రైతు జీవనంపై తానా ఉగాది కవిసమ్మేళనం

Featured Image

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” కార్యక్రమం జరుగుతోంది. అందులోభాగంగా ఆదివారం శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై కార్యక్రమం జరిగింది. ఈ 78వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవి సమ్మేళనంలో 30 మందికిపైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రిటిష్ కాలం నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను సోదాహరణగా వివరించారు. అలాగే రైతులకు వ్యవసాయ సంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశు ఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతుల కోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ.. నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచ సాహిత్య వేదిక ఇంత పెద్ద ఎత్తున కవి సమ్మేళనం నిర్వహించడం ముదావహమన్నారు. ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాల మధ్య ఆ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ముఖ్యఅతిథిగా పాల్గొని...కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రైతు కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన తనకు వ్యవసాయంలోని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని.. ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అని పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ..వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలో ఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాకవి పోతన, కవి సార్వభౌమడు శ్రీనాధుడు లాంటి ప్రాచీన కవులు సైతం స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని గుర్తు చేశారు. అలాగే గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాధగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరం కాదన్నారు.

రైతు నేపథ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతో ఉందని గుర్తు చేశారు. ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయని ఆయన తెలిపారు. మన విద్యా విధానంలో సమూలమైన మార్పులు రావాలని.. పసి ప్రాయం నుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలన్నారు. చట్టాలు చేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే..పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి 30 మందికి పైగా కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు.. కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.

దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి కన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామి నాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె.గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.

Tags-TANA Ugadi Kavisammelanam on Farmers

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles