బాలీవుడ్ అగ్ర నాయికలు అలియాభట్, కంగనారనౌత్ మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతున్నది. గత రెండేళ్లుగా హిందీ చిత్రసీమలోని బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంపై నిరసనగళం వినిపిస్తున్నది కంగనారనౌత్. ఈ క్రమంలో ఆమె ఇటీవలే అలియాభట్‌పై విమర్శలు చేసింది. అలియా నటించిన తాజా చిత్రం ‘గంగూభాయి కథియావాడి’ ఈ నెల 25న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఉద్దేశిస్తూ ఈ మధ్యే కంగనారనౌత్ ‘వచ్చేవారం బాలీవుడ్లో రెండొందలకోట్లు బుగ్గిపాలు కాబోతున్నాయి’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది.ఆమె మాటలు బాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా వీటిపై తనదైన శైలిలో ప్రతిస్పందించింది అలియాభట్. ‘గంగూభాయి కథియావాడి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కోల్‌కతా మీడియాతో ముచ్చటించరామె. కంగనారనౌత్ వ్యాఖ్యాలపై స్పందించమని అడగ్గా ‘శ్రీకృష్ణుడు గీతలో ఏం చెప్పాడంటే..ఏం పనిలేని వారు ఏదో ఒక పనిచేస్తున్నట్లు కనిపిస్తారు’ అనే అర్థంలో భగవద్గీత శ్లోకాలు ఉదహరించింది. దీంతో ఈ ముద్దుగుమ్మల మాటల యుద్ధం ఎటువైపుకు వెళ్తుందోనని అందరూ చర్చించుకుంటున్నారు