తితిదే భక్తులకు సౌకర్యవంతమైన శీఘ్ర దర్శనానికి ప్రణాళికలు

Featured Image

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సౌకర్యవంతమైన, శీఘ్ర దర్శనానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు తెలిపారు. గురువారం నాడు అర్వింగ్‌లో ఆయనకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అమెరికాకు చెందిన తెలుగు సంస్థలు రెండు ప్రస్తుతం AI ద్వారా భక్తులకు శీఘ్రంగా దర్శనాన్ని ఎలా కల్పించవచ్చుననే అంశంపై పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆగమశాస్త్ర నియమాలకు లోబడి సాంకేతికత సహకారంతో రోజుకి లక్ష మందికి దర్శన వెసులుబాటు కల్పించేందుకు బీ.ఆర్.నాయుడు ఆధ్వర్యంలోని బోర్డు శాయశక్తులా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను తితిదే బోర్డుతో పాటు స్విమ్స్ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నానని తెలిపారు. ఉచిత గదుల నిర్మాణం, భోజన నాణ్యత పెంపు వంటి అంశాలపై సమీక్షిస్తున్నామని, అన్యమతస్థులను 60మంది గుర్తించామని వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపైన ఉంచిన నమ్మకాన్ని శ్రీవారి దయతో భక్తుల సేవకు వినియోగిస్తానని పేర్కొన్నారు. డల్లాస్ అంటే తనకు వల్లమాలిన అభిమానం అని, గుంటూరు మాదిరి సందడి, తెలుగువారికే సొంతమైన అభిమానం ఇక్కడ పుష్కళంగా ఉంటుందన్నారు. తితిదే బోర్డులో తన సహచరుడు, డల్లాస్‌కు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు జాస్తి శివతో కలిసి భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతులు పంచేలా తితిదేను అభివృద్ధి చేస్తామని అన్నారు.

డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ… సదాశివరావు తనకు దశాబ్దం పైగా తెలుసునని, మానసికంగా, శారీరకంగా ఆయనలో ఎలాంటి మార్పును తాను గమనించలేదని అన్నారు. సామాజిక స్పృహ, సమాజంలోని సమస్యల పట్ల స్పందించే గుణం, గ్రామీణ నేపథ్యం నుండి ఎదగడం వంటి లక్షణాలు కలిగిన ఆయన తితిదే వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సభ్యుడిగా జేరడం ముదావహమన్నారు.

డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ…గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ₹50కోట్ల ఖర్చుతో నాట్కో ఫార్మా తరఫున క్యాన్సర్ సెంటరు ఏర్పాటు చేయడంలో సదాశివరావు కృషి విశేషమైనదని కొనియాడారు. ఆయన మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. డా. పొదిలి ప్రసాద్ సదాశివరావుకు శుభాకాంక్షలు తెలిపారు.

దీనికి పూర్వం సదాశివరావు తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఎంపరాల కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో ప్రవాసులు సదాశివరావును కలుసుకుని అభినందనలు తెలిపారు.

Tags-TTD Nannapaneni, Dallas NRTs

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles