టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గురువారం నాడు కీలక పరిణామం చోటు చేసుకొంది. న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసినా కూడా సిజిటల్ రికార్డులు ఇవ్వడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టులో దాఖలు చేసిన కంటేప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ పై గురువారం నాడు విచారణ జరిగింది.కోర్టు ధిక్కరణకు పాల్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై చర్యలు తీసకోవాలని ఈడీ తెలంగాణా హైకోర్టు ను కోరింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్, సర్పరాజ్ అహ్మద్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో ఈ విషయమై వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం.
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి డిజిటల్ రికార్డులు అప్పగించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన తెలంగాణ హైకోర్టు ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.టాలీవుడ్ డ్రగ్స్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసులో ఈడీ కూడా ఇంప్లీడ్ అయింది. ఈ కేసు విచారణ సమయంలో రిజిటల్ రికార్డుల అంశం తెరమీదికి వచ్చింది. ఈ కేసును విచారించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సినీ తారలకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ డిజిటల్ రికార్డులను తెలంగాణకు చెందిన ఎక్సైజ్ శాఖ డిజిటల్ రికార్డులు అందించలేదు. దీంతో తన వద్ద ఉన్న సమాచారాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ ఏడాది మార్చి 11న ఈడీ అధికారులకు సమర్పించారు. ఎక్సైజ్ శాఖ ఇంకా రికార్డులు ఇవ్వకున్నా ఈడీ అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదని కూడా ఈడీ అధికారులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈడీ తెలంగాణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిన్ దాఖలు చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి డిజిటల్ రికార్డులు ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఈడీ అధికారులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.