TNI Exclusive-పోలవరపు శ్రీకాంత్‌పై కోర్టులో కేసు ఫైలు చేసిన తానా

Featured Image

తానా సేవా విభాగమైన ఫౌండేషన్ నుండి $3.64 మిలియన్ డాలర్లు (₹30కోట్లు) కొల్లగొట్టిన అప్పటి ఫౌండేషన్ కోశాధికారి పోలవరపు శ్రీకాంత్‌పై ఎట్టకేలకు న్యాయపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. జనవరి 8న తానా సభ్యులకు బోర్డు ఛైర్మన్ డా. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ పంపిన ఈమెయిల్ దరిమిలా అసలు కేసు పెట్టారా? లేదా? అనే ఊహాగానాలకు తెరదించుతూ మే 9వ తేదీన (శుక్రవారం) టెక్సాస్ నార్తన్ డిస్త్రిక్ట్ కోర్టులో పోలవరపు శ్రీకాంత్, ఆయన సతీమణి కాట్రగడ్డ సుధ, నగదు బదిలీ జరిగిన సంస్థ బృహత్ టెక్నాలజీస్ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు తానా లాయర్లు నేడు శ్రీకాంత్-సుధలకు సమన్లు జారీ చేశారు. సేవా సంస్థల్లో కోశాధికారిగా బాధ్యత నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించడమే గాక ఆర్థిక మోసానికి పాల్పడిన నేరాల క్రింద వీరికి నోటీసులు జారీ చేశారు.

ప్రజాసమాచరమైన ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు PACER ఖాతా ద్వారా TNILIVEకు లభించాయి. అందులోని సారాంశాం...

2024 నవంబరు 23న శ్రీకాంత్ ఈమెయిల్ ద్వారా బోర్డు ఛైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్, ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్‌లకు నగదు తానా ఖాతాల నుండి తొలగించిన మాట వాస్తవేమనని ఒప్పుకున్నాడు. తానా ఖాతా నుండి తీసిన సదరు నగదును అధిక వడ్డీ వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టానని, ఈ వడ్డీని కూడా తానా సేవా కార్యక్రమాలకు వినియోగించడానికే తాను ఈ ఆలోచన చేశానని తెలిపాడు. మొత్తం తాను అనధికారికంగా బదిలీ చేసుకున్న $3.6మిలియన్ డాలర్లకు మరో $4లక్షల60వేల డాలర్లు జోడించి 2024 డిసెంబరు 15కల్లా మొత్తం తిరిగి చెల్లిస్తానని వెల్లడించాదు. ఈ అక్రమంలో తాను ఒక్కడినే భాగస్వామినని, ఇతరులు ఎవ్వరికి ఇందులో పాత్ర లేదని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.

ఇచ్చిన మాట ప్రకారం నవంబరు 25న, డిసెంబరు 16,17,23,30,31 తేదీల్లో, జనవరి 29న శ్రీకాంత్ విడతల వారీగా నగదు తిరిగి తానా ఖాతాలోకి బదిలీ చేశాడు. మొత్తం $6లక్షల50వేల డాలర్లను అతడు తిరిగి చెల్లించాడు. వడ్డీ $4లక్షల60వేలు, అసలు $3మిలియన్లు వెరసి మరో $3.46మిలియన్ డాలర్లు (₹28కోట్లు) ఇంకా బాకీ ఉండగా గడిచిన 3 నెలలుగా శ్రీకాంత్ ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ఈ క్రమంలోనే తానా కోర్టు సమన్ల ద్వారా శ్రీకాంత్‌పై చర్యలకు ఉపక్రమించింది.

* తిరిగి చెల్లించడం ఎందుకు మానేశాడు?

నవంబరులో వ్రాసిన ఈమెయిల్‌లో తాను ఒక్కడినే ఈ చర్యకు పాల్పడినట్టు శ్రీకాంత్ ఒప్పుకున్నప్పటికీ, గత కొద్దికాలంగా చెల్లింపులు మానేసి చేతులెత్తేసినట్లు సమాచారం. తానా ఫౌండేషన్ నగదు వలన లాభపడినవారు, లబ్ధిపొందిన వారు చాలామంది ఉన్నారని, వారి జాబితా అధికారులకు విడుదల చేస్తానని వాపోయినట్లు సమాచారం. అందుకే అతను తిరిగి చెల్లింపులు చేయట్లేదనే వాదన ఒకటి కూడా ప్రచారంలో ఉంది.

* బోర్డు సంచలనాలు

శ్రీకాంత్ అంశాన్ని ఒకవైపు, 2019 నుండి తానా చరిత్ర ఇవ్వమని FBI నోటీసులు ఒకవైపు పెట్టుకుని.. తానా బోర్డు పలు సంచలనాలకు తెరలేపింది. ఈ పరిణామాలతో తానా సంస్థ బలహీనపడిందని, అందుకే ఇంటర్వ్యూ పద్ధతిలో ఈసారి తానా కార్యవర్గాన్ని నియమిస్తామని బోర్డు ఏప్రిల్ 15న తానా రాజ్యాంగాన్ని మార్పు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. బోర్డు సభ్యులు కొంతమంది ఇప్పటికే రాజీనామా సమర్పించగా, మరికొంతమందికి ఈ అంశాలపై మాట్లాడేందుకు ఆధారాలతో సహా సమావేశానికి హాజరు కావాలని FBI నుండి పిలుపులు రావడం గమనార్హం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న వారే సంస్థ లక్ష్యాలను గుల్లబార్చగా, నాలుగు గోడల మధ్య ఎంపిక కాబడినవారు సంస్థ ఆశయాలకు ఎలా గొడుగుపడతారనే ప్రశ్న ప్రవాస సభ్యుల నుండి వినిపిస్తోంది.

* సంఘటితమైతేనే సంస్థకు బలం

"దొంగలు పడిన ఆరునెలలకు ఇంటికి తాళం వేసినట్లు"...ఎప్పుడో గత ఏడాది అక్టోబరులో జరిగిన మోసానికి కనీసం ఇప్పుడైనా తానా పెద్ద తలకాయలు స్పందించి కేసు ఫైలు చేయడంపై ప్రవాసులు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. అసలు సమస్యపై తూతూమంత్రంగా దృష్టి పెట్టి చాపకింద నీరులా రాజ్యాంగాన్ని మార్చేసి, అధికార దోపిడీకి లాకులెత్తే వారి పట్ల సభ్యులందరూ సంఘటితంగా పోరుసలిపితేనే సంస్థ బలోపేతమవుతుంది. లేదంటే ఎందరో కష్టార్జితానికి విలువ లేకుండా ఒకరిద్దరి ఖాతాల్లోకి మళ్లీ బదిలీ అయిపోయి మాసిపోతుంది. తానా రాజ్యాంగాన్ని మార్పు చేసిన బోర్డు చర్యలను నిరసిస్తూ ప్రవాసుల మద్దతును కూడగట్టే ప్రయత్నం జరుగుతోంది. మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు -https://gofund.me/64cdb484

---సుందరసుందరి(sundarasundari@aol.com)

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-TANA Foundation Srikanth Polavarapu Sudha Fraud Court Notices Issued

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles