🕑 Published: August 13, 2026 at 09:03 AM CST
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రముఖ పద్యనాటక, రంగస్థల కళాకారుడు "కళారత్న" గుమ్మడి గోపాలకృష్ణ ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం నాడు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సమావేశంలో 2024 సంవత్సరానికి గాను "నాటకరంగం–నటన" విభాగంలో ఈ పురస్కారాన్ని గోపాలకృష్ణకు అందజేశారు.
తెలుగు నాటకరంగానికి ప్రత్యేకించి పౌరాణిక పద్యనాటకాలకు గుమ్మడి గోపాకృష్ణ నాలుగు దశాబ్దాలకు పైగా అందించిన సేవలకు ఈ గౌరవాన్ని ప్రకటించారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, శ్రీనాథుడి పాత్రలలో గోపాలకృష్ణ నటన అపూర్వం. మన పురాణాలు, చరిత్ర, సాహిత్యంలోని పాత్రలకు జీవం పోసి ఈ తరం ప్రేక్షకులకు అందిస్తున్నారు. గోపాలకృష్ణ విలక్షణమైన కంఠం, భావయుక్తమైన నటన, తెలుగు సాహిత్యంపై పట్టు, మన సంస్కృతి-సంప్రదాయాలపై నిశితమైన అవగాహన నాటక ప్రియుల హృదయాలలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టాయి. తెలుగు నాటకరంగ వైభవాన్ని భారతదేశంతో పాటు విదేశాల్లోని ప్రవాసులకు కూడా పరిచయం చేయడంలో గుమ్మడి విశెష సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్‌గా యువ కళాకారులను ప్రోత్సహించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు.
గుమ్మడికి అమెరికాలోని ప్రవాసులు అభినందనలు తెలిపారు.
