*తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన యుఎస్ఏ, మలేషియా దేశాలకు చెందిన నాణేలను మార్చి 10వ తేదీన ఈ-వేలం వేయనున్నారు. మలేషియా నాణేలకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, యుఎస్ఏ నాణేలకు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ-వేలం జరుగనుంది. ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.
*గుంటూరు జిల్లా లో పది మంది తహశీల్దార్ల ను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ.
* డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ముమ్మిడివరం మండలంలోని అయినాపురంలో వైసీపీ నేతల వేధింపులు తాళలేక విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. నిబద్దత కలిగిన పోలీసుగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెచ్చుమీరాయన్నారు. సామాన్యుల ధన, మాన ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదురిస్తే బెదిరింపులు, ఆస్తుల ధ్వంసాలు జరుగుతున్నాయన్నారు. తూర్పు గోదావరిలో విశ్రాంత ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై వేధించారన్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే బెనిఫిట్స్ అందకుండా జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జాప్యం వెనుక వైసీపీ నాయకుల ఒత్తిడి ఉందంటూ వాంగ్మూలం ఇచ్చాడన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆయన కోరారు.
*ఉచ్చులో చిక్కిన ఎలుగుబంటిని హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 12మందిని మంగళవారం అరెస్ట్ చేశారు.
* కడప జిల్లా కోర్టుకు వివేకా హత్య కేసుబదిలీ!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కడప జైలులోని సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలను కొంత ఆలస్యంగా పులివెందుల తీసుకొచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొన్న అభియోగాల వివరాలను పులివెందుల మేజిస్ట్రేట్.. నిందితులకు అందజేయనున్నారు. ఇకపై వివేకా హత్య కేసు విచారణ పులివెందుల కోర్టు నుంచి కడప జిల్లా కోర్టుకు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించనున్నారు.
2021 ఏప్రిల్, మే నెలల బకాయిలకు సంబంధించి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మే నుంచి 18 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకూ పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని ఆర్థికశాఖ తెలిపింది. మరణించిన ఉద్యోగుల బకాయిలను వారి కుటుంబాలకు ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* అఫ్ఘాన్‌కు 2,500 టన్నుల గోధుమలు పంపిన భారత్
తీవ్ర ఆర్థికమాంద్యంతో పాటు ఆహార కొరతను ఎదుర్కొంటున్న అఫ్ఘాన్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. అఫ్ఘాన్ల ఆకలి తీర్చేందుకు 50,000 టన్నుల గోధుమలు పంపుతామని భారత్ పేర్కొన్నట్లుగానే సోమవారం మొదటి విడత కింద 2,500 టన్నుల గోధుమలను పంపించారు. గోధుమలతో లోడ్ అయిన అఫ్ఘాన్‌కు చెందిన 50 ట్రక్కులను పంజాబ్‌లోని అట్టారా సరిహద్దు వద్ద విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వి శ్రింగ్లా జెండా ఊపి ప్రారంభించారు. ఇవి పాకిస్తాన్ మీదుగా అఫ్ఘాన్‌లోని జలానాబాద్కు వెళ్తాయి. ట్రక్కులను ప్రారంభించిన కార్యక్రమంలో భారత్‌లోని అఫ్ఘాన్ అంబాసిడర్ ఫరీద్ మముంద్రయా సైతం పాల్గొన్నారు.
*హైదరాబాద్ నగర సమీపంలోని మొయినాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు చక్రాల కింద ద్విచక్ర వాహనం పడింది. దీంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* ఎర్రకోటపై కేసరి బావుటాను ఎగురవేస్తామని చెప్పిన మంత్రి ఈశ్వరప్పపై దేశద్రోహి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జిల్లా విభాగం నగరంలో సోమవారం ఆందోళన చేపట్టింది. నగరంలోని గడిగి చెన్నప్ప సర్కిల్ నుంచి ప్రారంభమైన ఆందోళన జిల్లా అధికారి కార్యాలయం వరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వంమంత్రి ఈశ్వరప్పకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.
*దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అతి తక్కువగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,405 కొవిడ్ కేసులు నమోదు అవగా…235 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,81,075 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా నమోదు అయ్యింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 5,12,344గా ఉంది. దేశవ్యాప్తంగా 1,75,83,27,441 మంది టీకా తీసుకున్నారు.
*సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్ చేరుకున్నారు. అనంతరం ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
*వీరనారి చాకలి ఐలమ్మ భూ స్వాముల ఆధిపత్యాన్ని ఎదురిస్తూ కొనసాగించిన తిరుగుబాటు భూ పోరాటానికి నాందిగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్, పడిగెల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.
*విజయవాడలోని కోర్టు భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన సివిల్ పనులను ఈ ఏడాది మే చివరినాటికి పూర్తి చేసి భవనాలను అప్పగిస్తామని సంబంధిత కాంట్రాక్టరు హైకోర్టుకు నివేదించారు. కోర్టులో అవసరమై ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఆ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఫర్నిచర్, ఇతర సౌకర్యాల కల్పన విషయంలో ఏంచర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని భవనాలశాఖ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించింది. విచారణను మార్చి 22కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. విజయవాడలోని కోర్టు భవన నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది చేకూరి శ్రీపతిరావు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా, ధర్మాసనం పై తీర్పు వెలువరించింది. మూడు అంతస్థులు స్వాధీనానికి సిద్ధంగా ఉన్నాయని, భవనాలకు అవసరమైన లిఫ్ట్‌లను ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినట్లు కాంట్రాక్టర్ తరఫు న్యాయవాది తెలిపారు.
*ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల్ని మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను నిలిపేయాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఆదివారం డిమాండ్ చేశారు. ‘‘ఉర్దూ మీడియం లేని పాఠశాలల్లో ఉర్దూ తరగతులను విలీనం చేయడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోంది. దీని గురించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో చెప్తే.. అలా చేయబోమని హామీఇచ్చారు. కానీ దానికి భిన్నంగా ప్రక్రియ జరుగుతోంది. కాబట్టి రాష్ట్రంలోని ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ్, ఇతర భాషలు ఉన్న పాఠశాలల్ని యథాతథంగా కొనసాగించాలి’’ అని సాబ్జీ కోరారు
*రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి, విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సమస్యపై సీఎం ఎందుకు స్పందించడం లేదని, సమీక్షలు ఎందుకు జరపడం లేదని నిలదీశారు. జగన్‌రెడ్డి సర్కారు 33 నెలలకే విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. రెండున్నరేళ్లలో ఆరుసార్లు చార్జీలు పెంచి, రూ.11,600 కోట్లు ప్రజలపై భారం మోపారన్నారు. వచ్చే ఏప్రిల్‌లో ఏడోసారి చార్జీలు పెంచబోతున్నారని చెప్పారు.
*త్వరలో రిలీజ్ కానున్న భీమ్లా నాయక్ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు జనసేన అధినేత పవన్ నరసాపురం బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. చరిత్రలో మొదటిసారిగా సినిమా ప్రమోషన్ కోసం రాజకీయలను ఉపయోగించుకుంటున్న ఘనత ఆయనకే దక్కింది’’ అని మంత్రి సీదిరి అప్పలరాజు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. ‘‘పబ్లిసిటీ కోసం మత్స్యకారులను రెచ్చగొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారు. ప్రతి జిల్లాలోను హార్బర్ ఏర్పాటు చేస్తున్నాం. హార్బర్‌ను ప్రారంభించడానికి సీఎం వస్తారు. పవన్‌కూ ఆహ్వానం పంపిస్తాం. దైర్యం ఉంటే రావాలి. యువత, జన సైనికుల ఆశయాలను పవన్ తాకట్టు పెడుతున్నారు. జనసేనాని జీవో 217 గురించి తెలుసుకుని, చదివి మాట్లాడాలి’’ అని వారు సూచించారు.
*రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అబ్బుర పరుస్తోంది. విశాఖలో సోమవారం రాష్ట్రపతి నౌకాదళ సమీక్ష (పీఎ్‌ఫఆర్)లో పాల్గొంటున్న 60 యుద్ధ నౌకలు, 47 జలాంతర్గాముల్లో 78 శాతం… మన నౌకా నిర్మాణ కేంద్రాల్లోనే తయారైనవి కావడం గమనార్హం. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో ఎంత వేగంగా అడుగులు వేస్తున్నామో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని నౌకాదళం సగర్వంగా చాటిచెబుతోంది. తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ విశాఖలోని నౌకా నిర్మాణ కేంద్రంలోనే రూపుదిద్దుకుంది. అదే బాటలో మరింత అధునాతన పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ అర్థిమాన్ తయారవుతోంది. రక్షణదళాల శక్తిసామర్థ్యాలు, ఆయుధ సంపత్తిని సమీక్షించడం ద్వారా ప్రపంచ దేశాల్లో భారత్ స్థానం ఏమిటో తెలియజెప్పడం కూడా ఒక ప్రధాన ఉద్దేశమని నేవీ వర్గాలు పేర్కొంటున్నాయి.
*పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం
పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ అధికారులతో సీడబ్ల్యుసీ, ప్రాజెక్ట్ అప్రయిసల్ కమిటీ, జలశక్తి అధికారులు భేటీ అయ్యారు. ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు,పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పనుల పురోగతి, నిధులు, పోలవరం పునరావాసం, నష్టపరిహారం సహా ప్రాజెక్ట్ ఇతర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.