా మేగజైన్లపై భారతీయ చిత్రం… మధులికా శర్మ. ఇది 23 ఏళ్ల ఒక సూపర్‌మోడల్ కథ…
‘‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొంటే అంతా ఒక కలలా అనిపిస్తుంది. కానీ దాని వెనక నా కష్టమూ కనిపిస్తుంది. మోడల్ అవ్వాలన్న ఆలోచన అసలు నా ఊహల్లోనే లేకపోయినా… అవకాశం అనుకోకుండా వచ్చినా… అందివచ్చినదాన్ని నిలబెట్టుకోవడం అంత సులువు కాదు. మాది అసోం. నాన్న ఎస్బీఐ మేనేజర్. నా చిన్నప్పుడు ఆయన్ను అరుణాచల్‌ప్రదేశ్‌కు బదిలీ చేశారు. దీంతో నా బాల్యమంతా అక్కడే గడిచింది. అమ్మ ‘యార్న్ గ్లోరీ’ అనే కంపెనీ నడిపిస్తోంది. నేత చీరలు, స్టోల్స్ తయారీ, విక్రయ కేంద్రం అది. ఒక సామాజిక కార్యక్రమంగా దీన్ని చేపట్టింది అమ్మ. ఇక నేను… నా ప్రపంచం వేరు. పనికిరాని కాగితాలతో బొమ్మలు చేయడం, తోట పని చూసుకోవడం, చెట్ల నుంచి పండ్లు కోయడం… ఏవో చిన్న చిన్న ఆనందాలు. ఆహ్లాదంగా, హాయిగా అలా గడిపేసేదాన్ని. అంతేకాదు… ఎంతో ఇష్టంతో పియానో కూడా నేర్చుకున్నాను. ‘ట్రినిటి కాలేజ్ ఆఫ్ లండన్’ నుంచి శిక్షణ కూడా తీసుకున్నాను.
**స్నేహితుడి కోసం…
నా జీవితం ఊహించని మలుపు తిరిగింది మాత్రం ఢిల్లీలో! అక్కడి ‘మెరింద హౌస్ కాలేజీ’లో నేను పొలిటికల్ సైన్స్ డిగ్రీ చదువుతున్నాను. అదే సమయంలో నా స్నేహితుడు ఒకరు ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్’లో సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే అప్లికేషన్‌తో పాటు ఒక ఫొటో ప్రొఫైల్ కూడా జతచేసి పంపించాలి. అందుకు నన్ను మోడల్‌గా ఉండమని అడిగాడు. సరేనన్నాను. నా చేతిలో కమలా పండ్లు పెట్టి విభిన్నంగా కొన్ని క్లిక్స్ తీశాడు. అనుభవం లేని ఒక ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోలు ఎలా ఉంటాయో అవీ అలానే ఉన్నాయి. కానీ అలా ఫొటోలు దిగడం నాకు కొత్త. అందుకే నా సోషల్ మీడియా పేజీల్లో వాటిని పోస్ట్ చేశాను. అంతే… ఒక్కసారిగా కుప్పలుతెప్పలు మెసేజ్‌లు వచ్చిపడ్డాయి. ‘మీరు ఏదైనా ఏజెన్సీకి పనిచేస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు?’ అంటూ నన్ను అడగడం మొదలుపెట్టారు. వారిలో కొన్ని ఏజెన్సీల ప్రతినిధులు కూడా ఉన్నారు.
**అమ్మతో ముంబయికి…
ఈ విషయం మా అమ్మకు చెప్పాను. అన్ని కోణాల్లో చర్చించుకుని… ఇద్దరం కలిసి ముంబయికి వెళ్లాం. నా ఫొటోలు చూసి నన్ను సంప్రతించిన సంస్థలు, వ్యక్తులను కలిశాం. రెండుమూడు రోజుల్లోనే ఊహించని ఆఫర్లు. పేరున్న డిజైనర్ల ప్రాజెక్ట్‌ల కోసం ఒప్పందం కుదిరింది. ‘ఫ్యాబ్ ఇండియా’ మెగా క్యాంపెయిన్‌లో భాగస్వామినయ్యాను. అది ఆరంభం మాత్రమే. తరువాత ‘కాస్మోపాలిటన్, వోగ్, ఎల్లీ, హార్పర్స్ బజార్’ వంటి ప్రముఖ మేగజైన్ల కవర్‌పేజీలకు ఎక్కాను. ఫ్యాషన్ పరిశ్రమలో బడా కంపెనీలేవైతే ఉన్నాయో… వాటన్నిటి ప్రమోషన్ కోసం ర్యాంప్‌లపై నడిచాను.
**అక్కడే హోమ్‌వర్క్…
ఇవన్నీ నేను డిగ్రీ చదువుతున్న సమయంలోనే జరిగిపోయాయి. ఆ సమయంలో క్షణం కూడా తీరిక ఉండేది కాదు. ఒకపక్క మోడలింగ్ అసైన్మెంట్స్… మరోవైపు చదువు. ముంబయిలో ఫొటో షూట్స్ ముగించుకుని… వెంటనే ఢిల్లీలో తరగతులకు వెళ్లేదాన్ని. అది అవ్వగానే మళ్లీ ముంబయిలో వాలిపోయేదాన్ని. మళ్లీ షూట్స్, ఫ్యాషన్ షోలు. ఆఖరికి నా హోమ్వర్క్లకు కూడా సమయం దొరికేది కాదు. ‘లాక్మే ఫ్యాషన్ వీక్, అమెజాన్ ఫ్యాషన్ వీక్’లప్పుడు వేదిక వెనక్కి వెళ్లి హోమ్‌వర్క్ పూర్తి చేసిన రోజులూ ఉన్నాయి.
**న్యూయార్క్‌లో అలా…
2019 జూన్‌లో డిగ్రీ పూర్తవ్వగానే అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లాను. అక్కడి ‘మ్యూజ్ మేనేజ్మెంట్’ అనే ఏజెన్సీతో ఒప్పందం కుదిరింది. ఆరంభంలో కొన్ని రోజులు బంధువుల ఇంట్లో… ఇరుకు గదిలో ఉండేదాన్ని. తరువాత తక్కువ అద్దెలో ఇల్లు చూసుకున్నాను. అవకాశాల కోసం రోజూ ఆడిషన్స్‌కు వెళ్లాను. నెల తిరిగే సరికి అంతర్జాతీయ డిజైనర్లు పాల్గొనే ‘న్యూయార్క్ ఫ్యాషన్ వీక్’లో క్యాట్‌వాక్ చేసే అరుదైన అవకాశం వరించింది. ఆ వెంటనే ఊహించని అతి పెద్ద బ్రేక్… ‘సీస్ మార్జన్, జిమ్మెర్మాన్, బ్రోక్ కలెక్షన్, రాల్ఫ్ అండ్ రుసో’ తదితర బ్రాండ్లకు పనిచేశాను. ప్రపంచమంతా తిరిగి ఆ కలెక్షన్స్ ప్రదర్శించడం ఏ మోడల్‌కైనా ఒక మధురానుభూతి.
**గర్వంగా ఉంది…
ఏదిఏమైనా ఒక ఆడపిల్లని… ఎక్కడో అసోం నుంచి వచ్చి అమెరికాలో సూపర్ మోడల్‌గా ఎదిగానంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ‘రాల్ఫ్ రౌలెన్, అంబెర్ర్కోంబీ అండ్ ఫిచ్, శాక్స్ ఫిఫ్త్ అవెన్యూ, అమెరికన్ ఈగల్, మాక్’ తదితర ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్‌కు మోడలింగ్ చేస్తున్నా. ఫ్యాషన్ రంగంలో పేరున్న ప్రతి మేగజైన్ కవర్పేజీపైనా నా ఫొటోలు ప్రచురితమయ్యాయి. ఇది స్వయంకృషితో సాధించిన విజయం. ఇంత బిజీ షెడ్యూల్లో కరోనా వల్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించినప్పుడు కొంత విరామం లభించింది. ఆ సమయాన్ని గువహటిలో మా అమ్మా నాన్నలతో గడిపాను. చాలా ఏళ్ల తరువాత దొరికిన విరామం కదా… అయినవాళ్ల మధ్య దాన్ని ఎంతో ఆస్వాదించాను. పూర్తిగా రీచార్జ్ అయ్యాను.
**అదే ప్రత్యేకం…
ఎంతో పోటీ ఉండే మోడలింగ్‌లో నేను రాణించడానికి కారణం… వైవిధ్యమైన నా రూపమనే అనుకుంటున్నా. కొత్తదనం కోరుకొనేవారికి, భిన్నంగా తమ ఉత్పత్తులను ప్రదర్శించాలనుకొనేవారికి ఆ ప్రత్యేకత నచ్చే నన్ను ఎంచుకున్నారు. ఇప్పుడు అమెరికా, భారతీయ బ్రాండ్లకు మోడలింగ్ చేస్తున్నా. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ నాకు చేతి నిండా పని ఉందంటే… అది కెరీర్ పట్ల నాకున్న అంకితభావమే కారణం. నివాసం న్యూయార్క్‌లో అయినా అక్కడ నా ఫ్లాట్‌లో ఉండేది చాలా చాలా తక్కువ. ఎప్పుడూ ప్రయాణాలు… షూటింగ్‌లు.