Editorials

ఎంత కష్టం వచ్చిందిరో ఇమ్రాన్ ఖాన్ అన్నా!

Pakistans Financial Troubles On Peak Stage Under Imrans Rule

ఓ వైపు ఆర్థిక సమస్యలు.. అప్పుల కుప్పలు.. మరోవైపు గ్రే లిస్ట్‌ పర్యవసానాలు.. ఫలితంగా ఉగ్రవాదులకు స్వర్గధామంగా పేరొందిన పాకిస్థాన్‌కు విదేశాల నుంచి పెట్టుబడులు, ఆర్థిక సాయం లభించడం కష్టతరంగా మారింది. ఇదిలా ఉండగా.. త్వరలో జరగబోయే ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) సమావేశంలో గ్రే లిస్ట్‌లోనే ఉంచుతారా లేదా బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చుతారా అన్న భయాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మెప్పు పొంది బ్లాక్ లిస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు పాకిస్థాన్‌ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఉగ్ర ముఠాలపై పలు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా అధినేత హఫీస్‌ సయీద్‌, జైషే మహ్మద్‌ అధ్యక్షుడు మసూద్‌ అజాద్‌ కార్యకలాపాలపై గత నెల్లో పాక్‌ ఆంక్షలు విధించింది. బుధవారం ఈద్‌ ఉల్‌ ఫితర్‌ సందర్భంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో సయీద్‌ ప్రసంగం ఉండగా.. దాన్ని అధికారులు అడ్డుకున్నారు. అంతేగాక.. సయీద్‌ బంధువు అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీని మే 15న అధికారులు అరెస్టు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాము ‘కట్టుబడి’ ఉన్నామని అంతర్జాతీయ సమాజానికి చెప్పేందుకే పాక్ ఈ చర్యలు తీసుకుంటోంది. అయితే ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందే పాక్‌ ఇలాంటి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చిలోనూ ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి కొద్ది రోజుల ముందు జమాత్‌ ఉద్‌ దవా శిబిరాల్లో తనిఖీలు చేపట్టింది. అంతకుముందూ కూడా అరెస్టులు, ఆంక్షలు అంటూ కొన్ని సార్లు హడావుడి సృష్టించింది. సమావేశం తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే మళ్లీ ఉగ్రవాదులకు అనుకూలంగా ఉండటం పాక్‌ సహజ వైఖరి అన్న విషయం తెలిసిందే. ఉగ్రసంస్థల ఆర్థిక మూలాలను కట్టడి చేయడంలో పాక్‌ విఫలమవడంతో ఉగ్రసంస్థల ఆర్థిక మార్గాలపై నిఘా ఉంచే ‘ఆర్థిక చర్యల కార్యదళం’(ఎఫ్‌ఏటీఎఫ్‌) ఆ దేశాన్ని గ్రే లిస్టులో ఉంచుతూ గతేడాది జూన్‌లో నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పాకిస్థాన్‌కు విదేశాల నుంచి పెట్టుబడులు, ఆర్థిక సాయం రావడం కష్టంగా మారుతోంది. అయితే 15 నెలల్లోగా ఉగ్రవాదంపై పాక్‌ చర్యలు తీసుకోవాలని లేదంటే తదుపరి పరిణామాలు మరింత కఠినంగా ఉంటాయని ఎఫ్‌ఏటీఎఫ్‌ హెచ్చరించింది. ఆ గడువు ఈ ఏడాది అక్టోబరుతో ముగియనుంది. ఇదిలా ఉండగా.. ఫ్లోరిడా వేదికగా ఈ నెల 20-21న ఎఫ్ఏటీఎఫ్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌ అంశం చర్చకు వచ్చే అవకాశముంది. పాక్‌ను గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలా లేదా బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలా అన్న దానిపై చర్చించనున్నారు. అయితే ప్రస్తుతం గడువు ఉండటంతో అక్టోబరులో జరిగే సమావేశంలోనే పాక్‌ బ్లాక్‌లిస్ట్‌ అంశంపై నిర్ణయం తీసుకుంటారు. అసలే ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న పాక్‌ను ఒక వేళ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చితే ఆ దేశానికి అప్పులు పుట్టడం గగనమనే చెప్పాలి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఏటీఎఫ్‌తో పాటు అటు అమెరికా కూడా పాక్‌ను ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్‌కు అండగా ఉంటామని చెప్పిన అమెరికా.. పాక్‌పై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు పాకిస్థాన్‌ ఉగ్ర వైఖరికి వ్యతిరేకంగా భారత్‌ చేసే పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతిస్తున్నాయి. భారత ప్రతిపాదనకు ఇతర దేశాలకు మద్దతివ్వడంతో మే 1న ఐక్యరాజ్యసమితి మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.