🕑 Published: June 06, 2026 at 05:15 AM CST
రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అత్యాధునిక సాంకేతిక సేవలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) కీలకపాత్ర పోషిస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ అన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ, అప్లికేషన్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ అండ్ ఆడిటింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు, ఆధార్ వాలిడేషన్, ఈ-ప్రొక్యూర్మెంట్ తదితర సేవలను సంస్థ సమర్ధంగా అందిస్తోందని చెప్పారు. APTS ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ‘సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్’లో ఎంపికైన విద్యార్థులకు మన్నవ మోహనకృష్ణ ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన సైబర్ సెక్యూరిటీ నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో APTS రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్‌ను నిర్వహించిందని మోహనకృష్ణ తెలిపారు. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థికి ప్రతి నెలా రూ.10,000 స్టైఫండ్ అందుతుందన్నారు. దీంతో పాటు సైబర్ సెక్యూరిటీ భద్రతా విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. భవిష్యత్తులో బ్యాంకింగ్, ప్రైవేట్, ఇతర కీలక రంగాలకు కూడా సేవలను విస్తరించే లక్ష్యంతో APTS ముందుకు సాగుతోందన్నారు. దీని ద్వారా రాష్ట్రానికి అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, సైబర్ భద్రత మరింత బలోపేతం అవుతుందని.. యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో APTS ఎండీ మల్లవరపు సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.
