Sports

ద్రవిడ్ నిర్ణయంతో ఇండియా జట్టు చీలేదేమో!

ద్రవిడ్ నిర్ణయంతో ఇండియా జట్టు చీలేదేమో!

టీమ్‌ఇండియాకు సచిన్‌, ద్రవిడ్‌ వెన్నెముక లాంటివాళ్లు. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు ఎన్నోసార్లు ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి చక్కని భాగస్వామ్యాలు నిర్మించారు. అలాంటిది 2004 ముల్తాన్ టెస్ట్‌లో తన ద్విశతకానికి ద్రవిడ్ మరో ఓవర్‌ ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యానని సచిన్‌ చెప్పాడు. అయితే మాస్టర్‌ అవమానకరంగా భావించాడని కోచ్‌ జాన్‌రైట్‌ కొన్నాళ్ల క్రితం తన ఆత్మకథలో ప్రస్తావించాడు. జట్టు రెండు వర్గాలుగా విడిపోతుందో ఏమోనని భయపడ్డామన్నాడు. పరిస్థితి వేడిగా ఉండటంతో సచిన్‌తో మాట్లాడి సర్దిచెప్పాలని ద్రవిడ్‌కు సూచించాడు. ద్రవిడ్‌ మాట్లాడినప్పుడు మైదానంలో ఎప్పటిలాగే ఉంటానని బయట మాత్రం కొంత ఒంటరిగా వదిలేయాలని సచిన్‌ చెప్పాడని తెలిసింది. ఆ తర్వాత మీడియాలో ఈ సంఘటనపై దుమార రేగడం గమనార్హం. తన ఆత్మకథ ‘ప్లేయింగ్‌ ఇట్‌ మై వే’లోనూ దీనిపై మాస్టర్‌ ప్రస్తావించాడు. ఆ సమయంలో బాధ కలిగినా తర్వాత టీమ్‌ఇండియా వాల్‌తో కలిసి ఎన్నో భాగస్వామ్యాలు పంచుకున్నానని, స్నేహం ఎప్పటిలాగే కొనసాగుతోందని రాశాడు. తాము గెలుపుపై పట్టుదలతో ఉన్నామని చెప్పేందుకే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశానని, సహచరుల మధ్య అభిప్రాయభేదాలు సహజమేనని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ పరిస్థితి చల్లబడింది. టీమ్‌ఇండియా ఆ సిరీసు గెలిచి చరిత్ర సృష్టించింది.