తెలుగు సంఘాల స్వయంకృతాపరాధం..ప్రవాసాంధ్రులకు దినదినగండం-TNI ప్రత్యేకం

Featured Image

సమాజాం నుండి, అందులోని పౌరుల నుండి సంపాదించుకున్న లాభాల పట్ల కృతజ్ఞతాభావంతో కార్పోరేట్ సంస్థలు సామాజిక బాధ్యత (CSR) గుర్తెరిగి ఉంటాయి. ఇందులో భాగంగా "మ్యాచింగ్ గ్రాంట్స్" పేరిట తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఏదైనా సేవా కార్యక్రమాలకు తమ సొంత నిధులతో విరాళాలు అందజేస్తే వాటికి ఆయా సంస్థలు అదే మొత్తాన్ని గానీ లేక రెండింతలు, మూడింతలు గానీ చెల్లిస్తుంది.

ఉదాహరణకు ఒక ఉద్యోగి తన సొంత నిధులు $1000 డాలర్లను ABCD అనే సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకుంటే, ఆ మొత్తాన్ని తన సంస్థకు చెల్లిస్తాడు. సంస్థ విధివిధానాల ప్రకారం 1:2 నిష్పత్తిలో విరాళాలు అందజేయాలని ఉంటే ఆ ఉద్యోగి ఇచ్చిన $1000 డాలర్లకు $2000 డాలర్లను కలిపి మొత్తం $3000 డాలర్లను ఈ కార్పోరేట్ సంస్థ ABCDకు సేవా కార్యక్రమాల నిమిత్తం జమచేస్తుంది. 1:1 నిష్పత్తిలో అయితే మొత్తం $2000, 1:3 నిష్పత్తిలో అయితే మొత్తం $4000 డాలర్లను చెల్లిస్తుంది. ఇది కంపెనీల అంతర్గత విధివిధానాలకు సంబంధించి అంశం.

అమెరికాలో కొన్ని ప్రముఖ తెలుగు సంఘాలు కృత్రిమంగా విరాళాలు సృష్టించి, కంపెనీలను మోసం చేసి, కోట్ల రూపాయల గ్రాంట్లు లబ్ధి పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ "మ్యాచింగ్ గ్రాంట్స్" పథకాన్ని దుర్వినియోగం చేసి ఇప్పటికే అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘాలుగా పేరుపడిన సంస్థలు అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థలు, ఆదాయపు పన్ను శాఖ గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. యాపిల్, ఎక్స్పీరియన్ కంపెనీల నుండి తెలుగువారి ఉద్వాసనకు ఇదో ప్రధాన కారణమని సమాచారం. తాజాగా గురువారం నాడు అమెరికా ఫెడరల్ లోన్ల సంస్థ ఫ్యానిమే నుండి వందకు పైగా తెలుగువారిని విధుల నుండి తొలగించారు. దీనికి ప్రధాన కారణం "మ్యాచింగ్ గ్రాంట్స్" దుర్వినియోగమని సంస్థలో పనిచేస్తున్న వారు ధృవీకరిస్తున్నారు. ఫ్యానిమే అమెరికాలోనే అతిపెద్ద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అయిదో అతిపెద్ద సంస్థ. అలాంటి సంస్థను కూడా తమ స్వార్థానికి వాడుకున్న తెలుగు సంఘాల నాయకులు ఇప్పుడు రోడ్డున పడిన ఉద్యోగులకు ఏమి సమాధానం చెప్తారో!

