🕑 Published: June 07, 2026 at 09:34 PM CST
ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం, ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో మొత్తం ఎడ్యుకేషన్ లోన్ బుక్ విలువ రూ.1.55 లక్షల కోట్లకు చేరింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 13.4శాతం ఎక్కువ. కేవలం ఈ ఏడాది మార్చి నెలలోనే విదేశీ విద్య, వసతి ఖర్చుల కోసం భారతీయులు ఏకంగా 450 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,300 కోట్ల)ను విదేశాలకు పంపించారు.
* రూపాయి శాపాలు
విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు రూపాయి శాపంగా మారింది. డాలర్‌తో మన కరెన్సీ విలువ గత 12 నెలల్లో 10 శాతానికి పైగా పతనమైంది. దీంతో ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్లు తీసుకున్నవారు తీవ్రంగా నష్టపోతున్నారు. బ్యాంకులు లోన్ అమౌంట్ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వవు. సెమిస్టర్‌కు ఒకసారి పంపుతాయి. దీంతో ఫీజులో ఎటువంటి మార్పు లేకపోయినా లోన్ అమౌంట్ పెరిగిపోతోంది. టాప్‌అప్ లిమిట్ అయిపోతోంది. అంతేకాకుండా విదేశాల్లో ట్యూషన్ ఫీజులు, వసతి ఖర్చుల కోసం తల్లిదండ్రులు పంపే డబ్బు సరిపోవడం లేదు. ఫీజులు డాలర్లలో చెల్లించాల్సి రావడంతో విద్యార్థుల ఖర్చులు భారీగా పెరిగాయి.
* పెరిగిన ఖర్చు
ఏడాది క్రితం రూపాయి విలువ డాలర్‌తో రూ.85గా ఉంటే, ప్రస్తుతం అది రూ.95 నుంచి రూ.96 దాటింది. రూపాయి విలువ క్షీణించడంతో మధ్యతరగతి కుటుంబాల ఖర్చులు అమాంతం పెరిగాయి. దీనివలన రూ.7 నుంచి రూ.8 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. కేవలం కోర్సు ఫీజులే కాకుండా, రోజువారి ఖర్చులు, చేతి ఖర్చులు, చివరకు విమాన ప్రయాణ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఏడాది క్రితం అమెరికాకు రూ.96 వేలు ఉన్న రౌండ్-ట్రిప్ ఫ్లైట్ టికెట్ ధర ఇప్పుడు సగటున రూ.1.6 లక్షలకు చేరింది. గత ఏడాదిన్నర కాలంలో రూపాయి విలువ రూ.83 నుంచి రూ.96కి పడిపోవడం వల్ల, అమెరికాలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివే విద్యార్థిపై అదనంగా రూ.30 నుంచి రూ.35 లక్షల భారం పడుతోంది.
* టాప్-అప్ కష్టాలు
చాలా మంది విద్యార్థులు ప్రస్తుతం రూ.1 లక్ష నుంచి రూ.6 లక్షల వరకు టాప్అప్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, టాప్-అప్ అభ్యర్థనలను బ్యాంకులు కొత్త లోన్ శాంక్షన్‌లుగానే పరిగణిస్తాయి. కాబట్టి విద్యా ఖర్చులను తిరిగి రివ్యూ చేయడం, విద్యార్థి, గ్యారంటర్ల (తల్లిదండ్రుల) రీపేమెంట్ సామర్థ్యాన్ని మళ్లీ అంచనా వేయాల్సి వస్తోంది. దీంతో ఎడ్యుకేషన్ లోన్లపై అదనంగా టాప్అప్ లోన్లు తీసుకోవడం కష్టంగా మారింది. విద్యార్థులు అదనపు స్కాలర్‌షిప్‌ల కోసం ప్రయత్నిస్తుండగా, మరికొందరు తల్లిదండ్రులు తమ సేవింగ్స్‌ను ఫీజుల కోసం సర్దుబాటు చేయాల్సి వస్తోంది. భారతదేశంలో విదేశీ విద్యా రుణాల మార్కెట్ ఏటా రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ/ప్రైవేట్ బ్యాంకులు, ఎడ్యుకేషన్-ఫోకస్డ్ ఎన్‌బీఎఫ్‌సీల వాటా సమానంగా ఉంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే ఈ మార్కెట్లో 20-25శాతం వాటాను కలిగి ఉంది.
