అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2021లో 12 శాతం పెరిగినట్టు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శాఖ(యూఎస్‌సీఐఎస్) తాజాగా బుధవారం ప్రకటించింది. అంతేకాకుండా.. చైనా విద్యార్థుల సంఖ్య 8 శాతం మేర పడిపోయినట్టు తెలిపింది. కరోనా కారణంగా.. ఇంటర్నేషనల్ విద్యార్థుల రాకడపై ఇప్పటికీ ప్రభావం పడుతోందని యూఎస్‌సీఐఎస్ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం..2021లో ఎఫ్-1, ఎమ్-1 వీసాపై చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 1,236,748. 2020 నాటి లెక్కలతో పోలిస్తే.. ఇది దాదాపు 1.2 శాతం తక్కువ. ‘‘అమెరికా చదువు కోసం వచ్చే విదేశీ విద్యార్థులో చైనా, ఇండియా విద్యార్థులే అధిక సంఖ్యలో ఉంటారు. అయితే.. 2021లో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గగా..భారత విద్యార్థుల సంఖ్య పెరిగింది’’ అని యూఎస్‌సీఐఎస్ తన నివేదికలో పేర్కొంది.