ఒకనాడు అమెరికాలో తెలుగు సంఘాలు అచ్చంగా దాతలపైనే నడిచేవి. వైద్యులు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు తమ దేశం పట్ల, తమ వారి పట్ల ఉన్న అభిమానంతో ఆయా సంస్థలకు విరివిగా విరాళాలు ఇచ్చి ప్రోత్సహించారు. తదనంతర కాలంలో ఆర్భాటాలకు ఆరాటం పెరిగిన నేతన్నలు "మ్యాచింగ్ గ్రాంట్స్" పథకంపై కన్నేశారు. ఉద్యోగులు తమ సొంత నిధులతో నిజమైన విరాళలు గాకుండా...ఆయా తెలుగు సంఘాలకు చెందిన నిధులను లేక తెలుగు సంఘాల నాయకుల వ్యక్తిగత నిధులను కార్పోరేట్ ఉద్యోగులకు అందజేసి వారిచేత "మ్యాచింగ్ గ్రాంట్స్" తీసుకున్నారు. ఈ తీసుకున్న సొమ్ముతో సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ తెలుగు సంఘాల్లో కొత్త సభ్యులను జేర్పించినప్పుడు కట్టాల్సిన దరఖాస్తు ఫీజుల కింద, నేతన్నల మహిళలు బంగారం కొనుగోలుకు, సభలు జరిగినప్పుడు అతిథుల హోటళ్లు, విమాన ఛార్జీలు చెల్లించడానికి వినియోగించారు. ఇది అనైతికం. విశ్వాసఘాతుకం.

ఒక కార్పోరేట్ సంస్థ నుండి ఒక తెలుగు సంఘానికి ఏడాదికి 5-20 మంది ఉద్యోగులు విరాళం ఇస్తే అది చాలా గొప్ప విషయం. కానీ ఒకేసారి వందల మంది కోట్ల రూపాయిలను విరాళంగా ఇస్తే ఏమి జరుగుతుందో ఫ్యానిమే సంస్థ తీసుకున్న నిర్ణయాలే చెప్తున్నాయి. ఒకేసారి 100మంది ఒకే సంస్థకు అంతమొత్తంలో విరాళాలు ఇవ్వడం, దాన్ని సంస్థ పసిగట్టి దర్యాప్తుకు ఆదేశించడం, అనైతిక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారికి ఉద్వాసన పలకడం చకచకా జరిగిపోయాయి. చేజ్ బ్యాంకు, బొఫా, వెల్స్ ఫార్గో వంటి బ్యాంకింగ్ సంస్థల్లో నుండి కూడా తెలుగువారు తొలగింపబడ్డారు. 2019లో అమెరికాలో ఒక అతిపెద్ద తెలుగు సంఘానికి ఒక కార్పోరేట్ సంస్థ నుండి కోట్ల రూపాయిలు "మ్యాచింగ్ గ్రాంట్స్" మూలంగా అందాయంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. అసలు విరాళం ఉద్యోగి దగ్గర నుండి కాకుండా, సంఘాల నుండే ఇచ్చారు. ఉద్యోగి పేరు మీద విరాళం జమ అయ్యేలా చేశారు. సంస్థలు “ఇది నిజమైన విరాళమే” అనే నమ్మకంతో మ్యాచింగ్ గ్రాంట్లు మంజూరు చేశాయి. చివరకు, ఆ డబ్బు నిజమైన సేవా కార్యక్రమాలకు కాకుండా వక్రీకరించబడింది.

మంచి చేయబోతే చెడు ఎదురైనట్టు...ప్రవాసాంధ్రులు తమకు తెలిసిన తెలుగు సంఘాలను, దాని ప్రతినిధులను నమ్మి వారంతా సమాజాన్ని ఉద్ధరిస్తారని భావించి సాయపడ్డారు. ఇప్పుడు తమ ఉద్యోగాలే ఊడిపోయి రోడ్డున పడ్డారు. "మ్యాచింగ్ గ్రాంట్స్" మంచింగ్ చేసేసిన వారంతా సంతోషంగా ఉన్నారు. ఆర్భాటాలకు పోయి, అక్రమ మార్గాల్లో తమ స్వార్థ ప్రయోజనాలకు తెరలేపిన నేతాగణం అందరిదీ ఈ పాపం. వారిని మోసిన సంఘాలది ఈ స్వయంకృతాపరాధం. మీకు దినదినగండం. సొమ్ములు బొక్కేసిన వారికి పండుగ సంబరం. మీరు ఖచ్చితంగా మోసపోయారు. మోసం చేసినవాడి కన్నా మోసపోయిన వాడిదే అతిపెద్ద నేరం. ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే మీకు, మీ కుటుంబానికి, సమాజానికి కూడా శ్రేయస్కరం.

More Info

---సుందరసుందరి(sundarasundari@aol.com)

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles