🕑 Published: August 13, 2026 at 09:18 AM CST
హిందూ ధర్మ పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ, నదీ సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించే లక్ష్యంతో గుండ్లకమ్మ నదీ తీరంలో ప్రత్యేక యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు దాసరి శ్రీనివాసులు తెలిపారు. గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద పుట్టి సుమారు 280 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలు సమీపంలోని ఉలిచి (గుండాయపాలెం) వద్ద బంగాళాఖాతంలో సంగమించే గుండ్లకమ్మ నది ప్రకాశం జిల్లా జీవనంతో ముడిపడి ఉందన్నారు. నదీ తీరాల్లోనే మానవ నాగరికతలు వికసించాయని, గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలోనూ ప్రాచీన బౌద్ధ నాగరికతకు సంబంధించిన అనేక ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
గత జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుండ్లకమ్మ నదీ తీరంలోని ఏడు గ్రామాల్లో స్థానిక ప్రజల సహకారంతో స్థానిక జాతుల మొక్కలను నాటి ‘గుండ్లకమ్మకు హరిత హారం’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 13 మండలాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్వచ్ఛ భారత్, హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమాలతో అనుసంధానించి విస్తరించాలన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే HDPT సభ్యులు నదీ తీర గ్రామాలను సందర్శించి రూట్ మ్యాప్ సిద్ధం చేయడం యాత్రకు ఉపయోగపడుతుందని తెలిపారు.
రాబోయే శరన్నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని తొమ్మిది రోజుల పాటు గుండ్లకమ్మ నదీ తీర గ్రామాల్లో స్వయంగా పర్యటించి స్థానికులను పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, నదీ సంరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని దాసరి శ్రీనివాసులు సంకల్పించారు. యువతను చైతన్యపరచడం, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, స్థానికుల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ యాత్రలో ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని తెలిపారు. ఎస్.ఎన్.పాడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ అధ్యక్షతన వచ్చే శనివారం సమావేశం నిర్వహించి యాత్రకు సంబంధించిన వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
