తానా ఆధ్వర్యంలో విజయవంతంగా 85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు

Featured Image

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెలుగు' పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా 'రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – 85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు' అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తిని కల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు.

ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘన నివాళులర్పించారు.

విశిష్టఅతిథులుగా ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు),

రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),

నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),

మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు),

డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు),

చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు),

మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి),

గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-TANA Radio Akkayya Annayya Andhra Balananda Sangham

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles