దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’లో తన పాత్ర నిడివి తక్కువగా ఉండడంతో హీరోయిన్ అలియా భట్ ఆగ్రహం వ్యక్తం చేశారనీ, ఆ కోపంతోనే ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు, పోస్టులు తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తొలగించారనీ వార్తలు వచ్చాయి. అంతే కాదు దర్శకుడు రాజమౌళిని ఆమె అన్‌ఫాలో అయ్యారనీ వారం రోజులుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీని వల్ల డామేజి జరుగుతుండడంతో అలియా స్వయంగా రంగంలోకి దిగి, దీని గురించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ వార్తలన్నీ కట్టుకథలని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తోసిపుచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ వంటి అద్భుత చిత్రంలో నేను కూడా ఒక భాగం అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో సీత పాత్ర పోషించడం మరిచిపోలేని అనుభవం. తారక్, చరణ్‌లతో కలసి పనిచేయడాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. రాజమౌళిగారు, ఆయన టీమ్ సంవత్సరాల తరబడి వర్క్ చేసిన కష్టానికి ప్రతిఫలం ఆర్‌ఆర్‌ఆర్. ఆ సినిమా విషయంలో నేను అసంతృప్తితో ఉన్నాననే వార్తలను ఖండిస్తున్నా’ అన్నారు అలియా. తక్కువ పోస్టులు ఉండాలన్న అభిప్రాయంతోనే పాత వీడియోలను తను ఎప్పటికప్పుడు తొలిగిస్తాననీ, అలాగే ఆర్‌ఆర్‌ఆర్ వీడియోలు, పోస్ట్‌లు డిలిట్ చేశానే తప్ప వేరే ప్రత్యేక కారణం ఏమీ లేదని ఆమె వివరించారు.