Sports

టాటా చెప్పేసిన యువరాజ్

Yuvraj Singh Bids Farewell To International Cricket

17 ఏళ్ల పాటు భారత క్రికెట్‌ అభిమానులను ఉర్రుతలూగించిన యువరాజ్‌…అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక క్రికెట్‌కు సెలవంటూ వీడ్కోలు పలికాడు. గత కొద్దికాలంగా ఫామ్‌లో లేని యువరాజ్‌ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు.2000 సంవత్సరంలో కెన్యా వన్డేతో అరంగేట్రం చేసిన యువరాజ్‌.. తన 17 ఏళ్ల క్రికెట్‌ కెరీయర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు యువీ. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించాడు. రెండు ప్రపంచకప్‌ విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. 2007 టీ-20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా ఏంటో నిరూపించాడు యువీ. ఇది అప్పట్లో ఓ సంచలనంగా మారింది.ప్రపంచ క్రికెట్‌లో రాణిస్తున్న క్రమంలో కేన్సర్‌ బారిన పడ్డాడు యువీ. దీంతో కొంత కాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. చికిత్స అనంతరం కేన్సర్‌ను జయించిన యువరాజ్‌…మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు కానీ కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయి సతమతమయ్యాడు. రీ ఎంట్రీ తరువాత పెద్దగా రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.కెరీర్‌లో 40 టెస్ట్‌లు, 304 వన్డేలు, 58 టీ-20లు ఆడిన యువరాజ్‌..‌. టెస్టుల్లో 3, వన్డేల్లో 14 సెంచరీలు చేశాడు. ఇక వన్డేల్లో 8 వేల 701 పరుగులు, టెస్టుల్లో 1900 పరుగులు, టీ-20ల్లో 1177 పరుగులు చేశాడు. అన్నిఫార్మాట్లాలో కలిసి మొత్తం 148 వికెట్లు తీశాడు యువరాజ్‌ సింగ్‌.