1. కైవ్‌లో పౌరుల కారుపై Russian దళాల కాల్పులు…ఇద్దరి మృతి
ఉక్రెయిన్ దేశంపై సైనికచర్యకు దిగిన రష్యా సైనికులు పౌరుల కార్లపైనా కూడా కాల్పులు జరిపారు. శనివారం ఉదయం ఉక్రెయిన్ దేశ రాజధాని నగరమైన కైవ్‌కు సమీపంలోని బుచా జిల్లాలో రష్యన్ సైనికులు ఓ ప్రైవేటు కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరణించిన వారిలో 17 ఏళ్ల బాలిక కూడా ఉంది. రష్యా సేనల దాడుల్లో మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.ఇర్పిన్ పట్టణంలోని మిలటరీ ఆసుపత్రిపై రష్యా సైనికులు బాంబులతో దాడి చేశారు.
2.ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. ఈరోజు 145 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు ప్రత్యేక విమానాల్లో ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఏపీ(83), తెలంగాణ(62) మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ వచ్చిన విద్యార్థులకు ఏపీ, తెలంగాణభవన్‌లో అధికారులు వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏపీ, తెలంగాణభవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
3.ఉక్రెయిన్ నుంచి 263 మంది విద్యార్థులు సురక్షితంగా రాక
యుద్ధంతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్ నుంచి ఇంత వరకు 263 మంది విద్యార్థులు సురక్షితంగా రాష్ట్రానికి తిరిగొచ్చారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. బెంగళూరులో శుక్రవారం ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు బాలబ్రూయి గెస్ట్‌హౌస్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి అర్చనలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 27 నుంచి గురువారం అర్ధరాత్రి వరకు 190 మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానాల్లో రాగా, శుక్రవారం మరో 73మంది వచ్చారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా ప్రాధికార కమిషనర్, ఉక్రెయిన్‌లో కన్నడ విద్యార్థుల సంరక్షణ నోడల్ అధికారిగా ఉన్న డాక్టర్ మనోజ్ రాజన్ బాగా పనిచేస్తున్నారని సీఎం కొనియాడారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న చిట్టచివరి కన్నడిగుడిని కూడా సురక్షితంగా తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు
4. ఉక్రెయిన్‌లో ధ్వంసమైన అతిపెద్ద విమానం…సోషల్ మీడియాలో చిత్రాలు
రష్యా సైనికదళాలు జరిపిన దాడుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం అయిన ఆంటోనోవ్ యాన్-225 పూర్తిగా ధ్వంసమైంది.ఈ ధ్వంసమైన విమానం చిత్రాలు శనివారం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఉక్రెయిన్ దేశానికి చెందిన ఈ ఆంటోనోవ్ విమానం ధ్వంసమవడంతో దీని శకలాలు హోస్టోమెల్ విమానాశ్రయంలో కనిపించాయి.ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ధ్వంసమైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాయి.పెద్ద విమానం పూర్తిగా ధ్వంసమైంది.ధ్వంసమైన విమాన భాగాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. విమానం యొక్క అవశేషాల చిత్రాలు ఉక్రెయిన్‌లోని హోస్టోమెల్ విమానాశ్రయంలో చివరిగా కనిపించాయి. ఫ్లైట్ డేటా ప్రకారం ఈ విమానం ఫిబ్రవరి 5వతేదీన హోస్టోమెల్ విమానాశ్రయంలో దిగింది.విమానం ప్రతి రెక్కపై మూడు జెట్ ఇంజన్లు ఉన్నాయి. సాధారణ విమానం కంటే దీనికి ఎక్కువ చక్రాలు ఉన్నాయి. ఈ విమానం ధ్వంసం చేయడం వల్ల భూమి నుంచి నల్లటి పొగ లేచి తెరలు ఏర్పడ్డాయి.
5. Samsung సంచలన నిర్ణయం…రష్యాలో ఫోన్లు, చిప్‌ల అమ్మకాల నిలిపివేత
యుద్ధం అనంతరం పలు దేశాలు, అంతర్జాతీయ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్ దేశంపై సైనిక దాడి అనంతరం రష్యాలో పలు అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశాయి.ఇప్పటికే ఆపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు రష్యాలో తమ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు ప్రకటించాయి. తాజాగా శాంసంగ్ కంపెనీ ఫోన్లు, చిప్ ల రవాణాను నిలిపివేసింది.రష్యా మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఉక్రెయిన్ దేశంపై యుద్ధం నేపథ్యంలో రష్యాలో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినట్లు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో శనివారం ప్రకటించింది.దక్షిణ కొరియా టెక్ దిగ్గజమైన శాంసంగ్ తమ కంపెనీ చిప్‌ల నుంచి స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేసినట్లు తెలిపింది.శామ్సంగ్ రష్యాలోని కలుగాలో టీవీ ప్రొడక్షన్ ప్లాంట్ కూడా ఉంది.రష్యాలో శాంసంగ్ ప్రధాన స్మార్ట్‌ఫోన్ విక్రయదారుగా ఉంది. మార్కెట్ వాటా 30శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. యుద్ధం కారణంగా శాంసంగ్ తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయడం సంచలనం రేపింది.
6. ఉక్రెయిన్‌లో భారత విద్యార్థికి బుల్లెట్ గాయాలు
యుద్ధోన్మాదంతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి ఎలాగైనా బయటపడాలనే తాపత్రయం ఓ భారత పౌరుడిని గాయాలపాల్జేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎదురు కాల్పులు జరుగుతుండగా నాలుగు తూటాలు అతడి శరీరంలోకి దూసుకెళ్లాయి. ఢిల్లీకి చెందిన హర్‌జ్యోత్ సింగ్(31), గత నెల 27న మరో ఇద్దరితో కలిసి ట్యాక్సీలో కీవ్ నుంచి బయలుదేరగా ఈ ఘటన జరిగింది. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కీవ్ క్లినికల్ ఆస్పత్రిలో చేర్పించారు. పలుచోట్ల బుల్లెట్ గాయాలు తగిలినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి భారత రాయబార కార్యాలయం 20నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉన్నా.. తన విషయంలో భారత రాయబార కార్యాలయం సరిగా స్పందించలేదని హర్‌జ్యోత్ ఆరోపించాడు. చావు తథ్యం అనుకున్న స్థితి నుంచి తాను ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పాడు.వెంటనే ఉక్రెయిన్ నుంచి తరలించాలని విన్నవించాడు. హర్‌జ్యోత్ గాయపడిన విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ ధ్రువీకరించారు. కాగా రష్యా-ఉక్రెయిన్ బలగాల ఎదురు కాల్పుల యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఖార్కివ్‌లో 300 మంది దాకా, సూమెలో 700 మంది దాకా భారతీయులు ఉన్నట్లు భారత్ ప్రకటించింది. ఇక గత 24 గంటల్లో 15 విమానాల్లో 3 వేలమంది భారత్‌కు చేరారని విదేశాంగ శాఖ కార్యదర్శి ఆరిందమ్ బాగ్చి తెలిపారు. ఇప్పటివరకు 6,400 మందిని తీసుకొచ్చామని, రెండ్రోజుల్లో 7,400 మందిపైగా రానున్నారని వివరించారు. ఇదిలా ఉండగా.. యుద్ధం తీవ్రంగా ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని సుమీ, ఖర్కీవ్ నగరాల నుంచి భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు రష్యా రాజధాని మాస్కోలో రెండు ఐఎల్-76 విమానాలను సిద్ధంగా ఉంచినట్లు వాయుసేన తెలిపింది
7. ఉక్రెయిన్‌లో యుద్ధ విరామం!
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. దీంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 11.30 ని. నుంచి కాల్పులను ఆపేసింది. ఐదున్నర గంటలపాటు ఈ విరమణ ఉంటుందని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించేందుకు ఈ విరామం ఇచ్చింది రష్యా. ఈ మేరకు విదేశీయుల తరలింపునకు సహకరిస్తామని యూఎన్‌హెచ్‌ఆర్సీకి రష్యా తెలిపింది. మరోవైపు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే రష్యా ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పదవ రోజు శనివారం కూడా యుద్ధం మొదలై.. విరామంతో కాసేపు బ్రేక్ పడినట్లయ్యింది. ఈ లోపు విదేశీయులను తరలించే యోచనలో ఉంది ఉక్రెయిన్.
8. ఉక్రెయిన్ నుంచి 17 వేల మందిని తీసుకువచ్చాం
ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి కేంద్రం చేస్తున్న కృషిని సుప్రీంకోర్టు అభినందించింది. ఇంకా ఆ దేశంలో చిక్కుకుపోయి ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం ఒక ఆన్‌లైన్ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావ డానికి సంబంధించిన పిటిషన్లు ఏవీ స్వీకరించవద్దని హైకోర్టుని ఆదేశించింది.ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి 17 వేల మంది విద్యార్థుల్ని వెనక్కి తీసుకువచ్చినట్టుగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. మిగిలిన వారిని కూడా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటు న్నట్టుగా తెలిపారు. దీనిపై జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ ‘కేంద్ర ప్రభుత్వం కృషి అభినందనీయం. దీనిపై మేం ఒక్క మాట కూడా అనడం లేదు. కానీ తల్లిదండ్రులు, విద్యార్థుల భయాందోళనలపైనా మాకు ఆందోళన ఉంది’’ అని చెప్పారు.
9. 50 మంది రష్యా కుబేరులపై ఆంక్షలు
మరో 50 మంది రష్యా కుబేరులపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. వీరిలో రష్యా అధికార భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ కూడా ఉన్నారు. వీరందరినీ అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా దూరం చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. వారి కంపెనీలు, కుటుంబాలకు కూడా ఆంక్షలు వర్తిస్తాయన్నారు.ఉక్రేనియన్లు వాయు దాడుల బారినుంచి కాపాడుకునే మార్గాల కోసం అలమటిస్తుంటే రష్యా ప్రజల ధనంతో కోట్లకు పడగలెత్తుతున్న వారిని తాజా ఆంక్షల్లో లక్ష్యం చేసుకున్నట్టు బైడెన్ చెప్పారు. గురువారం మంత్రివర్గ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఆయన సన్నిహితులందరి మీదా కఠినాతికఠిన ఆంక్షల విధింపు కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించారు. ‘‘రష్యాను, పుతిన్‌ను ఆర్థికంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా కట్టడి చేయడమే యూఎస్, దాని మిత్ర దేశాల లక్ష్యం. మా ఆంక్షల ప్రభావం ఇప్పటికే చాలా కన్పిస్తోంది’’ అని చెప్పారు. పెస్కోవ్‌తో పాటు అలిషెర్ ఉస్మానోవ్, బోరిస్ అర్కడీ, ఇగోర్ రోటెన్‌బర్గ్, పుతిన్ చెఫ్‌గా పేరుపడ్డ యెవగెనీ ప్రిగోజిన్, నికొలాయ్ తొకరేవ్, సెర్గీ చెమెజోవ్, ఇగోర్ షువలోవ్ తదితరులు తాజా ఆంక్షల జాబితాలో ఉన్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. 22 రక్షణ సంబంధిత రష్యా సంస్థలపై కూడా వేటు పడింది.ఫలితంగా రష్యా తాలూకు యుద్ధవిమానాలు, సాయుధ వాహనాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, క్షిపణులు, మానవ రహిత విమానాల వంటివాటి తయారీ, అభివృద్ధి సామర్థ్యం బాగా తగ్గుతుందని బ్లింకెన్ అన్నారు. వీటికి తోడు చమురు, గ్యాస్ వెలికితీత పరికరాలపై కూడా అమెరికా వాణిజ్య శాఖ నిషేధం విధించింది. రష్యాకున్న ప్రధాన ఇంధన సరఫరాదారు స్థాయిని కూడా తగ్గించే చర్యలు చేపడుతున్నట్టు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకీ చెప్పారు. ఇంగ్లండ్ కూడా మరో ఇద్దరు రష్యా కుబేరులపై గురువారం ఆంక్షలు విధించింది.
10. రష్యా సేనల దాడిని అడ్డుకునేందుకు పిల్లల ముందడుగు
రష్యా సైనికుల దాడిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దేశంలోని ఒడెస్సా నగర పిల్లలు ముందుకు వచ్చి ఉక్రెయిన్ హీరోలుగా నిలిచారు.రష్యా దండయాత్రను ఆపడానికి తాము సైతం అంటూ పిల్లలు ముందుకు వచ్చి ఓడరేవు నగరమైన ఒడెస్సాలో బారికేడ్లు నిర్మిస్తున్నారు. రష్యా సైనికులు సిటీ సెంటరుకు రాకుండా ఉండేలా ఇసుకతో అడ్డగా బారికేడ్లు నిర్మిస్తున్నారు. రష్యా సైనికులు యాచ్ క్లబ్ బీచ్ నుంచి ఇసుకను తీసుకువచ్చి బారికేడ్లను నిర్మిస్తున్నారు. 11 ఏళ్ల వయసు గల పిల్లలు సైతం బారికేడ్ల నిర్మాణంలో మునిగారు.తాము రష్యా దండయాత్ర నుంచి ఒడెసా నగరాన్ని కాపాడుకుంటామని పిల్లలు ఆత్మవిశ్వాసంతో చెప్పారు.
11. కాల్పుల విరమణ కోసం చర్చలు జరుపుతున్న భారత్
యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తెచ్చేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని కేంద్రం ప్రకటించింది. ఒకవైపు ‘ఆపరేషన్ గంగ’ ప్రాజెక్టులో భాగంగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యపడటం లేదు. ఖార్కివ్, సుమీ వంటి ప్రాంతాల్లో నిత్యం బాంబు దాడులు, కాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతాల్లో ఉన్న భారతీయులు బయటకు రాలేని పరిస్థితి. ఈ కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వెయ్యి మందికిపైగా భారతీయులను తీసుకురాలేకపోతోంది భారత ప్రభుత్వం. దీంతో భారతీయులను సురక్షిత ప్రాంతాలకు చేర్చే వరకు కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ, ఉక్రెయిన్-రష్యా ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని భారత ఎంబసీ ప్రకటించింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు దాదాపు 120 బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, భారతీయులు ఉన్న ప్రదేశానికి చేరే మార్గంలో 50-60 వరకు క్లిష్టమైన ప్రాంతాలున్నాయి. ఈ ప్రదేశాల్లో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాల్నివ్వడం లేదు. అయితే, బస్సులను వేరే మార్గంలో తరలించేందుకు ఉన్న అంశాలను పరిశీలిస్తున్నామని ఇండియన్ ఎంబసీ చెప్పింది.
