దివంగత లతా దీననాథ్ మంగేష్కర్ తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు ముంబైలో స్వీకరించారు. దేశానికి, సమాజానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ప్రధానికి ఈ అవార్డును ప్రదానం చేశారు. 92 ఏళ్ల లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. లతా మంగేష్కర్ ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో అస్వస్థతతో కన్నుమూశారు.
*దేశానికి జమ్మూ-కశ్మీరు సరికొత్త మార్గదర్శి : మోదీ
దివంగత లతా మంగేష్కర్ తొలి స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్, ఆశాభోస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకుంటూ దివంగత లతా మంగేష్కర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ”లతా దీదీ నాకు పెద్దక్క వంటింది. ఆమె సరస్వతీ దేవికి ప్రతిరూపం. సంగీతం దేశభక్తిని ప్రబోధిస్తుంది. లతా మంగేష్కర్ స్వరంలో దేశభక్తి పరవళ్లు తొక్కేది” అని ప్రధాని అన్నారు. కాగా, దేశానికి, ప్రజలకు అసమాన సేవలందించిన వ్యక్తులకు ఈ అవార్డును ఏటా ప్రదానం చేయనున్నట్టు మాస్టర్ దీననాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్టు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.