🕑 Published: August 02, 2026 at 02:11 AM CST
* వైభవంగా సంస్థ రజతోత్సవం
* 10వేల మంది ప్రవాసులు హాజరు
* 13 గిన్నీస్ రికార్డులు అందుకున్న ఏకైక తెలుగు సంస్థ
* అలరించిన సంగీత, సాహిత్య, సాంస్కృతిక ప్రదర్శనలు
తెలుగు సాహితీ సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తి పేరిట గత 25ఏళ్లుగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు పరిమళాలు వెదజల్లుతున్న సిలికానాంధ్ర సంస్థ సిగలోకి మరో మూడు గిన్నీస్ రికార్డులు చేరాయి. శనివారం సాయంత్రం కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్‌లో నిర్వహించిన సిలికానాంధ్ర రజతోత్సవంలో ఏర్పాటు చేసిన మూడు కార్యక్రమాల్లో గత రికార్డులను అధిగమించి సరికొత్త గిన్నీస్ రికార్డులను ఆ సంస్థ నెలకొల్పింది. పద్మభూషణ్ సుధా రఘునాథన్ సమన్వయంలో "సంగీతామృతవర్షిణి" కార్యక్రమంలో 1014మంది శాస్త్రీయ గాయనీ గాయకులు పాల్గొని మన వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించడం ద్వారా, తిరుచ్చి శంకరన్-డా. పత్రి సతీష్ సమన్వయంలో "లయామృతవర్షిణి"లో 286మంది మృదంగ విద్వాంసుల లయవిన్యాసం ద్వారా, వేమన-సుమతి శతకాల నుండి ఎంపిక చేసిన 18పద్యాలను 1712మంది ఆలపించి "శతకశంఖారావం" పూరించడం ద్వారా అమెరికాలో తొలిసారిగా తెలుగు సాంస్కృతిక ప్రదర్శనలతో మూడు గిన్నీస్ రికార్డులను నెలకొల్పి సిలికానాంధ్ర సంచలన చరిత్ర లిఖించింది. ఈ మేరకు గిన్నీస్ అధికార ప్రతినిధి మైకేల్ ఎంప్రిక్ అధికారిక ధృవపత్రాలను సంస్థకు అందజేశారు. 2008లో 332మందితో కాలిఫోర్నియాలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నాట్యసమ్మేళనం ద్వారా తొలి గిన్నీస్ అందుకున్న సిలికానాంధ్ర సంస్థ ఇప్పటివరకు నేటి మూడింటితో కలిపి 13 గిన్నీస్ రికార్డులు అందుకున్న ఏకైక తెలుగు సంస్థగా వినుతికెక్కింది.
మన మూలాలను మరిచిపోకుండా, వాటిని కాపాడుతూ, విస్తరిస్తూ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఆలవాలమైన సిలికానాంధ్రకు శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ డా. శ్రీకర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఒక ప్రభుత్వం చేయవల్సిన స్థాయి కార్యక్రమాన్ని కేవలం విరాళాల ఆధారంగా నిర్వహిస్తూ ఇంటింటా పద్య ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌ను రచయిత జొన్నవిత్తుల అభినందించారు. ప్రజాధనం, ప్రభుత్వ సహకారం, పదవి ఇస్తే ఆనంద్ లాంటివారు తెలుగు జెండాను ప్రపంచపటాన రెపరెపలాడిస్తారని ఆయన కొనియాడారు. తెలుగుతల్లి ఈ వేడుకలు చూసి ఆనందభాష్పాలు రాల్చుతోందని ప్రశంసించారు. ఇల్లినాయిస్ కాంగ్రెస్‌మెన్ రాజా కృష్ణమూర్తి మరో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ అందరూ ఓటు వేయాలని, మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ప్రజాసేవలోకి వచ్చేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. సిలికానాంధ్ర సంస్థ భారతీయ కళలకు చిరునామా అన్నారు. ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ వైద్యుడు డా. లకిరెడ్డి హనిమిరెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులను జీవన సాఫల్య పురస్కారాలతో ఈ వేదికపై సత్కరించారు.
శోభాయాత్రతో ప్రారంభమైన ఈ వేడుకల్లో రంగపూజ, కుంభహారతి, "కూచిపూడి నాట్యామృతవర్షిణి"లో "బ్రహ్మాంజలి", సిలికానాంధ్ర 25 సంవత్సరాల ఉజ్జ్వల ప్రస్థానంలోని ప్రధాన ఘట్టాలతో కూడిన "సిలికానాంధ్ర వైజయంతి" నృత్యరూపకాలు కనువిందు చేశాయి. ప్రవాస గాయనీగాయకుల "లలితగీతామృతవర్షిణి", "జానపద జాతర" ద్వారా కోలాటం, లంబాడ నృత్యం, బోనాల, బతుకమ్మ, సంక్రాంతి వంటి జానపద కళారూపాల ప్రదర్శన, "వందేభారతం" సంగీత నృత్యరూపకం, "దక్షయజ్ఞం" పౌరాణిక నాటక ప్రదర్శన ఈ వేడుకల్లో అద్భుతంగా రక్తికట్టించాయి. సతీదేవిని నిజమైన గుర్రపు బగ్గీలో నాటకంలోకి తీసుకురావడం ఆకట్టుకుంది. మిద్దె పరశురాములు-రాములుల ఒగ్గుకథ, లింగా వాసు డప్పు వాద్యం అలరించాయి.
14వ శతాబ్దపు రచనలను 21వ శతాబ్దంలో పాడుకోవడం, ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సాంస్కృతిక చారిత్రక అంశాల ప్రదర్శనల ద్వారా సిలికానాంధ్ర రజతోత్సవం జరుపుకోవడం విభిన్నత కోసం కాదని ఆనంద్ అన్నారు. మన వారసత్వ సంపద గొప్పదనాన్ని తెలియజేయాలని, పరివ్యాప్తి చేయాలనే చిరుప్రయాత్నానికి ఈ రజతోత్సవం ఒక పునాది అని ఆయన పేర్కొన్నారు. సిలికానాంధ్ర అధ్యక్షురాలు తనుగుల ప్రియ తనకు సహకరించిన సంస్థ సభ్యులకు, ప్రవాసులకు ధన్యవాదాలు తెలిపారు. 2001లో ప్రారంభించిన సిలికానాంధ్ర సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్టు మనబడి, సంపద, ఆరియా విశ్వవిద్యాలయం, జయహో కూచిపూడి, అన్నమాచార్య జయంత్యుత్సవం, సంజీవని ఆసుపత్రి, కూచిపూడి నాట్యోత్సవం వంటి విభిన్న భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రవాసుల మనస్సులు చూరగొందని రాజు చామర్తి వివరించారు.




































































