12. జెలెన్ స్కీకి హ్యాండ్ ఇచ్చిన నాటో.. ఉక్రెయిన్ అభ్యర్థన తిరస్కరణ
ఉక్రెయిన్‌పై రష్యా బలగాల ముప్పెట దాడి కొనసాగుతోంది. రష్యా వైమానిక దళం ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో ఉక్రెయిన్ పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బలగాల ధాటికి ఆసుపత్రులు, పలు భవనాలు శిథిలమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దాడులను అడ్డుకునేందుకు తమ దేశాన్ని ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించాలని నాటో దేశాలను అభ్యర్థించారు. ఉక్రెయిన్ విజ్ఞప్తిపై నాటో దేశాలు మరోసారి జెలెన్ స్కీకి షాకిచ్చాయి. ‘నో-ఫ్లై జోన్’ విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. శుక్రవారం రాత్రి బస్సెల్స్‌లో నాటో విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాటో జనరల్ సెక్రటరీ స్టోలెన్ బర్గ్ వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నో-ఫ్లై జోన్ విధించాలంటే నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌లోకి పంపాల్సి ఉంటుందన్నారు. అలాగే, రష్యా యుద్ధ విమానాలను కూల్చేయడం ద్వారా నో -ఫ్లైజోన్ విధించాల్సి ఉంటుందని తెలుపుతూ.. అలా చేస్తే.. యూరోప్‌లో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేపినట్టు అవుతుందన్నారు. ఇది పలు దేశాలతో ముడిపడిన వ్యవహారమే కాకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిట్రో కులెబా కీవ్ నుంచి మాట్లాడుతూ.. తమ దేవంలో ఉద్రిక్తతలు చేయిదాటకముందే తగు చర్యలు తీసుకోవాలని నాటో దేశాలను కోరారు. ఉక్రెయిన్‌ను మరో సిరియాగా మార్చవద్దంటూ అభ్యర్థించారు. ఈ క్రమంలోనే తమ సైన్యం పోరాటం మాత్రమ ఆపేది లేదని.. ప్రతి దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు తమ భాగస్వామ దేశాల నుంచి సహాకారం అందాలని విజ్ఞప్తి చేశారు.
ocean poems
13. ప్రవాస ఉక్రెయినియన్ల సంచలన నిర్ణయం
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పదో రోజుకు చేరుకుంది. విదేశాల్లో నివసిస్తున్న ఉక్రెయినియన్లు దేశభక్తితో తిరిగి వస్తున్నారు. తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం రష్యాపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు. అత్యంత సంక్లిష్ట సమయంలో తమ దేశ సైన్యానికి మద్దతుగా నిలిచి, పోరాడాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఓలెక్సీ రెజ్నికోవ్ ఈ వివరాలను శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న 66,224 మంది ఉక్రెయినియన్లు తిరిగి స్వదేశానికి వచ్చారన్నారు. వీరంతా రష్యాపై యుద్ధంలో పాల్గొనడానికి వచ్చినట్లు తెలిపారు. శత్రు దేశం నుంచి స్వదేశాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో వీరంతా వచ్చారన్నారు. వీరంతా యుద్ధానికి సిద్ధమైన, ప్రేరణ పొందిన మరొక 12 బ్రిగేడ్స్ అని చెప్పారు. తాము ఉక్రెయినియన్లమని, తమకు ఎదురు లేదని చెప్పారు. ఇదిలావుండగా, ఉక్రెయిన్‌లోని మరియుపోల్, వోల్నోవాఖా నగరాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (స్థానిక కాలమానం ప్రకారం) పాక్షిక కాల్పుల విరమణను పాటిస్తామని రష్యా ప్రకటించింది.
*పుట్టిన రోజు జరుపుకున్న భారతీయ విద్యార్థి
ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థి కార్తిక్ పుట్టిన రోజును రొమేనియా సరిహద్దులోని శిబిరంలో శుక్రవారం జరుపుకున్నారు.
14. ఉక్రెయిన్‌పై మరిన్ని భీకర దాడులకు రష్యా సన్నాహాలు!
ఉక్రెయిన్‌పై యుద్ధం పదో రోజుకు చేరింది. ఇకపై మరింత విజృంభించి, భీకర దాడులు చేయాలని రష్యా సన్నాహాలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై విరుచుకుపడి, లొంగిపోయేలా చేయడానికి సిద్ధమవుతోంది. కొద్ది రోజులుగా స్తంభించిన యూనిట్లను పటిష్టపరచడం కోసం మరో 1,000 మంది మెర్సినరీస్‌ను ఉక్రెయిన్‌కు పంపించాలని నిర్ణయించింది. పాశ్చాత్య నిఘా వర్గాలను ఉటంకిస్తూ అమెరికన్ మీడియా ఈ వివరాలను శనివారం వెల్లడించింది. పాశ్చాత్య నిఘా సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ‘‘ఇది అత్యంత హేయమైన, సంస్కారహీనమైన వైఖరి’’ అని చెప్పారని అమెరికన్ మీడియా తెలిపింది. భారీ ఆయుధాలంటే కేవలం బరువులో మాత్రమే భారీ కాదని, అవి కలిగించే నష్టం కూడా ఎక్కువే ఉంటుందని చెప్పారని తెలిపింది. వాటికి విచక్షణ చాలా తక్కువ అని చెప్పారని పేర్కొంది.
15. వాకింగ్ కోసం బయటకు వెళ్తున్నానని చెప్పి విమానం ఎక్కేశాడు.. నేరుగా ఉక్రెయిన్ వెళ్లి..
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో విధ్వంసం తారస్థాయికి చేరిన తరుణంలో ప్రపంచ పౌరులు ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా ఉక్రెయిన్ పౌరులపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రష్యాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే బ్రిటన్‌కు చెందిన ఓ మాజీ సైనికుడు సోషల్ మీడియా పోస్ట్‌లతో సరిపెట్టదలచుకోలేదు. ఒకడుగు ముందుకేసి నేరుగా ఉక్రెయిన్‌కు వెళ్లి రష్యా సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధంలో దిగాడు.
అతను బ్రిటీష్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన సైనికుడు. ప్రస్తుతం భార్యతో కలిసి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దాడి అతడి మనసును కలిచివేసింది. ఉక్రెయిన్ పౌరులకు, సైన్యానికి అండగా నిలవాలనుకున్నాడు. వాకింగ్‌కు వెళ్తున్నానని భార్యకు చెప్పి నేరుగా విమానాశ్రయానికి వెళ్లి పోలాండ్ విమానం ఎక్కేశాడు. ఆ దేశంలోని మెడికా గ్రామం గుండా సరిహద్దు దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాడు. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంటున్నాడు. తాజాగా అతను ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. `నేను బ్రిటీష్ మాజీ సైనికుడిని. చాలా కాలం పాటు సైన్యంలో పనిచేశా. ఈ కష్ట సమయంలో ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేయాలనుకున్నా. నా జీవితంలో నేను చేసిన అప్పులన్నీ తీర్చేశా. అన్ని విధులనూ నెరవేర్చా. అన్నింటినీ నాశనం చేయాలనుకుంటున్న కొత్త యుగం హిట్లర్‌ను ఎదుర్కొంటా. నేను ఇక్కడకు వచ్చిన విషయం తెలుసుకుని నా భార్య చాలా ఆగ్రహానికి గురై ఉంటుంది. ఒకవేళ ఇంటికి తిరిగి వెళ్లలేకపోతే బాధపడతాన`ని అతను చెప్పాడు.
16. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకుంటున్న తెలుగు విద్యార్థులు
రాష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు క్షేమంగా చేరుకుంటున్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఇండియాకు తరలిస్తోంది. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు చేరుకుంటున్నారు. శనివారం 4 ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి 145 మంది విద్యార్థులు చేరుకున్నారు. ఏపీ(83), తెలంగాణ(62) మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు తిరిగి వారి కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మిగిలిన విద్యార్థులను త్వరగా తీసుకురావాలని కోరుతున్నారు.
17. దేశానికి అండగా.. ఉక్రెయిన్ సైబర్ ఆర్మీ
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు చెందిన ఐటీ నిపుణులు సైతం డిజిటల్ ఆర్మీగా ఏర్పడి తమ వంతు పోరాడుతున్నారు. ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్ స్వచ్ఛంద సైబర్ ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో లక్షలాది మంది ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు.తమపై భీకర దాడులకు దిగుతున్న రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ అన్ని మార్గాలను వాడుకుంటోంది. విద్యార్థులు, న్యాయవాదులు, నటులు సైతం ఆయుధాలను చేతబట్టి సైనికులకు సహకరిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకువస్తున్న ఐటీ నిపుణులు సైతం ‘డిజిటల్ ఆర్మీ’గా ఏర్పడి తమ వంతు కృషి చేస్తున్నారు.ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్ స్వచ్ఛంద సైబర్ ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ రంగంలో అనేక మంది ఉక్రెనియన్లు ఉన్నారని.. వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైబర్ వేదికపై దేశం తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. దీంతో లక్షలాది మంది ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు.
