తానా కష్టాల్లో ఉంది. ఎన్నికలు కుదరవు. ఈసారికి సెలక్షనే శరణ్యం-TNI ప్రత్యేకం

Featured Image

2022-24 మధ్య తానా ఫౌండేషన్ కోశాధికారిగా పనిచేసిన పోలవరపు శ్రీకాంత్ $3.65 మిలియన్ డాలర్ల నిలువు దోపిడీ దరిమిలా రాజుకున్న నిప్పు ఇప్పుడు సంస్థ భవితపై తీవ్రప్రభావాన్ని చూపెట్టే దిశగా వెళ్తోంది. బోర్డు ఛైర్మన్ డా. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ 20వ తేదీన పంపిన ఈమెయిల్‌లో 2025-27 కాలానికి తానాకు ఎన్నికలు జరగవని, నైతికత, నిజాయితీ, విలువలు కలిగిన సభ్యులను ఇంటర్వ్యూలో ఎంపిక చేసి బోర్డు ఆమోదంతో వారిని కార్యవర్గ స్థానాల్లో నియమిస్తామని చేసిన ప్రకటన దుమారం లేపింది. ఇది ప్రజాస్వామ్య హననమని సభ్యుల వైపు నుండి కొందరు, కాదు గతకాలంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా, పకడ్బందీగా సంస్థను గాడినపెట్టే ప్రణాళికగా ప్రస్తుత బోర్డు ఒకవైపు.. ప్రవాసులకు వివరణను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. FBI నోటీసులు, అటార్నీ సమీక్షలు తానాను కుంగదీస్తున్నాయని అందుకే ఎన్నికల పేరిట సభ్యులను మభ్యపెట్టకుండా ఈ ఒక్కసారికి ఇంటర్వ్యూ పద్ధతిలో కార్యవర్గ స్థానాలను భర్తీ చేయడానికి తానా రాజ్యాంగంలో మార్పులు చేసి ఆమోదముద్ర వేశామని డా. కొడాలి పేర్కొన్నారు.

* ఈ చర్య సరైనదేనా?

ప్రస్తుత బోర్డు తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయం సరైనేదేనా అనే అంశంపై ఇటు అమెరికాలో అటు తెలుగు రాష్ట్రాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. తానా పాత కార్యవర్గం సభ్యుల్లో సెలక్షన్ పద్ధతిలో వచ్చినవారు, ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చినవారు ఇరు రకాల వారు ఉన్నారు. కానీ ఏనాడు సంస్థ మూలాలపై దెబ్బకొట్టిన వారి దాఖలా లేదు. అధికారం కలిగినవారిపై సరైన నిఘా కొరవడిన కారణంగా ఉత్పన్నమైన సమస్యలను సమిష్టిగా ఎదుర్కొనే అవకాశాలను పరిశీలించాలి తప్ప ఎన్నికలను బహిష్కరించి తాము ఆమోదించిన వారికి అందలం కట్టపెట్టడం తానా బహుళ ప్రయోజనాలను కాలరాయడమేనని సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని కాపాడుకోవడానికి ఎమెర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ, ప్రస్తుత నాయకత్వంతో పొసగలేక దేశం కోసం సైనికచర్యకు దిగానన్న పర్వేజ్ ముషార్రాఫ్ లాంటి వారి చర్యలను ప్రస్తుత తానా రాజ్యాంగ సవరణ ప్రతిబింబిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని, ఇంత అత్యవసరంగా తానా రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి.

కొత్త సభ్యులను జేర్పించడానికి, సభలను నిర్వహించడానికి మ్యాచింగ్ గ్రాంట్స్ నిధులను వినియోగించడం వంటి స్వయంకృతాపరాధాలే తానాను అమెరికా దర్యాప్తు సంస్థల రాడార్ కిందకి నెట్టాయనేది మెజార్టీ సభ్యుల వాదన. దీనికి తోడు శ్రీకాంత్ దోపిడీ దర్యాప్తు సంస్థలు తానాపైకి టాప్-గేర్‌లో దూసుకురావడానికి ఆజ్యం పోశాయనేది విస్మరించకూడని వాస్తవం. అంటే ఏ పద్ధతిలో వచ్చినా అధికారాలు చెలాయించే వారిపట్ల నిఘా కొరవడితే ఇలాంటి సమస్యలు తయారవుతాయి. 48 ఏళ్ల తానా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నికలను నిలిపివేయడం ఆమోదయోగం కానప్పటికీ విస్తృత అధికారాలు కలిగినవారిపై గట్టి నిఘా పెట్టినప్పుడే సంస్థను గుల్లబార్చకుండా ఉంచేందుకు వీలుంటుంది.

* FBI పిలుపు

తానాకు ఇప్పటికే అమెరికా జాతీయ ఆదాయపు పన్ను శాఖ IRS నుండి తాఖీదులు వచ్చాయి. 2019-24 మధ్య జరిగిన లావాదేవీలను సమర్పించాలని దాని సారాంశం. దీనితో పాటు సంస్థలో జరుగున్న అంతర్గత నిర్ణయాలు, సాగుతున్న సమస్యలు, కొరవడిన సమన్వయం పట్ల FBI దృష్టిసారించిందని, ఈ మేరకు మరిన్ని వివరాల సేకరణ కోసం పలువురు సభ్యులకు ఆ సంస్థ నుండి పిలుపులు వచ్చాయని సమాచారం.

* తానా సభలపై నీలినీడలు

2025 జులై 3,4,5 తేదీల్లో డెట్రాయిట్‌లో నిర్వహిస్తున్న తానా 24వ మహాసభలపై కూడా ప్రస్తుత సమస్యల కారణంగా నీలినీడలు కమ్ముకున్నాయి. సభలు జరగకుండా ఆపాలని కోర్టుల ద్వారా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎంత మంది చెప్పినా పెడిచెవిన పెడుతూ సంస్థ అధ్యక్షుడి పేరును సభల ప్రచారంలో ఇప్పటికీ వినియోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇది సమస్యను మరింత జటిలం చేస్తోందని ప్రవాసుల వాదన.

* సాఫీగా సాగిపోతున్న శ్రీకాంత్ జీవితం

తానా చరిత్ర భ్రష్టుపట్టడానికి ప్రధాన కారణమైన పోలవరపు శ్రీకాంత్ కాలిఫోర్నియాలో సాఫీగా ఉద్యోగం చేసుకుంటున్నాడని సమాచారం. $3.65 మిలియన్ డాలర్లలో ఇప్పటివరకు $650,000 తిరిగి కట్టిన అతను మిగతా సొమ్ము ఎప్పుడు తిరిగి చెల్లిస్తాడనే దానిపై స్పష్టత కొరవడింది. తానా ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్ ఈ నిధులను ఎట్టిపరిస్థితుల్లో తిరిగి రాబడతామని పేర్కొంటున్నా, జరిగే చర్యలను చూస్తుంటే మాత్రం నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి.

* సవరించిన రాజ్యాంగం ఎక్కడ?

వేల సంఖ్యలో ఉన్న తానా సభ్యులకు 15వ తేదీన సవరించిన రాజ్యాంగాన్ని తానా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని సభ్యులు కోరుతున్నారు.

---సుందరసుందరి(sundarasundari@aol.com)

Tags-No elections in TANA Will TANA 2025 conference happen Current state of affairs in TANA 2025 Apr

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles