అస్సాంలో కొత్తగా నిర్మించిన క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను ఇవాళ టాటా గ్రూపు అధినేత, వ్యాపారవేత్త రతన్ టాటా ప్రారంభించారు. ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. అస్సాంలో మరో ఏడు కొత్త క్యాన్సర్ చికిత్స కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తన జీవితంలో చివరి రోజుల్ని ఆరోగ్యానికి అంకితం చేస్తున్నట్లు రతన్ టాటా ఈ సందర్భంగా తెలిపారు. అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టులు సంయుక్తంగా రాష్ట్రంలో కొత్తగా 17 క్యాన్సర్ ఆస్పత్రుల్ని నిర్మిస్తున్నాయి. అస్సాం రాష్ట్రాన్ని అందరూ ఆదరించాలని, ఆ రాష్ట్రానికి సరైన గుర్తింపు ఇవ్వాలని రతన్ తన సందేశంలో కోరారు.తొలి దశలో భాగంగా అస్సాంలో ఏడు ఆస్పత్రుల్ని నిర్మించారు. దిబ్రూఘర్, కోక్రాజార్, బార్పేట, దార్రంగ్, తేజ్పూర్, లక్మీపూర్, జోర్హాట్ పట్టణాల్లో ఆ ఆస్పత్రుల్ని రతన్ టాటా ప్రారంభించారు. రెండవ దశలో భాగంగా దూబ్రి, నల్బారి, గోల్పారా, నగావ్, శివసాగర్, టిన్సుకియా, గోలాఘాట్లో క్యాన్సర్ హాస్పిటళ్లను నిర్మించనున్నారు. హాస్పిటళ్లు మీ సేవ కోసమే ఉన్నాయని, కానీ ఆ హాస్పటళ్లు ఖాళీగా ఉంటే సంతోషిస్తానని, మీరు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాని, తమ ప్రభుత్వం యోగా, ఫిట్నెస్, స్వచ్ఛత లాంటి అంశాలపై కేంద్రీకరించిందని, కొత్త టెస్టింగ్ సెంటర్లను కూడా దేశవ్యాప్తంగా ఓపెన్ చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు.