కరోనా టైమ్‌లో ఇతర మెట్రోనగరాల కంటే హైదరాబాద్‌లో ఫ్లాట్ల అమ్మకాలు వేగంగా పుంజుకున్నాయి. కానీ ఓ వైపు ఆర్ధిక సంక్షోభం..మరోవైపు భారీగా పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలతో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలు దారులు ఇళ్లను కొనుగోలుకు సుముఖంగా లేరు. దానికి తోడు హైదరాబాద్‌లో చదరపు అడుగు సరాసరీ రూ.6 వేల నుంచి రూ.6,200కు చేరడంతో రియల్ ఎస్టేట్‌లో క్రాష్ తప్పదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిన్నమొన్నటి వరకు రియల్ఎస్టేట్ రారాజుగా వెలిగిన హైదరాబాద్‌లో ఇప్పుడు డౌన్ ఫాల్ మొదలైంది. కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆన్లైన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాప్ టైగర్.కామ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది క్యూ1లో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 7శాతం పెరిగినట్లు తెలిపింది. యావరేజ్‌గా రాజధానిలో చదరపు అడుగు సుమారు రూ.6వేలుగా ఉండగా.. ఈ ధరతో ఇండియాలో 8 ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది.
**సేల్స్ పడిపోతున్నాయి
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు భారీగా పడిపోతున్నట్లు ప్రాప్‌టైగర్ తన నివేదికలో హైలెట్ చేసింది. ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 2022, 92శాతం సప్లయ్ పెరగ్గా..అమ్మకాలు 15శాతం పడిపోయినట్లు తెలిపింది. ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణంగా ఆ నివేదిక తెలిపింది.
**క్యూ1లో ఇలా
2022 ఏడాదికి మొదటి త్రైమాసికంలో హైదరాబాద్‌లో మొత్తం 14,572 ఇళ్లను నిర్మిస్తే అందులో అమ్ముడు పోయింది కేవలం 6,556 యూనిట్లేనని తెలిపింది. దీంతో చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన గృహాల (ఇన్వెంటరీ) సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య రోజురోజుకీ మరింత పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. ఇక గడిచిన 42 నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 73,651యూనిట్లుగా ఉండగా.. 25 నెలల కాలంలో ఈ ట్రెండ్ మరింతగా పెరిగినట్టు ప్రాప్ టైగర్ పేర్కొంది.
**చదరపు అడుగు ఎంత
దేశంలోని వివిధ నగరాల్లో చదరపు అడుగుకు విలువలను పరిశీలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐటీ , స్టార్టప్, రియల్టీ బూమ్ ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతున్న బెంగళూరులో కంటే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు రోజురోజుకీ పెరిపోతుండడంపై మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో చదరపు అడుగు ధరలు ఇలా ఉన్నాయి.
ముంబైలో చదరపు అడుగు రూ.9,800 నుంచి రూ.10,000గా ఉంది
హైదరాబాద్‌లో చదరపు అడుగు రూ.6వేల నుంచి రూ.6,200వరకు ఉంది
చెన్నైలో చదరపు అడుగు రూ.5,700 నుంచి రూ.5,900గా ఉంది
బెంగళూరులో చదరపు అడుగు రూ.5,600 నుంచి రూ.5,800గా ఉంది
పూణేలో చదరపు అడుగు రూ.5,400 నుంచి రూ.5,600గా ఉంది
ఢిల్లీ ఎన్ సీఆర్‌లో చదరపు అడుగు రూ.4,500 నుంచి రూ.4,700గా ఉంది
కోల్ కతాలో చదరపు అడుగు రూ.4,300 నుంచి రూ.4,500గా ఉంది
అహ్మదాబాద్‌లో చదరపు అడుగు రూ.3,500 నుంచి రూ.3,700గా ఉంది