Devotional

యాదాద్రిలో టీటీడీ తరహా సేవ టికెట్లు… -TNI ఆధ్యాత్మిక వార్తలు

యాదాద్రిలో టీటీడీ తరహా సేవ టికెట్లు… TNI ఆధ్యాత్మిక వార్తలు

తెలంగాణలోని యాదాద్రి క్షేత్రంలో దైవ దర్శనాలకు వచ్చే భక్తులకు తిరుమల తరహాలో టికెట్ల విక్రయాలు అమలు చేయాలనే యోచనతో ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ప్రయోగాత్మకంగా ఈ విధానాలను పరిశీలించనున్నారు. మరోవైపు స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 4న మెుదలు కానుండడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌ బర్కత్‌పురలోని యాదగిరిభవన్‌ నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అఖండజ్యోతి ప్రచార రథయాత్రను అధికారులు ప్రారంభించారు. తెలంగాణలో పునర్నిర్మితమైన యాదాద్రి క్షేత్రంలో దైవ దర్శనాలను తిరుమల తరహాలో కల్పించే యోచనలో ఆలయ యంత్రాంగం కసరత్తులు చేపడుతోంది. ఆలయ ఉద్ఘాటన జరిగాక భక్తుల రాక గణనీయంగా పెరగనుందని అధికారులు భావిస్తున్నారు.

2. శ్రీరామనవమికి గోటి తలంబ్రాలను తాయారు చేస్తున్న భక్తులు
శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ శివసాయినగర్కు చెందిన భక్తులు గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 10న నిర్వహించే సీతారాముల కల్యాణానికి ఈ గోటి తలంబ్రాలను పంపిస్తామని శ్రీ లక్ష్మి గణపతి ఆలయ పూజారి కృష్ణారావు చెప్పారు. భద్రాచలం నుంచి తెప్పించిన వడ్లతో గోటి తలంబ్రాలు తయారు చేశామని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు.

3. శంభో..శివ శంభో!
ఇలకైలాసమైన శ్రీశైలం శ్రీగిరిపై వేంచేసి ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నద్ధమైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీగిరికి ప్రత్యేక స్థానం. ఇక్కడ మల్లన్నకు జరిగే విశిష్ట సేవలు మరెక్కడా జరగవు. వాటిలో మల్లన్న పాగాలంకరణ ఒకటి. మహా శివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో జరిగే ఈ సేవ అత్యంత విశిష్టమైనది. మంగళవారం మహా శివరాత్రి పర్వదినం కావడంతో పాగాలంకరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట హస్తినాపురం గ్రామానికి చెందిన చేనేత కుటుంబం వంశపారంపర్యంగా మల్లన్నకు తలపాగాను తయారు చేస్తుంది. ఆ గ్రామానికి చెందిన పృధ్వి వెంకటేశ్వర్లు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు వెంకట సుబ్బారావు తండ్రికి సహకరిస్తున్నారు. స్వామివారికి దిక్కులే వస్త్రాలు. అందుకే పాగాలంకరణ సేవ చేసేవారు దిగంబరంగానే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆ సమయంలో ఆలయం, పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. పాగాలంకరణ పూర్తయ్యాక విద్యుత్ వెలుగులు నింపుతారు. పాగాలంకరుడైన మల్లన్నను చూసేందుకు భక్తుల రెండు కళ్లు చాలవు. అనంతరం రాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునుడికి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.
*వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు
శ్రీగిరిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 22న ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష వాహన సేవ నిర్వహిస్తున్నారు. మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లన్నను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ‘శంభో.. శివ శంభో’అని స్వామివారిని కీర్తిస్తూ శ్రీగిరి చేరుకుంటున్నారు. పలువురు శివమాలను ధరించి వస్తున్నారు. నల్లమల కొండల్లో పాదయాత్ర చేసుకుంటూ వేలాది మంది శ్రీగిరికి చేరుకుంటున్నారు.
*గజ వాహనంపై మల్లన్న దరహాసం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం భ్రమరాంబా సమేతుడైన మల్లన్న గజవాహనంపై విహరించాడు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గజవాహనంపై ఆశీనులను చేసి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం గజవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి క్షేత్రప్రధాన వీధుల్లోకి తోడ్కొని వచ్చి గ్రామోత్సవానికి తరలించారు. కళాకారుల కోలాహలం నడుమ గ్రామోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు

4. వన దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు
గోదావరి జలాలతో ఏడుపాయల దుర్గమ్మ కాళ్లు కడుగుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వన దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి మెదక్‌ జిల్లా పాపన్నపేటలో ఏడుపాయల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ మదిలో ఊపిరి పోసుకున్న అద్భుతమైన ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు అని నేడు అది శివుడి జడల నుంచి గంగమ్మ పొంగి పొర్లినట్లు, 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంపిణీ చేస్తుందన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మల నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీరు వస్తుందని, దీంతో మంజీర పాయల్లో గోదావరి జలాలు పరుగులు తీసి దుర్గమ్మ ఆలయాన్ని తాకుతూ ముందుకు పరుగులు పెడతాయన్నారు. మెతుకుసీమలో నీటి కరువు ఉండదని 10 జిల్లాలు లబ్ధి పొందుతాయన్నారు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు కేటాయించారని అందులో నుంచి ఏడుపాయల, ఘనపురం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారని తెలిపారు

5.నల్లమలలో వైభవంగా చెంచుల జాతర
నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం భౌరాపూర్‌పెంటలో చెంచుల ఆరాధ్య దైవం భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి కల్యాణాన్ని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించింది. చెంచులు భౌరమ్మను ఆడబిడ్డగా, మల్లికార్జునస్వామిని అల్లుడిగా భావించి కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు స్వామివారి తరపున, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ దంపతులు అమ్మవారి తరపున పెళ్లిపెద్దలుగా వ్యవహరించి స్వామివారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. చెంచుల గురువు గురువయ్య శివపార్వతుల కల్యాణం జరిపించారు. కాగా, సిద్ది పేటజిల్లా కొమురవెల్లిలో మంగళవారం రాత్రి పెద్దపట్నం వేశారు.

6. యాదాద్రిలో ఆన్‌లైన్‌ సేవలు: ఈవో గీత
ఈనెల 28న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఉద్ఘాటన తర్వాత భక్తులకు అన్ని రకాల సేవలు, పూజలు అందుబాటులోకి వస్తాయని ఈవో గీత తెలిపారు. మంగళవారం బర్కత్‌పురాలోని యాదాద్రి భవన్‌ వద్ద శ్రీలక్ష్మీనరసింహస్వామి 28వ అఖండ జ్యోతి ప్రచార రథయాత్రను ప్రారంభించి ఆమె మాట్లాడారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 4 మొదలై 14 వరకు కొనసాగుతాయని తెలిపారు. యాదాద్రిలో అన్‌లైన్‌ సేవలు, దర్శనాలు, బ్రేక్‌ దర్శనాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో యాదాద్రి ఫౌండర్‌ ఫ్యామిలి ట్రస్టీ నర్సింహమూర్తి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

7. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారిని మంగళవారం 53,163 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 20,651 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదయాం రూ.4.51 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది

8. సోమేశ్వరస్వామిని దర్శించుకున్న సోమువీర్రాజు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరస్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో మన విద్యార్థుల ఇబ్బందులు తొలగాలని, అక్కడి నుండి తీసుకువచ్చే ప్రయత్నం బాగానే జరుగుతుందని తెలిపారు. దేశంలో అద్భుతమైన వ్యవస్థలు నిర్మాణమయ్యాయన్నారు. తెలంగాణ దేశంలో ప్రఖ్యాతి కలిగిన రాష్టంగా తీర్చిదిద్దబడాలని అమ్మవారిని కోరుకున్నానని సోమువీర్రాజు పేర్కొన్నారు.

9. కీసరలో కిక్కిరిసిన భక్తజనం
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట పుణ్యక్షేత్రం శివనామస్మరణతో మంగళవారం మారుమోగింది. శివభక్తులు కీసరగుట్టకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు స్వామివారికి వేదపండితులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కల్యాణ మంటపంలో సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహాకార హోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివలింగాలకు భక్తులు పంచామృతాలతో అభిషేకం చేశారు. లక్ష్మీనర్సింహ స్వామి, నాగదేవతా ఆలయాలను దర్శించుకొని పూజలు చేశారు.

