NRI-NRT

ఎన్​ఆర్​ఐలకు గుడ్​న్యూస్.. త్వరలో ‘పోస్టల్​ బ్యాలెట్’​ సౌకర్యం!

ఎన్​ఆర్​ఐలకు గుడ్​న్యూస్.. త్వరలో ‘పోస్టల్​ బ్యాలెట్’​ సౌకర్యం!

విదేశాల్లోని భారతీయులకు పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. దక్షిణాఫ్రికా, మారిషస్​ పర్యటనల్లో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమైన సీఈసీ సుశీల్​ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.

విదేశాల్లోని ప్రవాస భారతీయులు ఎన్నికల్లో ఓటు వేసే వీలు కల్పించేలా కేంద్ర ఎన్నికల సంఘం తగిన చర్యలు చేపడుతోంది. ఇటీవలే దక్షిణాఫ్రికా, మారిషస్​లో పర్యటించిన భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్​ చంద్ర అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుతం విదేశీ ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అక్కడి ప్రవాస భారతీయులు విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్​ఆర్​ఐ ఓటర్లకు పోస్టల్​ బ్యాలెట్​(ఈటీపీబీఎస్​) సౌకర్యాన్ని కల్పించే అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం.

“భారత్​ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మిలియన్​ పోలింగ్​ స్టేషన్లతో 950 మిలియన్ల ఓటర్లతో ఎన్నికలు నిర్వహిస్తోంది. కొద్ది సంవత్సరాలుగా ఎన్నికలను అందరికీ చేరువ చేసే విషయంలో స్థిరమైన పురోగతి కనిపిస్తోంది. దాని ద్వారా మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు దొహదపడుతోంది. సీవిజిల్​, స్వీప్​, ఈవీఎం-వీవీప్యాట్​ వంటి సాంకేతికతను తీసుకురావటం ద్వారా స్వేచ్ఛాయుత, పారదర్శక, భాగస్వామ్య ఎన్నికలను నిర్వహించగలుగుతున్నాం.”- సుశీల్​ చంద్ర, సీఈసీ.

దేశంలో ప్రస్తుతం సర్వీసు ఓటర్లకు మాత్రమే పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యాన్ని కల్పిస్తోంది ఎన్నికల సంఘం. అందులో.. సాయుధ దళాలు, తమ నియోజకవర్గం వెలుపల పోస్టింగ్​ ఇచ్చిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, వివిధ దేశాల్లోని భారత ఎంబసీలు, దౌత్య మిషన్​లలో పనిచేస్తున్న సిబ్బంది వంటి వారు ఉన్నారు.అర్హులైన విదేశీ భారతీయ ఓటర్లకు పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యాన్ని కల్పించాలని 2020లో కేంద్రానికి ప్రతిపాదించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు 2020, నవంబర్​ 27న న్యాయశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. సర్వీస్​ ఓటర్లకు విజయవంతంగా ఈటీపీబీఎస్​ను అమలు చేస్తున్న నేపథ్యంలో.. ప్రవాసులకు సైతం అందించవచ్చనే నమ్మకాన్ని వెలుబుచ్చింది. ఈ విషయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ఈసీ, కేంద్ర న్యాయశాఖ, విదేశాంగ శాఖ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం విదేశాల్లోని భారతీయులు తమ నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,12,000 మంది ప్రవాస భారతీయులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.