🕑 Published: August 15, 2026 at 11:37 AM CST
సేవను జీవిత పరమార్థంగా, దాతృత్వాన్ని జీవన విధానంగా మలుచుకున్న శోభారెడ్డి, ప్రసాద్ రెడ్డి దంపతులు భారత్‌తో పాటు అమెరికాలోనూ అనేక మంది చిన్నారులు, కుటుంబాలు, వెనుకబడిన వర్గాల జీవితాల్లో సానుకూల మార్పుకు కారణమవుతున్నారు. ఇటీవల కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు పోషకాహారం సకాలంలో అందించేందుకు అవసరమైన ఆహార రవాణా వాహనాల కొనుగోలుకు శోభారెడ్డి 25 వేల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. రోజుకు సుమారు 15 వేల మంది విద్యార్థులకు పోషకాహారం అందించే లక్ష్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ చేపట్టనున్న వంటశాల నిర్మాణానికి దంపతులు 2.5 లక్షల అమెరికన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన బాలబాలికలకు ఉచిత పాదరక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రథమ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రారంభించి, తొలి దశలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని పది కేంద్రాల్లో అమలు చేస్తున్నారు.
ఆరోగ్య సేవల రంగంలోనూ ఈ దంపతుల సేవలు విశేషంగా కొనసాగుతున్నాయి. చెన్నై శంకర నేత్రాలయం కోసం అత్యాధునిక మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటుకు 5.5 లక్షల అమెరికన్ డాలర్ల విరాళాన్ని అందించడంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సుమారు 500 కిలోమీటర్ల పరిధిలో నేత్ర వైద్య సేవలు అందించే అవకాశం ఏర్పడింది. శంకర నేత్రాలయ యూఎస్ఏతో ప్రసాద్ రెడ్డి 1988 నుంచి అనుబంధంగా కొనసాగుతూ ప్రస్తుతం బోర్డు సలహాదారుగా, బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలందిస్తున్నారు. ట్విస్టెడ్ ఎక్స్ సంస్థ అధ్యక్షుడు, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం సంస్థ లాభాల్లో సుమారు 13 శాతాన్ని డల్లాస్ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు. ఆయన సేవలకు న్యూజెర్సీ రాష్ట్ర సెనెట్, అసెంబ్లీ సత్కారం లభించగా, ప్రతిష్ఠాత్మక ‘శంకర రత్న’ పురస్కారం కూడా అందుకోనున్నారు. చిన్నారుల సంక్షేమం, విద్య, పోషకాహారం, ఆరోగ్యం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ దంపతులు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని పలువురు ప్రవాసులు కొనియాడారు.