10. శ్రీశైలంలో కన్నులపండువగా ఆది దంపతుల కల్యాణం
మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతోమార్మోగాయి. దేవాలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు… భోళా శంకరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అశేష భక్తజన సమక్షంలో శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో నంది వాహన సేవ కన్నులపండువగా జరిగింది. స్వామి అమ్మవార్లను పుర వీధుల్లో ఊరేగించారు. అనంతరం పాగాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ విమాన గోపురానికి పాగాలంకరణ చేశారు. స్వామివారి కల్యాణం కోసం పాగాలంకరణ చేయటం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం భ్రమరాంబ మల్లికార్జునుల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.మహా శివరాత్రి పర్వదినాన శ్రీశైలం.. భక్తులతో కిటకిటలాడింది. అర్ధరాత్రి స్వామి, అమ్మవారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారికి మహన్యాసకపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ చేశారు. లక్షలాది భక్తుల ఓంకార నాదంతో శ్రీశైల గిరులు ప్రతిధ్వనించాయి.కర్నూలు జిల్లా మహానందీశ్వర స్వామి కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలను సమర్పించింది. మహనందీశ్వర స్వామి, శ్రీ కామేశ్వరి దేవి అమ్మవార్లకు సింహ వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహించారు. అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో శివరాత్రి వేళ నిర్వహించిన స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. అశేష భక్తజన సందోహంతో గుంటూరు జిల్లా కోటప్పకొండ నిండిపోయింది. కోరిన కోర్కెలు తీర్చే కోటయ్య కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి మెుక్కులు తీర్చుకున్నారు. శివజాగరణ చేసే భక్తుల శివనామ స్మరణతో త్రికూట పర్వతం మార్మోగింది. భారీ విద్యుత్ ప్రభలు ఉత్సవాలకు మరింత శోభ తెచ్చాయి. గుంటూరు జిల్లా అమరేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు.శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తూ శివనామస్మరణతో.. జాగరణ చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కడపలో బ్రహ్మకుమారీలు ద్వాదశ జ్యోతిర్లింగం ఏర్పాటుచేశారు. రాజంపేటలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహాశివలింగం ఏర్పాటు చేశారు. విశాఖ ఆర్కే బీచ్‌లో మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డి కోటిలింగాలకు కుంభాభిషేకం నిర్వహించారు

11. హరహర మహాదేవ…- ఈషా ఫౌండేషన్‌కు పోటెత్తిన భక్తగణం
పరమేశ్వరుడికి ప్రీతికరమైన మహా శివరాత్రి రోజైన మంగళవారం రాష్ట్రం లోని శైవక్షేత్రాలు హరహర మహాదేవ నామస్మరణతో మారుమ్రోగాయి. ముఖ్యంగా కోయంబత్తూరు సమీపం లోని వెల్లయంగిరి ఈషా ఫౌండేషన్‌ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరి సింది. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో వెల్లయంగిరి జనసంద్రంగా మారిపోయింది. భక్తుల ఓంకార నాదంతో లయకారుడే తన్మయుడై పోయాడా అన్నంతగా అక్కడ భక్తిభావం వెల్లివిరిసింది. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేందుకు, ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రంతా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు భక్తిపారవశ్యంలో ముంచెత్తగా, సద్గురు ప్రబోధం ఓలలాడించింది. ఈ వేడుకల్లో రాజకీయ, సినీరంగాలకు చెందిన ప్రముఖులు, వేలాది మంది భక్తులు పాల్గొనగా, సినీ కళాకారులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తబృందాలు నిర్వహించిన సంగీత కచ్చేరీలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి

12. ఆల‌యం గ‌ర్భ‌గుడిలో నాగుపాము ప్ర‌త్య‌క్షం.. పూజ‌లు చేసిన భ‌క్తులు
నిర్మ‌ల్ జిల్లా ద‌స్తురాబాద్ మండ‌లం గొడిశార్ల గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నాగుపాము ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో భ‌క్తులు ఆ నాగుపాముకు పూజ‌లు చేశారు. ఆల‌యంలోని గ‌ర్భ‌గుడిలోకి నాగు పాము ప్ర‌వేశించింద‌ని భ‌క్తులకు తెలియ‌డంతో పెద్ద ఎత్తున అక్క‌డికి త‌ర‌లివ‌చ్చారు. త‌మ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేశారు. అయితే నాగుపామును చూసేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లిరావ‌డంతో.. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య పూజారి ల‌క్ష్మ‌ణ్ స్వామి మాట్లాడుతూ.. గ‌త ఐదేండ్ల నుంచి శివ‌రాత్రి ప‌ర్వ‌దినం నాడు ఆల‌య గ‌ర్భగుడిలోకి నాగుపాము వ‌చ్చి పూజ‌లు అందుకుంటుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో భ‌క్తులు ఆ పాముకు ప్ర‌త్యేక పూజ‌లు చేసి త‌మ భ‌క్తిని చాటుకుంటున్నార‌ని చెప్పారు.