🕑 Published: August 15, 2026 at 11:33 AM CST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బర్డ్ (BIRRD) ట్రస్ట్ ఆసుపత్రి డైరెక్టర్, ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డా. గుడారు జగదీశ్‌ను విశిష్ట సేవలకు గుర్తింపుగా ఘనంగా సత్కరించారు. సంస్థలో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పేదలు, నిరుపేదలు, దివ్యాంగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో ఆయన చూపిన అంకితభావాన్ని టీటీడీ ప్రత్యేకంగా గుర్తించింది. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జేఈవో తదితరుల సమక్షంలో డా. జగదీశ్‌కు ప్రశంసా పత్రంతో పాటు 5 గ్రాముల వెండి డాలర్లు అందజేశారు.
బర్డ్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యసేవలను బలోపేతం చేయడంతో పాటు ఆధునిక వైద్య విధానాలు, క్లిష్టమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, జాయింట్ రీప్లేస్‌మెంట్, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, డిఫార్మిటీ కరెక్షన్, ట్రామా, లింబ్ రీకన్‌స్ట్రక్షన్, పునరావాస సేవల అభివృద్ధిలో డా. జగదీశ్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆర్థిక స్థోమత లేని రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం, దివ్యాంగులకు పునరావాసం ద్వారా స్వావలంబన, ఆత్మవిశ్వాసం కల్పించడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. డైరెక్టర్‌గా ఆయన ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, శస్త్రచికిత్సా సౌకర్యాల అభివృద్ధితో పాటు వైద్య విద్య, యువ వైద్యుల శిక్షణ, CME కార్యక్రమాలు, అకడమిక్ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇచ్చారు. బర్డ్ ఆసుపత్రిని వైద్యం, పునరావాసం, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న కృషి టీటీడీ వైద్యసేవలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఆయన సేవలు “మానవ సేవే మాధవ సేవ” అనే టీటీడీ ఆశయానికి అనుగుణంగా కొనసాగుతున్నాయని పలువురు అభినందించారు.
ఈ సన్మానం తన వ్యక్తిగత పురస్కారంగా కాకుండా బర్డ్ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, పరిపాలనా, సహాయక సిబ్బంది సమష్టి కృషికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు డా. జగదీశ్ తెలిపారు. ఈ గౌరవం మరింత బాధ్యతతో, అంకితభావంతో సేవలందించేందుకు ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు. పేదలకు అత్యాధునిక వైద్యం, దివ్యాంగులకు చలనశక్తి, ప్రతి రోగికి గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో భవిష్యత్తులోనూ సేవలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.

