ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం వైద్యం అందించేందుకే శాస‍్త్రవేత్తల బృందం నిరతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స, త్వరితగతిన గుర్తించు విధానాలపై అధ్యయనాలు చేశారు. తాజా అధ్యయనాల్లో చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవు అని కునుగొన్నాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలాగో తెలుసా!.
వివరాల్లోకెళ్తే..
చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు వాటి వాసన సామర్థ్యాన్ని ఉపయోగించగలవని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ పరిశోధనలుల చేయడానికి సిల్కీ చీమలు అని పిలిచే ఫార్మికా ఫుస్కా అనే చీమలను వినియోగించింది. వాటికి రివార్డ్ సిస్టమ్ ద్వారా శిక్షణ ఇచ్చింది. నిజానికి అవి తమ వాసన సాయంతోనే ఆహారాన్ని సంపాదించుకునే చీమలు మానవునిలోని క్యాన్సర్ కణాల నంచి ఆరోగ్యకరమైన కణాలను వేరుచేయగలవు అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్‌ఆర్‌ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ శాస్త్రవేత్త బృందం చాలా సమర్ధవంతంగా క్యాన్సర్‌ని నయం చేసే పద్ధతులను అన్వేషించే క్రమంలోనే ఈ విషయాన్ని కనుగొన్నారు. మానవ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమను జీవన సాధనాలుగా ఉపయోగించడం అత్యంత సులభమైనది మాత్రమే కాక తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ చీమలకు తొలుత చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాత అవి క్రమంగా రెండు వేర్వేరు రకాల క్యాన్సర్ కణాలను గుర్తించుకునే స్థాయికి చేరుకుంటాయి.
ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని మానవుడిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అంచనా వేయాల్సి ఉందని చ్పెపారు. అయితే ఈ మొదటి అధ్యయనం చీమలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో నేర్చుకోవడమే కాక సమర్థవంతంగా పనిచేస్తాయని తేలిందని అన్నారు. అంతేగాదు ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టే సామర్థ్యం పై పరిశోధనలు చేస్తున్నారు. అయితే వాటికి మంచి ఘ్రాణ శక్తి కలిగి ఉందని తెలిపారు. పైగా కుక్కుల కంటే చాలా త్వరతిగతిన క్యాన్సర్ కణాల గుర్తింపు శిక్షణను చీమలు తీసుకోంటాయని అన్నారు.