పశ్చిమ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరాన్ని తాకింది. బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరంలో పెను విధ్వంసం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి వరకు తుపాను ల్యాండ్ ఫాల్ కొనసాగనుంది. బిపర్‌జోయ్ ప్రభావంతో.. కచ్, ద్వారక, సౌరాష్ట్ర ప్రాంతాల్లో భారీ నష్టం చోటు చేసుకుంది. ద్వారకలో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. గాలి తీవ్రతతో చెట్లు, కరెంట్ స్తంభాలు కుప్పకూలాయి. కచ్ ప్రాంతంలో కరెంట్ పూర్తిగా నిలిపివేశారు. గుజరాత్ తీర ప్రాంతాలపై బిపర్‌జోయ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. తీర ప్రాంతంలో గంటకు 150 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 94 వేల మందిని ఖాళీ చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.