రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తమ దేశ సైన్యానికి అండగా నిలుస్తున్నారు ఉక్రెయిన్ పౌరులు. ఇప్పుడు విదేశాల్లోని వారు సైతం స్వదేశానికి చేరుకుంటున్నారు. రష్యాపై పోరాడేందుకు సుమారు 66,224 మంది విదేశాల్లోని ఉక్రెయిన్ పౌరులు మాతృ దేశానికి తిరిగివచ్చినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సి రెజ్నికోవ్ తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
*కదం తొక్కిన ఉక్రెయిన్ సైబర్ దండు
తమపై భీకర దాడులకు దిగుతున్న రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ అన్ని మార్గాలను వాడుకుంటోంది. విద్యార్థులు, న్యాయవాదులు, నటులు సైతం ఆయుధాలను చేతబట్టి సైనికులకు సహకరిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకువస్తున్న ఐటీ నిపుణులు సైతం ‘డిజిటల్ ఆర్మీ’గా ఏర్పడి తమ వంతు కృషి చేస్తున్నారు.ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్ స్వచ్ఛంద సైబర్ ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ రంగంలో అనేక మంది ఉక్రెనియన్లు ఉన్నారని.. వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైబర్ వేదికపై దేశం తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. దీంతో లక్షలాది మంది ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు.