Movies

స్వర్ణయుగపు నాయికను

స్వర్ణయుగపు నాయికను

సినిమాకు స్వర్ణయుగం లాంటి కాలంలో నటిగా ఉండటం తన అదృష్టం అంటున్నది అందాల తార వాణీకపూర్‌. ‘బేఫికర్‌’, ‘వార్‌’, ‘బెల్‌బాటమ్‌’ లాంటి చిత్రాలతో అగ్రతారగా కొనసాగుతున్నదీ భామ. ఆమె ఇటీవల నటించిన ‘చంఢీగడ్‌ కరే ఆషికీ’, ‘బదాయి దో’ చిత్రాలు ప్రేక్షకాదరణ పొంది వాణీ కపూర్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇవి రెండు వేటికవి భిన్నమైన చిత్రాలు కాగా..ఇలాంటి ప్రయోగాత్మక కథలకు ప్రేక్షకుల ఆదరణ దక్కడం మంచి పరిణామం అని వాణీ కపూర్‌ చెబుతున్నది. ఆమె మాట్లాడుతూ..‘గతంలో కొన్ని రకాల కథలకు నటీనటులు దూరంగా ఉండేవారు. ప్రేక్షకులు చూస్తారా చూడరా అనే సందేహం వారిని ఈ తరహా చిత్రాలు చేసేందుకు భయపెట్టేది. కానీ ఇవాళ ప్రేక్షకుల ఆలోచన పరిణతి చెందింది. ఇవి వద్దు అనుకున్న కథలతోనే ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ‘ఛండీగడ్‌ కరే ఆషికీ’, ‘బదాయి దో’ లాంటివి అలాంటి చిత్రాలే. వీటిని ఆదరించడం ద్వారా మనం మానసికంగా ఎంతో పురోగమిస్తున్నాం అని అర్థమవుతున్నది. సినిమాకు స్వర్ణయుగం లాంటి ఈ సమయంలో నటిగా ఉండటం నా అదృష్టం అని చెప్పింది.