NRI-NRT

ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు కమలా హారిస్

ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు కమలా హారిస్

రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న వేళ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​.. ఉక్రెయిన్​ సరిహద్దు దేశాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే వారం పోలండ్​, రొమేనియా దేశాల్లో పర్యటించి, నాటో భాగస్వామ్య దేశాలతో చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్‌- రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కీలక పర్యటన చేపట్టనున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దులోని పోలండ్‌, రొమేనియాల్లో ఆమె వచ్చే వారం పర్యటించనున్నారు.రష్యా దురాక్రమణలకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకు రావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కమలా హారిస్‌ డిప్యూటి ప్రెస్‌ సెక్రటరీ సబ్రినా సింగ్‌ తెలిపారు. మార్చి 9-11 మధ్య పోలండ్‌ రాజధాని వార్సా, రొమేనియాలోని బుకారెస్ట్‌లో కమలా పర్యటిస్తారని సబ్రినా వెల్లడించారు. ఆ రెండు దేశాల నేతలతో సమావేశమై.. ఉక్రెయిన్‌, రష్యా సంక్షోభంపై చర్చించనున్నట్టు చెప్పారు. ఉక్రెయిన్‌కు భద్రత, ఆర్థిక, మానవతా సాయం వంటి కీలక అంశాలపైనా కూడా చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది.

*రష్యాపై ఆంక్షల పర్వం..
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. మరో 50 మంది రష్యా కుబేరులపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. రష్యా అధికార భవనం క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ కూడా ఉన్నారు. వీరందరినీ అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా దూరం చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. వారి కంపెనీలు, కుటుంబాలకు కూడా ఆంక్షలు వర్తిస్తాయన్నారు. 22 రక్షణ సంబంధిత రష్యా సంస్థలపై కూడా వేటు పడింది.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రష్యాకు ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ చిప్స్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్టు.. సామ్‌సంగ్‌ ప్రకటించింది. తమ సంస్థ ఉద్యోగుల స్వచ్ఛంద విరాళాలతో ఉక్రెయిన్‌కు 6 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు సామ్‌సంగ్‌ పేర్కొంది. సంస్థ తరపున మిలియన్‌ డాలర్ల సాయం అందిస్తున్నట్టు సామ్‌సంగ్ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న రష్యాకు చెందిన వార్తా సంస్థ ఆర్​టీపై.. పశ్చిమ దేశాలు, సామాజిక మాధ్యమ సంస్థలు నిషేధం విధించాయి.