వంగూరిఫౌండేషన్‌-శ్రీసాంస్కృతికకళాసారథి-వంశీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం

Featured Image

వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, శ్రీసాంస్కృతిక కళాసారథి-సింగపూర్‌, వంశీ ఇంటర్నేషనల్‌-ఇండియా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వీరమంగా ఈ కార్యక్రమం కొనసాగింది.

విశ్వావసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని 80 మంది కవులతో అంతర్జాతీయ కవి సమ్మేళనం, 20 నూతన గ్రంథావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ గారికి ‘రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార’ ప్రదానము, డా. బులుసు అపర్ణచే ప్రత్యేక ‘మహిళా అష్టావధానము’ మొదలైన అంశాలతో ఈ ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.

ఉదయం 9 గంటలకు డా. వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఈ సభ ప్రారంభమైంది. కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.

తదనంతరం ఖతార్ నుంచి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జేవీ పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన “9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక” కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన “అంతర్జాతీయ కవి సమ్మేళనం”లో తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, అండమాన్‌ దీవులు, ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాల నుంచి వచ్చిన సుమారు 80 మంది కవులు తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధా దేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ‌. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగరి, డా‌ కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో పేరెన్నికగన్న కవులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా శ్రీ పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని ఆసాంతం ఆసక్తికరంగా నడిపించారు.

అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున “రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం” అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

అనంతరం శలాకవారు మాట్లాడుతూ.. తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో ‘సమస్యా పూరణం’ అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ “అవధాన కవిత్వం – సమస్యలు” అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.

సాయంత్రం 5:30 గంటల నుంచి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, ఉగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుంచి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది “సంపూర్ణ మహిళా అష్టావధానం”గా ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడి ప్రపంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.

Tags-Vamsi Vanguri Samskritika Kalasarathi International Ugadi Sahitya Sammelanam

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles