1. ఉక్రెయిన్‌లో 16 వేల మంది భారతీయులు.. ఆ దేశాల మీదుగా ఇండియాకు!
ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా చెప్పారు. ఇందుకోసం ఉక్రెయిన్ సమీపంలో ఉన్న పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. రష్యన్ భాష మాట్లాడే అధికారులను ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు, అక్కడి ఇరుగుపొరుగు దేశాలకు పంపిస్తున్నామని అన్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను పొరుగు దేశాలకు, అక్కడి నుంచి మన దేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఇందుకోసం ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సహాయక కేంద్రాలు నెలకొల్పుతున్నామన్నారు. ఉక్రెయిన్‌లోని మన దేశస్తులను భద్రంగా తీసుకురావాలని ప్రధాని మోదీ ఆదేశించారని హర్షవర్దన్ ఉద్ఘాటించారు. భారత వైమానికి దళం విమానాలతోపాటు వాణిజ్య విమానాలను వాడతామన్నారు. ఉక్రెయిన్తోపాటు పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. భారత విద్యార్థులతో సహా ఉక్రెయిన్‌లో మొత్తం 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరిలో 4 వేల మంది తిరిగి వచ్చేశారు.
*మాకు రక్షణ కల్పించండి
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి భారతీయ విద్యార్థులు గురువారం పోటెత్తారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే, వారి కోసం భారత ఎంబసీ రక్షణపరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎంబసీ కల్పించిన వసతి సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నాయి. ఇప్పటిదాకా 200 మందికి పూర్తి భద్రతతో కూడిన తగిన వసతి కల్పించినట్లు సమాచారం.
*విద్యార్థులకు అడ్వైజరీ
ఉక్రెయిన్‌లో విధించిన మార్షల్ లాతో రాకపోకలు కష్టతరంగా మారాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. సైరన్లు, బాంబు హెచ్చరికలు వినిపించే వారు తమ సమీపంలోని బాంబు షెల్టర్లకు చేరుకోవాలని భారతీయులకు సూచించింది. ‘ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు గూగుల్ మ్యాప్‌ల సాయంతో సమీపంలోని బాంబు షెల్టర్లను గుర్తించండి. చాలా వరకు బాంబు షెల్టర్లు భూగర్భ మెట్రోల్లోనే ఉన్నాయి. చుట్టుపక్కల చోటుచేసుకునే పరిణామాల పట్ల అప్రమత్తతతో మెలగాలి. అన్ని సమయాల్లోనూ గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోవాలి’అని పేర్కొంది.
మరోవైపు, ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులందరినీ కాపాడేయత్నం చేస్తున్నామని భారత్‌లో ఆ దేశ రాయబారి ఇగోర్ పోలిఖ తెలిపారు. భారత్ ప్రకటనలు సరిపోవని, శాంతిని నెలకొల్పే యత్నం చేయాలని ఇగోర్ పేర్కొన్నారు. రష్యా సైనిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం తన గగనతలాన్ని మూసివేయడంతో, ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం మార్గమధ్యంలోనే వెనుదిరిగింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎయిరిండియా విమానం గురువారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ నుంచి కీవ్‌లోని బోరీస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది.
*అప్పటికే రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పౌర విమానసేవలు చాలా ప్రమాదకరంగా మారినందున ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసేసింది. దీంతో ఆ సమయంలో ఇరాన్ గగనతలంపై ఉన్న ఆ విమానం తిరిగి వెనుదిరిగింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానంలో 182 మంది భారతీయులు గురువారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీకి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో చాలామంది విద్యార్థులేనన్నారు. ఈ నెల 22వ తేదీన ఎయిరిండియా పంపిన మొదటి విమానంలో కీవ్‌లో ఉన్న 240 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.
*ఆఖరి క్షణంలో ఆగిపోయారు
ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి బయలుదేరిన ఇద్దరు భారత విద్యార్థులు రష్యా దాడుల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భారత్‌లోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన రోణక్ షెరాసియా(18), అతడి స్నేహితుడు మహావీర్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 500 కిలోమీటర్ల దూరంలో చెర్నివిట్సీలో ఉన్న బుకోవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ(బీఎస్ఎంయూ)లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారు గురువారం ఉదయం భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తెల్లవారుజామునే కీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్‌పోర్టు చెక్–ఇన్ కౌంటర్ వద్దకు వెళ్లగా విమానం రద్దయ్యిందని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదిలేక మళ్లీ బస్సులో యూనివర్సిటీకి బయలుదేరారు. కీవ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా, పెద్ద ఎత్తున బాంబుల శబ్దాలు పలుమార్లు వినిపించాయని రోణక్ షెరాసియా చెప్పాడు. ఆ భీకర శబ్దాలు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయని పేర్కొన్నాడు.
2. ఒంటరిగా వదిలేశారు : ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన
రష్యా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటే ప్రపంచం తమను ఒంటరిగా వదిలేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.రష్యాతో పోరాడి, తమ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కేవలం తమపైనే పెట్టిందని వాపోయారు. గురువారం ఉదయం ప్రారంభమైన యుద్ధంలో దాదాపు 137 మంది ఉక్రెయిన్ సైనికులు, సాధారణ ప్రజలు మరణించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.”మన దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని ఒంటరిగా వదిలేశారు” అని వోలోడిమిర్ ఉక్రెయిన్ ప్రజలకు చెప్పారు. మన పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. తమ పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లు తనకు కనిపించడం లేదన్నారు. ఉక్రెయిన్‌కు NATO సభ్యత్వంపై హామీ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో సైనికులు, సామాన్య ప్రజలు ఉన్నారని చెప్పారు. 316 మంది గాయపడినట్లు తెలిపారు. రష్యన్ విద్రోహ శక్తులు రాజధాని నగరం కీవ్‌లో ప్రవేశించాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కర్ఫ్యూను పాటించాలని కోరారు.
తనను టార్గెట్ నెంబర్ వన్‌గా రష్యా గుర్తించినప్పటికీ, తాను, తన కుటుంబ సభ్యులు ఉక్రెయిన్‌లోనే ఉన్నామని తెలిపారు. దేశాధినేతను దెబ్బతీయడం ద్వారా రాజకీయంగా ఉక్రెయిన్ను నాశనం చేయాలని రష్యా కోరుకుంటోందన్నారు.
3. ఉక్రెయిన్‌పై రెండో రోజూ కొనసాగుతున్న రష్యా దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సహా ప్రధాన నగరాలపై గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. భూ, ఆకాశ, సముద్ర మార్గాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపులో ఏర్పడిన భారీ సంక్షోభాల్లో ఇదొకటి. రష్యా జరుపుతున్న దాడుల్లో జరుగుతున్న విద్వంసాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూసిన ప్రపంచం తల్లడిల్లిపోతోంది. ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయమనం పాటించాలని రష్యాను కోరుతున్నారు. కీవ్‌లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించిన దాదాపు 1,700 మంది రష్యన్లను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం సెంట్రల్ కీవ్‌లో రెండు భారీ పేలుళ్ళు వినిపించాయి. రష్యన్ సేనలు కీవ్‌ను సమీపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ సైన్యం ఫేస్బుక్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం, కీవ్‌లో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యా దాడులు చేస్తోంది. రష్యాకు రెండు భయానక బహుమతులను ఇచ్చామని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తెలిపింది. కీవ్‌కు ఉత్తర దిశలో ఉన్న చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంటును రష్యా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ సలహాదారు తెలిపారు. కీవ్ నుంచి బెలారస్‌కు దగ్గరి దారి వెంబడి ఈ ప్లాంటు ఉందన్నారు.
కీవ్‌కు సమీపంలోని హోస్టోమెల్ విమానాశ్రయం వద్ద రష్యన్ పారాట్రూపర్లు ల్యాండ్ అయ్యారు, ఇక్కడ భీకర పోరాటం తర్వాత ఈ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, అమెరికా సీనియర్ డిఫెన్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ, రష్యా సేనలు కీవ్‌కు మరింత చేరువగా వెళ్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఈశాన్య దిశలో ఉన్న సుమీ, ఖార్కివ్ ప్రాంతాల్లో భారీగా కాల్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా దక్షిణ దిశలో ఉన్న ఖెర్సోన్ ప్రాంతంలో కూడా ఇరు దేశాల సైన్యాలు భీకరంగా తలపడుతున్నాయి. కీవ్‌లో దాదాపు 3 మిలియన్ల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భయానకంగా బాంబు దాడులు జరుగుతూ ఉంటే, ఈ హైవేపై కార్లలో వేలాది మంది చిక్కుకుపోయారు. ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 1 లక్ష మంది ఉక్రెయినియన్లు తమ ఇళ్ళను వదిలిపెట్టి పారిపోయారు. వేలాది మంది పొరుగున ఉన్న రుమేనియా, మాల్డోవా, పోలండ్, హంగేరీ దేశాలకు వెళ్లిపోతున్నారు.
4. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న తమిళులను రక్షించే చర్యలు చేపట్టినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సచివాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసు కొచ్చేలా దౌత్యాధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమిళులు 044-28515288, 9600023645, 9940256444 ఫోన్ నెంబర్లు, www. nrta mils.tn.gov.in వెబ్సైట్ ద్వారా సంప్రదించాలని ప్రభుత్వం తెలియజేసింది.
5. భారత్ రాజకీయవైద్య సాయం చేయాలి : ఉక్రెయిన్ ఎంపీ
రష్యా దాడుల నేపథ్యంలో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ అనేక విధాలుగా సంక్షోభంలో పడింది. ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని రక్షణ కోసం పరుగులు తీస్తున్నారు. ఇటువంటి సమయంలో తమను రాజకీయ, వైద్య రంగాల్లో ఆదుకోవాలని ఉక్రెయిన్ ఎంపీ సోఫియా ఫెడీనా భారత దేశాన్ని కోరారు. ఉక్రెయిన్‌లోని ఓ బాంబు షెల్టర్‌లో ఉన్న సోఫియా ఫెడీనా భారత దేశంలోని ఓ టీవీ చానల్‌తో శుక్రవారం మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు కేవలం ఆయుధాలతో మద్దతు మాత్రమే కాకుండా, మానసిక సహకారం కూడా అవసరమని చెప్పారు. దురాక్రమణదారు రష్యాను శిక్షించవలసి ఉందన్నారు. శాంతియుతంగా జీవిస్తున్న ఉక్రెయినియన్లను రష్యన్లు చంపుతున్నారని చెప్పారు. ఓ సార్వభౌమాధికార దేశ మానవ హక్కులను కాపాడాలని భారత దేశంలోని రాజకీయ నాయకులందర్నీ కోరుతున్నట్లు తెలిపారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని నౌకాశ్రయ నగరం ఓడెస్సా తమ స్వాధీనంలోనే ఉందని తెలిపారు. ఇది శత్రువుల చేతికి చిక్కినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఇవన్నీ రష్యన్లు సృష్టిస్తున్న వదంతులేనని చెప్పారు. తాను ఈ విషయాన్ని మరొక పార్లమెంటేరియన్‌తో ధ్రువీకరించుకుని చెప్తున్నానని తెలిపారు
6. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు
పాతబస్తీ యువకుడు రషీద్ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయాడు. గోషా మహల్ పోలీస్ స్టేషన్‌లోని హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఫరీద్-ఉద్-దిన్ కుమారుడు రషీద్ మెడిసిన్ చదివేందుకు రెండు వారాల క్రితం హైదరాబాద్ నుంచి ఉక్రెయిన్‌కు వెళ్లాడు. ఉక్రెయిన్‌లోని ఇవానో-ఫ్రాంక్ వెస్క్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో రషీద్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా అక్కడ రషీద్, ఇక్కడ అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.రషీద్‌తో పాటు ఉక్రెయిన్‌లో మరో తెలంగాణ వాసి కూడా చిక్కుకుపోయాడు. జయశంకర్ భూపాలపల్లి వాసి వెంకటేష్ ఉక్రెయిన్ రాజధాని క్రివ్లో ఉద్యోగరీత్యా వెళ్లాడు. రెండు నెలల క్రితం ఉద్యోగ రీత్యా ఉక్రెయిన్ వెళ్లాడు. క్రివ్ నుంచి వెళ్లిపోవాలని అధికారులు అంటున్నారు. భారత్‌కి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు
7. 200మందికి పైగా భారతీయ విద్యార్థులకు స్కూల్లో ఆశ్రయం
ఉక్రెయిన్‌లోని 200మందికి పైగా భారతీయ విద్యార్థులకు ఎంబసీ అధికారులు ఓ స్కూల్లో ఆశ్రయం కల్పించారు. కీవ్ రాయబార కార్యాలయానికి సమీపంలోని ఓ పాఠశాలలో వీరికి వసతి ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాయబారి పార్థ సత్పతి విద్యార్థులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన విద్యార్థులతో అన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఉక్రెయిన్‌లోని భారతీయులందరినీ స్వదేశానికి తరలించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ చర్యలు చేపడుతోందన్నారు. అయితే, అనుమతి లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని విద్యార్థులకు సూచించారు.
8. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థులు తమ వాహనాలపై భారతీయ జెండాను పెట్టుకోవాలని సూచించింది. హంగేరి బోర్డర్ చెక్‌పోస్టుకు చేరుకోవాలని ఎంబసీ సూచనలు చేసింది. కాగా… ఉక్రెయిన్‌లో అనేకమంది భారతీయులు చిక్కుకున్నారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అనేక మందిని భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. తాజాగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు రెండు విమానాలను సిద్ధం చేసింది. శుక్రవారం-శనివారం రాత్రి 2 గంటలకు రెండు విమానాలను భారత్ సర్కార్ పంపించనుంది. బుకారెస్ట్ మీదుగా భారతీయ పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చేందుకు రెండు ఎయిరిండియా విమానాలు బయల్దేరుతాయి. ఇండియన్ ఇవాక్యుయేషన్ టీమ్స్ రుమేనియా సరిహద్దులకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ప్రయాణించడానికి 12 గంటల సమయం పట్టనుంది.
9. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త… మరికొద్ది గంటల్లో రెండు విమానాలు…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు శుక్రవారం-శనివారం రాత్రి 2 గంటలకు రెండు విమానాలను భారత ప్రభుత్వం పంపిస్తోంది. బుకారెస్ట్ మీదుగా భారతీయ పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చేందుకు రెండు ఎయిరిండియా విమానాలు బయల్దేరుతాయి. ఇండియన్ ఇవాక్యుయేషన్ టీమ్స్ రుమేనియా సరిహద్దులకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. సివిలియన్ విమానాల రాకపోకలపై ఉక్రెయిన్ నిషేధం విధించినందు వల్ల భారత పౌరులు సురక్షితంగా రావాలంటే బుకారెస్ట్ గుండా రావలసి ఉంటుంది. చాలా మంది భారతీయులు ఇండియన్ ఎంబసీలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఎంబసీ పరిసరాల్లో పెద్ద ఎత్తున బాంబు దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం
10. వ్ సమీపంలో రష్యా దాడులు తీవ్రతరం
ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ పరిసరాల్లో రష్యా సేనల దాడులు మరింత పెరిగాయి. శుక్రవారం సాయంత్రానికి రష్యా దళాలు కీవ్ శివారు ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని ఉక్రెయిన్ రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు నగర ప్రజలను హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై శుక్రవారం ఉదయం రష్యన్ క్షిపణులు పెద్ద ఎత్తున కురిసినట్లు తెలిపారు. రష్యా సేనలను దీటుగా ఎదిరిస్తున్నట్లు ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మల్యార్ చెప్పారు. సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై సైతం రష్యన్ సేనలు దాడి చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఇదిలావుండగా, ప్రజలు నగరంలోని సురక్షిత బంకర్లలోకి వెళ్ళాలని నగర పాలక సంస్థ అధికారులు కోరారు. రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకులు ప్రయాణించడానికి వీల్లేకుండా నిరోధించేందుకు ఉక్రెయిన్ సైన్యం కీవ్‌లోని ఓ వంతెనను శుక్రవారం కూల్చేసింది. రష్యా యుద్ధ ట్యాంకులు వస్తుండగా, వంతెనను కూల్చేసి, వాటిని నిలువరించినట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ స్థానిక మీడియాకు తెలిపారు. ‘‘ట్యాంకులు వస్తున్నాయి. మేం పోరాడుతున్నాం’’ అని ఉక్రెయిన్ దేశాధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఇదిలావుండగా, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినపుడు కీవ్‌ను ఈ వారంతంలో రష్యా సేనలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అమెరికా సెక్యూరిటీ అధికారులు అంచనా వేస్తున్నారు
11. రాజధాని విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించిన జెలన్స్కీ
రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తోంది. కీవ్ వెలుపల రష్యా బలగాలను ఎదుర్కొంటున్నట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. ఈ దాడుల్లో 450 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. కాగా రాజధాని విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఖండించారు. సైనిక లక్ష్యాలపై దాడులు చేస్తున్నట్లు రష్యా అవాస్తవాలు చెబుతోందన్నారు. అయితే రష్యాతో పోరులో ఒంటిరిగా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయమేదీ తమకు అందట్లేదని వాపోయారు.రష్యా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటే ప్రపంచం తమను ఒంటరిగా వదిలేసిందని వోలోడిమిర్ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాడి, తమ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కేవలం తమపైనే పెట్టిందన్నారు. గురువారం ఉదయం ప్రారంభమైన యుద్ధంలో దాదాపు 137 మంది ఉక్రెయిన్ సైనికులు, సాధారణ ప్రజలు మరణించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు
12. ఉక్రెయిన్‌లో కృష్ణాజిల్లాకు చెందిన విద్యార్థుల ఇబ్బందులు…
ఉక్రెయిన్‌లో కృష్ణాజిల్లాకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, చాలా కష్టాలు పడుతున్నామని విద్యార్థిని శీలం రాధిక ఓ వీడియో పంపారు. ప్రస్తుతానికి మెట్రో స్టేషన్‌లోని బేస్మెంట్లో ఉండమని చెప్పారని, అక్కడికి వెళ్లేసరికి ఉక్రెయిన్ స్థానికులతో ఆ ప్రాంతం నిండిపోయిందని చెప్పారు. ఇక్కడ తమ పరిస్థితి బాగోలేదని, మంచినీటి సరఫరా లేదని, కరెంట్ కూడా కట్ అవుతుందని చెబుతున్నారని ఆమె అన్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే భయంగా ఉందని, కనీసం కూర్చోడానికి స్థలం కూడా లేదని వాపోయారు. నరేంద్ర మోదీ స్పందించి తమను కాపాడాలని రాధిక విజ్ఞప్తి చేశారు
13. అమ్మా భయమేస్తోంది.. బంకర్లో బిక్కుబిక్కుమంటున్న తెలుగు విద్యార్థులు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినప్పటి అక్కడి నుంచి ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనమే లక్ష్యంగా రష్యా బలగాలు బాంబుల వర్షంతో ఆ నగరాన్ని అల్లాడిస్తోంది. ఇదిలా ఉండగా మరో వైపు వేలాది మంది భారతీయలు, ప్రత్యేకించి విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది.ముందస్తు హెచ్చరికలు ప్రభుత్వాలు జారీ చేసినప్పటికీ సమస్య యుద్ధం వరకు వెళ్లదని అంతా భావించారు. కానీ పుతిన్ ప్రకటనతో తాజాగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ ఎటూ పోవాలో తెలియక చిక్కుకుపోయారు. సుమారు 18 వేల మంది భారతీయులు అందులో అధికంగా విద్యార్ధులు ఉన్నారు. ప్రస్తుతం చేతులో సరిపడా డబ్బులు లేక అరకొర ఆహారం తీసుకుంటూ ఎటువెళ్లాలో తెలియని స్థితిలో వారు గడుపుతున్నారు
14. బుచరెస్ట్ నుంచి ఎయిర్‌లిఫ్ట్.. రెండు ప్రత్యేక విమానాలు సిద్ధం
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. హంగేరి, రుమేనియా దేశాలకు దగ్గరగా ఉన్న వారు సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్దరు రావాలని సూచించింది. ప్రయాణించే సమయంలో తమ వాహనాలపై ఇండియన్ ఫ్లాగ్‌ను పెట్టుకోవాలని కోరింది. భారతీయుల తరలింపు కోసం గురువారం రాత్రి నుంచి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హంగరీ, స్లోవేవకియా, రుమోనియా దేశాలకు చెందిన ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. భారతీయుల తరలింపుకు పూర్తి సహకారం అందిస్తామని ఆయా దేశాలు ప్రకటించాయి. దీంతో కేంద్రం వెంటనే కీలక ఆదేశాలు జారీ చేసింది
15. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి.. ఆందోళనలో తల్లిదండ్రులు
ఉన్నత విద్యకోసం ఉక్రెయిన్ పంపితే యుద్ధవలయంలో చిక్కుకోవాల్సి వచ్చిందని… కృష్ణాజిల్లా మైలవరానికి చెందిన హేమంత్ కుమార్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ కుమారుడుని క్షేమంగా తిరిగి ప్పించేందుకు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.క్రెయిన్‌లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి.. ఆందోళనలో తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు.. ఆందోళనలో కూరుకుపోయారు. వారికి అక్కడ ఏమవుతుందోనంటూ తల్లిదండ్రులు బెంగపడుతున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో తాపీ మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్న మాధు శ్రీనివాసరావు కుమారుడు… హేమంత్ కుమార్ ఉక్రెయిన్‌లోని కాచ్యులో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతున్న తరుణంలో హేమంత్ భారతదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తూ… అక్కడే ఉండిపోయాడు. దీంతో హేమంత్ తల్లిదండ్రులు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.ఉక్రెయిన్ ఇండియన్ ఎంబసీ అధికారులు హేమంత్ కుమార్‌తో పాటు భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. గురువారం సాయంత్రం తల్లిదండ్రులకు అక్కడి పరిస్థితులను మెసెజ్ చేయడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ కుమారుడుని క్షేమంగా తిరిగి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు
16. ఉక్రెయిన్‌లోని తెలుగువారిని ఆదుకునేందుకు తెలంగాణ చర్యలు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. దిల్లీ, హైదరాబాద్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసి.. విదేశాంగ శాఖతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. అటు.. రాష్ట్ర భాజపా నేతలు సైతం.. బాధితుల పరిస్థితులను.. ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేస్తున్నారు.ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిల్‌లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. తనకు సందేశాలు పంపిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వారందరికీ వీలైనంత త్వరగా దేశానికి రప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
17. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో గ్యాస్ ధరకు రెక్కలు- వాటికి తీవ్ర కొరత!
ఉక్రెయిన్‌పై రష్యా మోగించిన సమరభేరి యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆసియా నుంచి ఐరోపాకు ఎగుమతయ్యే ఆహార పదార్థాల సరఫరాకు రష్యా, ఉక్రెయిన్ రవాణా మార్గాలుగా ఉండటం వల్ల ఐరోపా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంధనం, మైక్రోచిప్, లోహాల అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రస్తుత యుద్ధ పరిస్థితులు పెను ప్రభావం చూపనున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. యుద్ధానికి కాలు దువ్విన రష్యా-ఉక్రెయిన్ విదేశీ ఎగుమతుల గొలుసులకు ప్రధాన మార్గాలు ఉండటం వల్ల ఇది ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఐరోపా దేశాలు సహా ఇతర దేశాలకు ఎగుమతయ్యే ఆహారం, నిత్యవసర వస్తువులు, ముడి పదార్ధాలు, గ్యాస్, ఇంధనం వంటి కీలకమైన ఉత్పత్తుల సరఫరాకు ఈ రెండు దేశాలే ప్రధాన మార్గాలుగా ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న భయోత్పాత పరిస్థితులు వివిధ దేశాలకు శాపంగా పరిణమించనున్నాయి
18. ఉక్రెయిన్‌లోని ఇండియన్స్ కోసం కేంద్రం కీలక నిర్ణయం
ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయించింది. విమాన ఛార్జీలను కేంద్రమే భరించనున్నట్లు తెలిపింది. రాత్రికి ఉక్రెయిన్ సమీప దేశాల నుంచి 2 విమానాలు బయల్దేరనున్నాయి. రుమేనియా మీదుగా విమనాలు రానున్నాయి. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో.. ఉక్రెయిన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం మళ్లీ ఢిల్లీకి నిన్న తిరిగొచ్చిన విషయం తెలిసిందే.భారతీయ అధికారుల బృందాలను హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా ఉక్రెయిన్ సరిహద్దులకు పంపి.. అక్కడ్నుంచి విద్యార్థులను స్వదేశానికి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్, పోలాండ్, హంగేరి దేశాల్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు విద్యార్థుల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 16 వేల మంది ఇండియన్స్ ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. స్వదేశానికి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత తమదని ఇండియన్స్‌కు కేంద్రం హామీ ఇచ్చింది. ఉక్రెయిన్ నుంచి భారతీయులు బయటపడేందుకు కేంద్రం సురక్షితమైన దారులను గుర్తించింది. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో నిన్న మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని పుతిన్‌ను మోదీ కోరారు.
19. బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌కి గగనతలాన్ని మూసేసిన రష్యా
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా, పశ్చిమ దేశాల ఆంక్షలను తిప్పికొడుతున్నది. తన గగనతలాన్ని బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌కి మూసేసింది. అలాగే రష్యా విమానాశ్రయాల్లో బ్రిటన్ విమానాల ల్యాండింగ్‌ను నిషేధించింది. రష్యా పౌర విమానయాన సంస్థ ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘యూకేలో రిజిస్టర్ అయిన లేదా ఆ దేశంతో సంబంధం ఉన్న, లీజు ఒప్పందం ఉన్న విమానాలు రష్యా గగనతలాన్ని, ఎయిర్‌పోర్టులను వినియోగించడంపై ఆంక్షలు అమలు చేస్తున్నాం’ అని రోసావియాట్సియా ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి ఈ నిషేధం అమలవుతుందని పేర్కొంది. యూకే ఏవియేషన్ అథారిటీ అననుకూల నిర్ణయాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది.కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని పశ్చిమ దేశాలు ఖండించాయి. అమెరికాతోపాటు ఈయూ కూటమి రష్యాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఇందులో భాగంగా రష్యా విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ విమానాలపై బ్రిటన్ నిషేధం విధించింది.అయితే దీనికి ప్రతీకారంగా రష్యా చర్యలు చేపట్టింది. బ్రిటన్ విమానాలు తమ గగనతలాన్ని వినియోగించడంతోపాటు విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌ను రష్యా నిషేధించింది. తమపై ఆంక్షలు విధించే దేశాలపై ప్రతీకార చర్యలు చేపడతామని ముందుగానే రష్యా హెచ్చరించింది
20. రష్యా యుద్ధ విమానాన్ని పేల్చేసిన ఉక్రెయిన్..
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా వైమానిక దాడులు చేస్తోంది. బాంబు పేలుళ్లతో ఆ నగరం దద్దరిల్లుతోంది. క్రూయిజ్ లేదా బాలిస్టిక్ మిస్సైళ్లతో రష్యా దాడికి దిగినట్లు భావిస్తున్నారు. అయితే గురువారం రాత్రి కీవ్ గగనతలంలోకి వచ్చిన రష్యా విమానాన్ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ హోంశాఖ వెల్లడించింది. రాత్రి పూట కీవ్ నగరంపై పేల్చివేతకు గురైన ఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. సెంట్రల్ కీవ్ ప్రాంతంలో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. మరో పేలుడు దూర ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు ద్వారా తెలుస్తోంది. గురువారం రాత్రి కీవ్ లో జరిగిన దాడికి సంబంధించి తొలుత సమాచారం రాలేదు. ఏదో గుర్తు తెలియని వస్తువును పేల్చినట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత రష్యా యుద్ధ విమానాన్ని పేల్చినట్లు ఉక్రెయిన్ హోంశాఖ తెలిపింది
21. భారత్ కి బ్యాడ్ న్యూస్,
యుద్ధం దెబ్బకు భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు…
భారత ప్రజలు ద్రవ్యోల్బణంతో పెద్ద దెబ్బ తినబోతున్నారా? అవుననే అంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల భారీ పెరుగుదలకు సిద్ధంగా ఉండాల్సిందేనా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధర పెరగడమే ఇందుకు సంకేతం. యుక్రెయిన్ పై రష్యా దాడి చేయడంతో యుద్ధ వాతావరణం నెలకొనగా ముడి చమురు ధర బ్యారెల్ 100 డాలర్లకు చేరుకుంది. 2014 సెప్టెంబర్ తర్వాత ముడి చమురు బ్యారెల్ 100డాలర్లకు చేరడం ఇదే తొలిసారి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పూర్తిగా చెలరేగితే ముడి చమురు మరింత ఖర్చుతో కూడుకున్నదిగా కావచ్చు. ముడి చమురు ధరలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ పరిశోధనా సంస్థల ప్రకారం రాబోయే రోజుల్లో ముడి చమురు ధర 100డాలర్లు కంటే ఎక్కువగా ఉండొచ్చు. రెండు నెలలుగా ముడిచమురు ధరలు మండి పోతున్నాయి. 2022లో ముడి చమురు ధరలు 25 శాతానికి పైగా పెరిగాయి, గత రెండు నెలలుగా, ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.దేశంలోని పెట్రోలు, డీజిల్ ధరల్లో ప్రస్తుతం అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లోఎలాంటి మార్పు లేదు కానీ, ఐదు రాష్ట్రాల ఎన్నికలతర్వాత మాత్రం కచ్చితంగా భారీ మార్పు కనిపించే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 4, 2021 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. కానీ ఇప్పుడు ముడ చమురు ధరలు భారీగా పెరిగాయి.మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినత్వాత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ధరల్లో కచ్చితంగా మార్పు చేయవచ్చుభారత్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపైఆధారపడుతోంది. అందువల్లే క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు,రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్నప్పన్ రేషియో వంటి అంశాలు ఇంధన ధరలపై ఎఫెక్ట్ చూపుతాయి.