
తీరు మార్చుకోని తానా నేతలు-TNI ప్రత్యేకం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)…పేరుకి అమెరికాలో ప్రముఖ, అతిపెద్ద తెలుగు సంఘం. తెలుగు సంఘాలకు పెద్దన్న. కానీ దాన్ని నడిపించే నేతాగణం మాత్రం బడిపిల్లల కన్నా దారుణంగా అలకలు, సిగపట్ల మధ్య సంకుచిత మనస్తత్వంలో నలిగిపోతున్నారు.
ఏ పార్టీ అయినా, దేశమైనా, సంస్థ అయినా తనను తాను నిట్టనిలువునా చీల్చుకుని, దెబ్బలు తిని నేలమట్టం కావడానికి ప్రధాన కారణం…కలిసి నడవని మనుషులు. తానా ప్రతిష్ఠ మసకబారడానికి కూడా ఈ గ్రూపు రాజకీయాలే ప్రధాన కారణం. అయినప్పటికీ ఒకనాటి తానా కార్యవర్గ సభ్యులు లోపల ఎంత ఉన్నా, పైకి మాత్రం సఖ్యతతో ఉండేవారు. కుర్చీలోని వ్యక్తిని గాక, కుర్చీని గౌరవించేవారు. అందులో ఎవరు ఉన్నా, వారికి మర్యాద చేసేవారు. చేయాలి కూడా!
నేడు తానా 2025 సభల గోడపత్రికను, నినాదాన్ని సభల కార్యవర్గ సభ్యులు విడుదల చేశారు. TNI కూడా దీన్ని ప్రచురించింది. https://www.tnilive.com/2025/03/07/tana-2025-slogan-released-detroit-july-3-4-5/ . గోడపత్రికలో సాక్షాత్తు తానా ప్రస్తుత అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు పేరు లేకుండా సభల కార్యవర్గం వివరాల వరకు మాత్రమే పొందుపరిచారు. దీనిపై అటు నిరంజన్ వర్గం నుండే గాక, ప్రత్యర్థి వర్గాల నుండి కూడా తప్పు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూపుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ప్రతిష్ఠాత్మకమైన తానా సభలకు సంబంధించిన ఏ విషయంలోనైనా అధ్యక్షుడు, సమన్వయకర్తల పేర్లు తప్పనిసరిగా ప్రచురించడం గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడు దానికి తూట్లు పొడుస్తూ నిరంజన్ పేరు తొలగించడం పట్ల ప్రవాసులు పెదవి విరుస్తున్నారు.
పేర్లు, గోడపత్రికలు, పత్రికా ప్రకటనల్లో ప్రాధాన్యతలపై దృష్టి సారించి అసలు కార్యానికి తానా నేతలు మంగళం పాడారని విసుర్లు వినిపిస్తున్నాయి. అలా తమలో తాము మునిగిపోయారు కాబట్టే పోలవరపు శ్రీకాంత్ లాంటి వారు ఖజానాకు 3మిలియన్ డాలర్లు కన్నం వేసినా సరైన సమయంలో కనిపెట్టలేకపోయారని వాదనలు వినిపిస్తున్నాయి. అధికారం ఎవరికి వచ్చినా అందరూ కలిసి ముందుకు నడిచి ఉంటే సంస్థ చాలా బలోపేతంగా ఉండేదనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఇది కొరవడింది కాబట్టే FBI, DOJ వంటి వారు తానాపై నిఘా పెట్టడానికి తావిచ్చిందనే వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు.
ఇకనైనా తానా నేతలు తమ తీరు మార్చుకుంటేనే, తానా వెతలు తీరేది. ఎవరికి వారే యమునా తీరు అయితే, మిగిలేది కన్నీరే —సుందరసుందరి(sundarasundari@aol.com)
Tags-TANA Leaders Fighting
bodyimages:
