Business

అమెరికాలో మన భారతీయ మహిళా కోటీశ్వరులు వీరే

Here are the Indo American millionaire women in USA

అమెరికా కోటీశ్వరుల్లో భారత మహిళలు చోటు సంపాదించారు. అమెరికా టాప్ 80 మహిళా ధనవంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్మేడ్ వుమెన్ 2019 పేరిట ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్, ఐటీ కన్సల్టెన్సీ, అవుట్సోర్సింగ్ కంపెనీ సింటెల్ కోఫౌండర్ నీరజా సేథి, స్ట్రీమింగ్ డేటా కంపెనీ కాన్ఫ్లుయెంట్ సీటీవో, కోఫౌండర్ నేహా నర్ఖడేలు ప్లేస్ కొట్టేశారు. అమెరికాలోని అతిపెద్ద పైకప్పులు, గోడలు, కిటికీల హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏబీసీ సప్లై చైర్ పర్సన్ డయానా హెండ్రిక్స్ (72) టాప్ ప్లేస్లో నిలిచారు. ఆమె మొత్తం ఆస్తి విలువ సుమారు ₹48,652 కోట్లు (700 కోట్ల డాలర్లు). 58 ఏళ్ల జయశ్రీ ఉల్లాల్ సుమారు ₹9713 కోట్లతో (140 కోట్ల డాలర్లు) 18వ స్థానంలో నిలిచారు.ఆమెకు అరిస్టా స్టాకుల్లో 5 శాతం వాటా ఉంది. లండన్లో పుట్టిన ఆమె ఇండియాలో పెరిగిందని, ఇప్పుడు అమెరికాలో మహిళా కోటీశ్వరుల్లో ఒకరిగా నిలిచారని ఫోర్బ్స్ పేర్కొంది. ₹6937 కోట్ల (వంద కోట్ల డాలర్లు) సంపదతో 64 ఏళ్ల నీరజా సేథి 23వ స్థానాన్ని దక్కించుకున్నారు. 1980లో తన భర్త భరత్ దేశాయ్తో కలిసి ₹లక్షా 38 వేలతో (2 వేల డాలర్లు– ఆ టైంలో అది చాలా పెద్ద మొత్తమే) సింటెల్ సంస్థను స్థాపించారు. మిషిగన్లోని ట్రాయ్ అనే ఓ అపార్ట్మెంట్లో చిన్నగా మొదలైన ఆ సంస్థ ప్రస్థానం కొద్ది రోజుల్లోనే పతాక స్థాయికి చేరింది. 2018లో సింటెల్ను ఫ్రాన్స్కు చెందిన ఐటీ సంస్థ అటోస్ ఎస్ఈ సుమారు ₹23,590 కోట్లకు (340 కోట్ల డాలర్లు) కొనుగోలు చేసింది. ఆమె వాటా కింద ₹3539 కోట్లు (51 కోట్ల డాలర్లు) వచ్చాయి. నేహా నర్ఖడే (34) చిన్న వయసులోనే కోటీశ్వరురాలయ్యారు. ఆమె సంపద సుమారు ₹2500 కోట్లు (36 కోట్ల డాలర్లు). కోటీశ్వరుల జాబితాలో 60వ స్థానాన్ని సంపాదించారు. ఆమె కంపెనీ కాన్ఫ్లుయెంట్ విలువ సుమారు ₹17,373 కోట్లు (250 కోట్ల డాలర్లు). ఆమె కంపెనీకి గోల్డ్మన్ సాక్స్, నెట్ఫ్లిక్స్, ఊబెర్ వంటి పెద్దపెద్ద సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయి. లింకెడిన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఆమె పెద్దమొత్తంలో వచ్చిపడుతున్న డేటాను నిర్వహించేందుకు అపాచీ కఫ్కా అనే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. 2014లో మరో ఇద్దరు సహ ఉద్యోగులతో కలిసి నేహా నర్ఖడే కాన్ఫ్లుయెంట్ను స్థాపించారు.