18. ఉక్రెయిన్.. భయం గుప్పిట భారతీయ విద్యార్థులు.. తరలింపులో కొత్త సమస్యలు!
ఊహించని రీతిలో ఉక్రెయిన్ యుద్ధానికి విరామం ప్రకటించి.. పౌరుల తరలింపునకు సహకరిస్తోంది రష్యా సైన్యం. ఈ క్రమంలో భారత్ పౌరులను సురక్షితంగా పంపించేందుకు సహకరిస్తామని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. అయితే చావు ఎటు నుంచి ముంచుకొస్తుందో అనే భయంతో భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీనికి తోడు ఇబ్బందులు కొన్ని.. తరలింపు ప్రక్రియకు అడ్డం పడుతున్నాయి.ఉక్రెయిన్ తూర్పు భాగంలో సుమీ స్టేట్ యూనివర్సిటీలో వందలమంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. గురువారం రాత్రి ఈ ప్రాంతంలో రష్యన్ బలగాల దాడులతో భీత వాతావరణం నెలకొంది. విద్యార్థులంతా చెల్లాచెదురై రెండో ప్రపంచ యుద్ధ బంకర్‌లో దాక్కుండిపోయారు. తిండి, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. సాయం కోసం భారత ఎంబసీని ఆశ్రయిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది అక్కడ!.రష్యా సరిహద్దుకు కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుమీ ప్రాంతం. అందుకే యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచే ఈ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధ సంకేతాలు ముందుగానే తెలియడంతో కొంతమంది నీళ్లు, ఆహారం ముందుగా తెచ్చి పెట్టుకున్నారు. కానీ, క్రమక్రమంగా కొరత మొదలైంది. దీనికి తోడు రష్యా దాడుల్లో వాటర్ పైప్ లైన్లు, పవర్ సిస్టమ్ దెబ్బతిని.. నీళ్లు, కరెంట్ లేక అసలు కష్టాలు మొదలయ్యాయి.సుమీలో యుద్ధ భయానికి దాక్కున్న చాలామందికి తిండి, నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో శుక్రవారం ఉన్నట్లుండి మంచు కురియడంతో విద్యార్థుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. మంచును కరిగించి ఆ నీటితోనే బాటిళ్లను నింపేసుకుంటున్నారు.
19. 7 రోజుల్లో 6222 మంది భారతీయులను వెనక్కి తెచ్చాం: సింధియా
ఉక్రెయిన్ సంక్షోభంల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ చురుకుగా సాగుతోంది. ఇందులో భాగంగా గత 7 రోజుల్లో ఒక్క రొమేనియా నుంచే 29 విమానాలను నడిపామని, 6222 మంది విద్యార్థులను భారత్‌కు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారంనాడు ఒక ట్వీట్‌లో తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో 1050 మంది విద్యార్థులను భారత్‌కు తరలించనున్నట్టు చెప్పారు.
20. ఉక్రెయిన్‌కు ప్రపంచం అండదండలు కావాలి : జెలెన్‌స్కీ సతీమణి ఓలెనా
ఉక్రెయిన్‌కు ప్రపంచం అండదండలు, సహకారం అవసరమని ఆ దేశాధ్యక్షుని సతీమణి ఓలెనా జెలెన్‌స్కా చెప్పారు. తమ దేశానికి అవసరమైనది రక్షణ పొందడం కాదన్నారు. తమ ప్రజలకు, సైన్యానికి ప్రపంచ మద్దతు అవసరమని తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో ఆమె వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఓ టెలిగ్రామ్ చానల్‌ను ప్రారంభించారు.