ScienceAndTech

దారి మళ్లిన వందే భారత్ ఎక్స్ప్రెస్.

దారి మళ్లిన వందే భారత్ ఎక్స్ప్రెస్.

వందేభారత్ తెలుగు రాష్ట్రాలకు ఇప్పట్లో లేదా. ఈ నెలలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభించేందుకు కసరత్తు జరిగింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అధికారికంగా సమాచారం అందింది. కానీ, ఈ నెల ముగుస్తోంది. వందేభారత్ ఊసే లేదు. సికింద్రాబాద్ – విజయవాడ మధ్య తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించి ట్రాక్ పరిశీలన .. సమయం నిర్ణయం పైన చర్చలు జరిగాయి. అవకాశం ఉంటే ప్రధానితో వర్చ్చువల్ గా ప్రారంభించాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, ఇప్పుడు ఈ రైలు ప్రారంభం పైన కొత్త సందేహాలు మొదలయ్యాయి.

సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య వందేభారత్‌

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు వందేభారత్ రైలు మంజూరు అయింది. గత నెలలోనే దీనికి సంబంధించి రైల్వే ఉన్నతాధికారుల నుంచి దక్షిణ మధ్య రైల్వేకు సమాచారం అందింది. కొత్త సంవత్సరం కానుకగా ఈ నెలాఖరులో ప్రారంభించేలా ప్రయత్నాలు జరిగాయి. నాలుగు గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి విజయవాడ చేరుకొనేలా షెడ్యూల్ పైన కసరత్తు చేసారు.

ఇప్పటికే పలు రైళ్లు ఈ మార్గంలో ఉన్నా.. ప్రయాణీకుల రద్దీతో వందేభారత్ ద్వారా ప్రయోజనం ఉంటుందని అధికారులు నివేదించారు. దీనికి ఆమోదం లభించటం.. ట్రాక్ పరిశీలన జరగటంతో త్వరలోనే వందేభారత్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభం అవుతుందని అంచనా వేసారు. కానీ, ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన వందేభారత్ దారి మళ్లింది. పశ్చిమ బెంగాల్ కు ఆ రైలు మళ్లించినట్లు తెలుస్తోంది.