
''డయాస్పోరా కథల పరిణామం''పై టాంటెక్స్ సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 212 వ సాహిత్య సదస్సు ''డయాస్పోరా కథల పరిణామం'' అంశంపై మార్చ్ 23 న డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించబడింది. తొలుత భక్త పురందర దాసు కీర్తన '' వేంకటా చల నిలయం..'' ప్రార్థన గేయాన్ని చిరంజీవి సమన్విత మాడా రాగయుక్తంగా ఆలపించడంతో సదస్సు ప్రారంభమైంది. ఆపై ప్రముఖ కవి కీ శే వడ్డేపల్లి కృష్ణ గారిచే వ్రాయబడి రికార్డు చేయబడిన ''నెలనెలా తెలుగువెన్నెల'' గీతాన్ని వినిపించారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంస్మరణార్థం సాహితీ ప్రియులంతా ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు.
ముఖ్య అతిథి ప్రసంగానికి ముందు దయాకర్ మాడా అతిథిని పరిచయం చేశారు. ప్రముఖ రచయిత భాస్కర్ పులికల్ ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా సాగింది. ‘నిర్మలాదిత్య’ అన్న కలం పేరుతో గత ముప్పై ఏళ్ళు పైగా తెలుగులో కథలు వ్రాస్తున్న వీరు, ‘డయాస్పోరా కథల పరిణామం’ గురించి దాదాపు గంటసేపు మాట్లాడారు. తమ రచనలకు వారి మేనమామ మధురాంతకం రాజారాం ఎలా ప్రేరణగా నిలిచారో, 1998లో అమెరికా వలస రావడంతో కథలు డయాస్పోరా కథలుగా ఎలా మారాయో వివరించారు. డయాస్పోరా కథల నిర్వచనం, వాటి సంఖ్యాపరంగా, విషయ పరంగా విశ్లేషణల వల్ల తెలిసిన విషయాలు వీక్షకులతో పంచుకున్నారు. అంతే కాక, డయాస్పోరా కథలను లబ్ధప్రతిష్టుల కథలతో తులన చేసి వాటి మార్గాన్ని వాన్నెగాట్ కథా చిత్ర గ్రాఫ్‌ల ద్వారా వివరించారు. భవిష్యత్‌లో తెలుగు భాష అభివృద్ధి ఎలా ఉండాలనే అంశంపై ఆసక్తికరమైన సూచనలు చేశారు. ప్రసంగం అనంతరం, ప్రశ్నలు - సమాధానాల సెషన్ జరిగింది.
ప్రసంగాన్ని మెచ్చుకుంటూ డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ పుదూరు జగదీశ్వరన్, లెనిన్ వేముల, దయాకర్ మాడా, కాశీనాధుని రాధ, హరి చరణ ప్రసాద్, విజయ మామునూరి, పృథ్వీ తేజ, నవీన్ గొడవర్తి, నిడిగంటి గోవర్ధనరావు తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆపై, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి తరపున, సమన్వయ కర్త దయాకర్ మాడా, ముఖ్య అతిథి భాస్కర్ పులికల్ గారికి సన్మాన పత్ర జ్ఞాపికను అందజేశారు. ఈ సన్మానం తనకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని భాస్కర్ పులికల్ పేర్కొన్నారు. టాంటెక్స్ సంస్థ తెలుగు భాషా సాహిత్యానికి చేస్తున్న సేవను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
సాహితీ ప్రియులందరినీ భాగస్వాములను చేస్తూ గత 82 మాసాలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్న ''మన తెలుగు సిరిసంపదలు'' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. పద్యాలు, ప్రహేళికలు, నానార్థములు సహా దాదాపు యాభై ప్రక్రియలలో తెలుగు భాషా సంపదను స్పృశించేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతోంది. డాక్టర్ నరసింహారెడ్డి చమత్కార గర్భితమైన ప్రదర్శనను పలువురు ప్రశంసించారు. కాశీనాధుని రాధ, పోతన భాగవతం దశమ స్కంధంలోని పద్యాలను ఆలపించి, భక్తి రచనాశైలిని విశదీకరించారు. లెనిన్ వేముల 1931 మార్చి 23 న జరిగిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ త్యాగాలను గుర్తుచేశారు. అనంతరం, డాక్టర్ పుదూరు జగదీశ్వరన్ పద్యాల గానం, భర్తృహరి సుభాషితాలు, చారిత్రక అంశాలను చర్చించారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై సదస్సు విజయవంతమయ్యేలా చేశారు. టాంటెక్స్ కార్యవర్గ బృందానికి, ప్రాయోజకులకూ, దయాకర్ మాడా కృతజ్ఞతలు తెలిపారు.
Tags-TANTEX Nela Nela Telugu Vennela 2025 March, TANTEX NNTV
Gallery




Latest Articles
- Tpad 15Th Blood Drive Saves Lives
- Nats 8Th Sambaralu Florida Telugu Tampa Ec
- Thaman Devisri Music Show At Nats 2025 Tampa Telugu Conference
- Ts Cm Revanth Invited To Tana 2025 Detroit
- Kolli Abhishek Of Gudivada Commits Suicide In Arizona
- Ap Speaker Ayyanna Invited To Tana
- Media Medical Celebrities Invited To Nats
- Ap Cm Chandrababu Invited To Detroit Tana
- Ap Cm Chandrababu Invited To Tampa Nats
- Ts Cm Revanth Invited To Nats 8Th Ats